ఎంతకైనా తెగిస్తాం | Sakshi
Sakshi News home page

ఎంతకైనా తెగిస్తాం

Published Sat, Oct 1 2016 3:51 AM

ఎంతకైనా తెగిస్తాం - Sakshi

మాకూ సర్జికల్ దాడులు చేయడం వచ్చు
- కశ్మీర్ నుంచి దృష్టి మరల్చేందుకే ఈ దాడి
- పాక్ కేబినెట్ భేటీలో ప్రధాని షరీఫ్
 
 ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ వెంబడి భారత్ చేసిన దాడులతో మొత్తం ఆసియా ప్రాంతం భద్రతకే ప్రమాదం వాటిల్లిందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. భారత్ సర్జికల్ దాడి నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో అత్యవసరంగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేసిన షరీఫ్.. దేశంలో, సరిహద్దు వద్ద భద్రత, తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భారత్ దాడులను తిప్పికొట్టే సత్తా పాక్‌కు ఉందన్నారు. పాక్ శాంతిని కోరుకుంటుందని అయితే ఎల్వోసీ వద్ద భారత్ దూకుడు చర్యలకు దిగితే.. తన ప్రజలను కాపాడుకునేందుకు పాక్ ఎంతకైనా తెగిస్తుందన్నారు. తమ బృందాలు కూడా సమర్థవంతంగా సర్జికల్ దాడులను నిర్వహించగలవని.. పాక్ ఆర్మీకి దేశమంతా మద్దతుగా ఉందన్నారు. సీమాంతర దాడులను భారత ప్రభుత్వం, మీడియా సర్జికల్ దాడులుగా గొప్పలు చెప్పుకుంటోందని.. అలాంటి దాడులేమీ జరగలేదని షరీఫ్ పునరుద్ఘాటించారు.

నియంత్రణ రేఖ వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. కశ్మీర్లో జరుగుతున్న అకృత్యాల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు భారత్ ఈ దాడులకు దిగిం దని కేబినెట్ భేటీలో షరీఫ్ చెప్పారు. ఉడీ ఘటనపై పాకిస్తాన్ విచారణ చేపడుతుందన్నారు. కేబినెట్ ముక్త కంఠంతో ప్రధాని వ్యాఖ్యలను సమర్థించింది.  కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు మానవ హక్కుల బృందాలను పంపించాలన్న ఐక్యరాజ్యసమితి హై కమిషనర్ నిర్ణయాన్ని ఈ సమావేశం స్వాగతించింది. జమ్మూకశ్మీర్ ప్రజలకు రాజకీయ, దౌత్యపర మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పాక్ అంతర్గత భద్రతలో భారత్ తలదూరుస్తోందనడానికి ఆధారాలున్నాయని వీటిని ప్రపంచదేశాల దృష్టికి తీసుకొస్తామని పాక్ హోం మంత్రి తెలిపారు.

 పీ5కు పాక్ ఫిర్యాదు
 తమను రెచ్చగొట్టేలా భారత్ ఎల్వోసీ వెంబడి దాడులకు పాల్పడుతోందని ఐరాస భద్రతా మండలి శాశ్వత దేశా లైన అమెరికా, చైనా, రష్యా, యూకే, ఫ్రాన్స్‌లకు పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. కశ్మీర్‌తోపాటు సరిహద్దు వెంబడి శాంతి నెలకొల్పేలా చొరవ తీసుకోవాలని కోరింది. భారత్ జరిపిన దాడుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారని తెలిపింది.
 
 ప్రతీకారం తీర్చుకుంటాం: హఫీజ్ సయీద్


 లాహోర్: భారత్‌కు అసలైన సర్జికల్ దాడులేంటో చూపిస్తానని హర్కతుల్ జిహాదీ ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్.. హెచ్చరించాడు. 2008 ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్.. ఫైజలాబాద్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ ‘ప్రధాని మోదీకి సర్జికల్ దాడేంటో చూపిస్తాం. తాజా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం. పాకిస్తాన్ జవాన్లు సర్జికల్ దాడులు చేస్తే ఎలా ఉంటాయో భారత మీడియాకు చూపిస్తాం. అప్పుడు అమెరికా కూడా మిమ్మల్ని కాపాడలేదు’ అని హెచ్చరించాడు. భారత దాడి పూర్తయిందని.. దీనికి సరైన సమాధానం ఇచ్చేందుకు పాకిస్తాన్‌కు అవకాశం వచ్చిందన్నాడు.
 
సరైన జవాబిస్తాం: పాక్ ఆర్మీ చీఫ్
భారత దాడులకు సరైన సమాధానం ఇస్తామని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రాహీల్ షరీశ్ శుక్రవారం హెచ్చరించారు. భారత్ చేపట్టే ఏ దూకుడు చర్యకైనా తీవ్ర ప్రతిఘటన ఉంటుందన్నారు. ఎల్వోసీ, వాస్తవాధీన రేఖ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని లాహోర్‌లో తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని జవాన్లను ఆదేశించారు. యుద్ధ సన్నద్ధతపై రాహీల్ సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement