10 సెకన్లలో 19 భారీ భవనాలు మాయం! | Sakshi
Sakshi News home page

10 సెకన్లలో 19 భారీ భవనాలు మాయం!

Published Mon, Jan 23 2017 3:04 PM

19 tower blocks topple like dominoes in spectacular demolition in China

బీజింగ్‌: ఏదైనా సరే నిర్మించడం కష్టమే కానీ, ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఇదే విషయాన్ని మరోసారి చైనాలో నిరూపితం అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పెద్ద పెద్ద బహుళ అంతస్తులు గలవి పందొమ్మిది భవనాలు.. సరిగ్గా పదంటే పదే సెకన్లలో నేలమట్టం చేశారు. పేక మేడల్లో అవి కూలిపోయి.. వాటి కారణంగా ఏర్పడిన దుమ్ముధూళి కాస్తా ఏదైన భారీ బాంబు దాడి చేశారా ఆ ప్రాంతంలో అని భ్రమను కలిగించేట్లుగా అది దర్శనమిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. చైనాలోని హుబేయ్‌ ప్రావిన్స్‌లోని హాంకౌలో దాదాపు 15 హెక్టార్లలో పెద్దపెద్ద భవన సముదాయాలు కలవు. అందులో ఒక్కోటి కనీసం పన్నెండు అంతస్తులు ఉంటాయి. ఇలాంటివి మొత్తం 32 భవనాలు ఉండగా అంతకుముందే కొన్ని కూల్చేశారు. అయితే, ఒకేసారి శనివారం రాత్రి 19 భవనాలకు ఐదు టన్నుల పేలుడు పదార్థాలను అమర్చి పది సెకన్లలో నేలమట్టం చేశారు.

దీనికి సంబంధించి ఆ భవన సముదాయ కూల్చివేతకు డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్న జియా యాంగ్‌షెంగ్‌ మాట్లాడుతూ అదే ప్రాంతంలో దాదాపు మూడున్నర బిలియన్లతో నిర్మించే ప్రాజెక్టు వచ్చిందన్నారు. ఇక్కడే కనీసం 707 మీటర్లకంటే ఎత్తుండే ఆకాశహార్మ్యాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభం నాటికి ఈ ప్రదేశమంతా ఖాళీ చేసి సిద్ధంగా ఉంచాలనే లక్ష్యంతో పడవేసినట్లు తెలిపారు. ఈ కూల్చివేత కారణంగా ప్రజాసౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని స్పష్టం చేశారు.

 

Advertisement
Advertisement