అసలా అబ్బాయి ఎలా బ్రతికాడు? | Sakshi
Sakshi News home page

అసలా అబ్బాయి ఎలా బ్రతికాడు?

Published Mon, Apr 21 2014 4:05 PM

అసలా అబ్బాయి ఎలా బ్రతికాడు?

ఆ పదహారేళ్ల కుర్రాడికి అమ్మా నాన్న మీద కోపం వచ్చింది. ఇల్లొదిలి పారిపోయాడు. ఇల్లే కాదు దేశమూ వదలివేయాలనుకున్నాడు. అంతే విమానాశ్రయం గోడను దూకి రన్ వేలోకి ప్రవేశించాడు. టేకాఫ్ తరువాత విమానం చక్రాలు ఇమిడిపోయే చిన్న కంతలో దూరిపోయాడు. అయిదున్నర గంటల ప్రయాణం అలాగే చేశాడు.


అయిదున్నర గంటల ప్రయాణం తరువాత విమానం నేలకు దిగింది. అందరితో పాటు, ఆ కుర్రాడూ దిగాడు. అప్పుడు అధికారులకు అనుమానం వచ్చింది. ఆ కుర్రాడిని అదుపులో తీసుకుని ప్రశ్నించారు. తానెలా వచ్చాడో ఆ కుర్రాడు వివరిస్తే అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి.


38 వేల అడుగుల ఎత్తున, ఆక్సిజన్ అందుబాటులో లేని పరిస్థితుల్లో, భయంకరమైన చలిలో ఆ కుర్రాడు అయిదున్నర గంటలు ఎలా బతికున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. ఇంతవరకూ బ్రతికినవారెవరూ లేరు.


ఇదంతా ఏదో సినిమా కథ అనుకుంటున్నారు కదూ! కానే కాదు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆదివారం ఉదయం హవాయి నుంచి ఒక కుర్రాడు ఇలాగే విమానం వీల్ వెల్ లో ప్రయాణించి కాలిఫోర్నియా చేరుకున్నాడు. అతను సెక్యూరిటీని ఛేదించడమే ఒక పెద్ద అద్భుతం అయితే, వీల్ వెల్ లో ప్రయాణించి, బతికి రావడం మహా అద్భుతం అంటున్నారు అధికారులు.


అ మృత్యుంజయుడిపై కేసు ఉండదు. శిక్ష ఉండదు. అతడిని ఆరోగ్యంగా కాపాడి, ఇంటికి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


గత ఆగస్టులో ఒక 14 ఏళ్ల నైజీరియన్ కుర్రాడు 35 నిమిషాలు వీల్ వెల్ లో ప్రయాణించి బతికాడు. మిగిలిన వారంతా చనిపోయారు. ఆగస్టు 2012 లో ఇలాగే ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఆకాశం నుంచి లండన్ వీధిలో పడి చనిపోయాడు. ఈ బాలుడు బ్రతకడం మాత్రం దేవుడి లీలేనంటున్నారు అధికారులు.

Advertisement
Advertisement