అంతిమ విజయం న్యాయానిదే | Sakshi
Sakshi News home page

అంతిమ విజయం న్యాయానిదే

Published Thu, Feb 16 2017 12:21 AM

అంతిమ విజయం న్యాయానిదే - Sakshi

ఆళ్లగడ్డ ముఖ్యనేతల చేరిక సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
చంద్రబాబు అన్యాయపాలన సాగదు... తరువాత వచ్చేది ప్రజా ప్రభుత్వమే


సాక్షి, హైదరాబాద్‌ : ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షంపై ఎంత అన్యాయంగా ప్రవర్తించినా అంతిమ విజయం మాత్రం ధర్మానిదే... న్యాయానిదే’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చంద్రబాబు మన పట్ల అన్యాయంగా ప్రవర్తించ వచ్చు... రాజకీయంగా దిగజారి వ్యవహరిం చవచ్చు... కానీ ఇదెంతో కాలం సాగదు...’ అని జగన్‌ హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆయన సోదరులు, కుటుంబ సభ్యులను, నాయకులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేర్చుకున్న అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తుందని, ఇంకొక సంవత్సరం దాటితే ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశిస్తామని, ఆ తరువాత వచ్చేది కచ్చితంగా మనందరి ప్రభుత్వమేనని, ప్రజా ప్రభుత్వమేనని జగన్‌ పేర్కొన్నారు. ఇవాళ అన్యాయం చేస్తున్న వాళ్లను, మోసం చేస్తున్న వాళ్లను చంద్రబాబునాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రలోభాలు పెట్టి, డబ్బులు ఆశ చూపి ఎమ్మెల్యేలను లాక్కుంటున్న రాజకీయ పరిస్థితులను రాష్ట్రంలో ప్రస్తుతం అందరూ చూస్తున్నారని జగన్‌ అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలను ఎంతటి హేయమైన పరిస్థితుల్లోకి , ఎంతటి అన్యాయమైన పరిస్థితుల్లోకి తీసుకెళుతున్నారో ప్రజలంతా చూస్తున్నారని ఆయన అన్నారు.

మనం కాలక్షేపానికి సినిమాకు వెళతామని, అందులో సగ భాగం వరకూ విలన్‌దే పైచేయిగా ఉన్నట్లు అనిపిస్తుందని అయితే చివరికి వచ్చేటప్పటికి ధర్మమే విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ‘రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్‌ ఏ గ్రంథం చదివినా తొలుత అన్యాయమే గెలిచినట్లుగా అనిపించినా... అంతిమంగా ధర్మమే గెలుస్తుందని, న్యాయమే గెలుస్తుందనేది సుస్పష్టమని జగన్‌ అన్నారు. ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. తాను వారందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నానని, ఇకపై ఒకరికి మరొకరు తోడుగా ఉంటామని జగన్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement