న్యాయం వైపు నిలిచినందుకే | Sakshi
Sakshi News home page

న్యాయం వైపు నిలిచినందుకే

Published Fri, May 27 2016 1:51 AM

న్యాయం వైపు నిలిచినందుకే - Sakshi

* విజయసాయిరెడ్డి ఎంపికపై వైఎస్ జగన్  
* విలువల కోసం ముద్దాయిగా మారడానికి కూడా సిద్ధపడ్డారు
* మానవ సంబంధాలు, విశ్వాసానికి కట్టుబడిన వారికి  పార్టీలో సముచిత స్థానం
* వ్యక్తులను వాడుకుని వదిలేయడం నాకు చేతకాదు

సాక్షి, హైదరాబాద్: నిజాయతీ, విలువలకు కట్టుబడి మానవ సంబంధాల కోసం గట్టిగా నిలబడినందుకే విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ తరఫున ఎంపిక చేశామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

ఆయన గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపిన తరువాత విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆయన ఎంపికకు గల కారణాలను వివరించారు. తనపై కొందరు కుట్రలు పన్ని, కుమ్మక్కై రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు బనాయించినప్పుడు దర్యాప్తు సందర్భంగా సాయిరెడ్డి నైతిక విలువలకే కట్టుబడ్డారని చెప్పారు. ఈ వ్యవహారంలో మొత్తం నెపాన్ని జగన్‌పై నెట్టేస్తే సాయిరెడ్డిని కేసుల్లో సాక్షిగానే ఉంచి ముద్దాయిగా చేయబోమని దర్యాప్తు సందర్భంగా విపరీతంగా ఒత్తిడి చేశారని, అయినా ఆయన లొంగకుండా న్యాయం వైపే నిలబడ్డారని కొనియాడారు.

ఈ వ్యవహారాల్లో ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగలేదని, జరిగిందే చెబుతాను గానీ, జరగనిది చెప్పబోనంటూ సాయిరెడ్డి దృఢంగా వ్యవహరించారని, విలువల కోసం ముద్దాయిగా మారడానికి కూడా సిద్ధపడ్డారని జగన్ పేర్కొన్నారు. మానవ సంబంధాలు, విశ్వాసానికి కట్టుబడిన వారికి  వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానం లభిస్తుందనే సందేశం ఇవ్వదలిచామన్నారు. ఒక్క మాట జగన్‌కు వ్యతిరేకంగా చెబితే వదలి వేస్తామని కొందరు ఒత్తిడి తెచ్చినా సాయిరెడ్డి విలువలకే కట్టుబడ్డారని తెలిపారు. విలువలకు కట్టుబడిన వ్యక్తులను వాడుకుని వదలి వేయడం కొందరి లాగా తనకు చేతకాదని, అది తన నైజం కూడా కాదని స్పష్టం చేశారు.
 
చంద్రబాబువి దుర్మార్గమైన రాజకీయాలు
మనుషుల మధ్య సంబంధాలను డబ్బుతో కొనేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇవాళ చేస్తున్న రాజకీయాలు దుర్మార్గమైనవని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, నట్టేట ముంచుతున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. కేవలం ఒకే ఒక్క మాట కోసం వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు.

ఎవరైతే పార్టీ కోసం శ్రమించారో, మానవ సంబంధాలకు విలువనిచ్చారో వారిని నాయకుడనే వాడు అర్థం చేసుకోవాలని, ఆ ఆలోచనతోనే ఈ ఎంపిక జరిగిందని వివరించారు. అందరి సమక్షంలో విజయసాయిరెడ్డికి మంచి మనసుతో ‘బీ ఫాం’ ఇచ్చి పంపాలని భావించామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల హర్షధ్వానాల మధ్య విజయసాయిరెడ్డికి ‘బీ ఫాం’ అందజేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనమండలిలో పార్టీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు బుట్టా రేణుక, వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
 
వైఎస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం: విజయసాయిరెడ్డి  
తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతోనే ఉంటానని, వారితో తనకు మూడు తరాల అనుబంధం ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై గురుతర బాధ్యతను ఉంచి, రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రాజ్యసభలో ప్రజల శ్రేయస్సుకు పనికి వచ్చే చట్టాల రూపకల్పనలో, వాటి అమలు విషయంలో ఒక ప్రతిపక్ష సభ్యుడిగా తన బాధ్యతను నిర్వహిస్తానని అన్నారు. చట్టసభల్లో విలువలు పడిపోతున్నాయని, వాటిని కాపాడడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన ఎంపికపై పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలంతా తన అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా సమర్థించారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
నేడు గుంటూరు జిల్లాకు జగన్
* పెదగొట్టిపాడులో మృతుల కుటుంబాలకు పరామర్శ

సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఉదయం 8.30కు కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏటుకూరు బైపాస్ మీదుగా ఉదయం 10 గంటలకు ప్రత్తిపాడు వెళతారని చెప్పారు. అక్కడ్నుంచి 10.30 గంటలకు పెదగొట్టిపాడు వెళ్లి ఇటీవల గుంటూరులో భవన నిర్మాణ పనుల్లో మృతిచెందిన ఏడుగురు యువకుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement