రూ.550 కోట్ల పన్ను వదిలేశారు! | Sakshi
Sakshi News home page

రూ.550 కోట్ల పన్ను వదిలేశారు!

Published Fri, Aug 28 2015 2:43 AM

Rs.550 crores tax leave it

ఏళ్లుగా రవాణాశాఖ మొద్దు నిద్ర
ఆన్‌లైన్‌లో లేని వాణిజ్యవాహనాల పన్ను బకాయిలపై ఆలస్యంగా దృష్టి
హడావుడిగా స్పెషల్ డ్రైవ్‌తో సరిదిద్దే కసరత్తు

హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 550 కోట్ల వాహనపన్నును రవాణా శాఖ వదిలేసుకుంది. ఇప్పుడు వసూలు చేయబోతే ఏ వాహనం ఎక్కడుందో తెలియని గందరగోళం ఎదురవుతోంది.   వాహనాల వ్యవహారాలను పర్యవేక్షించటమే ఏకైక విధిగా ఉన్న ఈ శాఖ ఇంతకాలం ఆ వాహనాలనే గాలికొదిలేసింది. దశాబ్దాల నిర్లక్ష్యాన్ని ఓసారి పరిశీలిస్తే పన్ను బకాయిలు రూ.550 కోట్లని తేలింది.

నాలుగేళ్ల నుంచే పద్ధతిగా..
నాలుగేళ్ల క్రితం వరకు కూడా రవాణాశాఖకు కేంద్రీకృత సర్వర్ వ్యవస్థ లేదు. 2011లో ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అధికారులు రెండేళ్లలో దాన్ని అన్ని జిల్లాలకు అనుసంధానించారు. అప్పటి నుంచే వాహనాలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చటం మొదలుపెట్టారు. అలాంటి వాహనాలను త్రీ టైర్ వాహనాలుగా, అంతకుముందు వివరాలు పూర్తి స్థాయిలో లేనివాటిని టూ టైర్ వాహనాలుగా పరిగణిస్తున్నారు.

ప్రయాణికులను తరలించే వాణిజ్య వాహనాలతోపాటు అన్ని రకాల సరుకు రవాణా వాహనాలు ప్రతి మూడు నెలలకు రహదారి పన్ను చెల్లించాలి.  ఇలాంటి కేటగిరీలోని త్రీ టైర్ వాహనాలు 8 వేలుగా నమోదయ్యాయి. వీటి వివరాలు సిద్ధంగా ఉండటంతో పన్ను వసూలు సమస్యగా మారలేదు. డిమాండ్ నోటీసులు జారీ చేసి వసూలు చేస్తున్నారు. కానీ వివరాలు లేని కేటగిరీలో ఉన్న టూ టైర్ వాహనాల నుంచి పన్ను వసూలు చేయటమే సవాల్‌గా మారింది. కార్యాలయాల్లో నమోదై ఉన్న చిరునామాలకు వెళ్తే ఆ వాహనాల జాడ కనిపించడం లేదు. కనీసం వాటి యజమానులెవరో కూడా తెలియడం లేదు. అలా అస్తిత్వం కోల్పోయిన వాహనాలెన్నో లెక్కల్లేవు. కొన్నింటిని వాటికి ఆర్థిక సాయం చేసిన సంస్థలు స్వాధీనపర్చుకుని వేరేవారికి విక్రయించాయి. వాటి వివరాలూ లేవు.  

రెట్టింపు జరిమానా
నిద్ర మేల్కొన్న రవాణా శాఖ ఈనెల 17 నుంచి స్పెషల్‌డ్రైవ్ చేపట్టింది. సిబ్బంది అంతా రోడ్లెక్కి కనిపిం చిన వాణిజ్య వాహనాన్ని తనిఖీ చేసి పన్ను లెక్కలు తీస్తున్నారు. బకాయి ఉన్నట్టు తేలితే కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేస్తున్నారు. గత 10 రోజుల్లో రూ.55 లక్షల వరకు బకాయిలు వసూలయ్యాయి. కొంతమంది వాహనదారులు స్వచ్ఛందంగా వచ్చి చెల్లించింది మరో రూ.34 లక్షలు. అధికారులు జప్తు ద్వారా వసూలు చేసింది రూ.21 లక్షలు. ఇప్పటికైనా బకాయిలు చెల్లించకుంటే రెట్టింపు పెనాల్టీ వసూలు చేస్తామని రవాణాశాఖ హెచ్చరిస్తోంది. స్పెషల్ డ్రైవ్‌ను వీలైతే పొడిగించే యోచనలోనూ ఉంది.

Advertisement
Advertisement