'లీకు' వీరుల వెనుక అదృశ్య హస్తం ? | Sakshi
Sakshi News home page

'లీకు' వీరుల వెనుక అదృశ్య హస్తం ?

Published Fri, Jul 29 2016 1:20 AM

'లీకు' వీరుల వెనుక అదృశ్య హస్తం ? - Sakshi

దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ 
ఎంసెట్-2 లీకేజీలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం
రంగంలోకి మరో మూడు బృందాలు
జేఎన్‌టీయూహెచ్ పాత్రపైనా విచారణ
ఎంసెట్ కన్వీనర్ నుంచి వివరాలు కోరిన సీఐడీ
ప్రింటింగ్ ప్రెస్ పాత్రను నిగ్గు తేల్చేందుకు స్పెషల్ టీమ్
భారీ కమీషన్లతో బ్రోకర్లకు ఆశచూపిన రాజగోపాల్‌రెడ్డి
సబ్ బ్రోకర్ల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులపై వల
ఎగ్జామ్‌కు ముందు ప్రశ్నలు-జవాబులు ఇచ్చి
విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించినట్టు అనుమానాలు
ఇద్దరి అరెస్టును అధికారికంగా ప్రకటించిన సీఐడీ

 
హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ వెనుక ఒకరిద్దరు సూత్రధారులే ఉన్నారా.. ఇంకా ఏమైనా అదృశ్య శక్తులున్నాయా? లీకేజీ కేవలం ఎంసెట్-2కు మాత్రమే పరిమితమైందా..? దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉన్న ఈ అదృశ్య శక్తులు ఇతర ప్రవేశ పరీక్షలనూ లీక్ చేశాయా..? తెలంగాణ వైద్య విద్య ప్రవేశ పరీక్ష ఎంసెట్-2 లీకేజీపై దర్యాప్తు చేస్తున్న సీఐడీకి ఇవే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో అదృశ్య శక్తుల బాగోతాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేందుకు సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరిన్ని బృందాలను రంగంలోకి దించింది. మరోవైపు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారికంగా వెల్లడించింది.
 
ఏటా ఇదే తంతు?
ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ఈ ఎంసెట్-2కే పరిమితం కాలేదని, ఏటా ఇదే తంతు జరుగుతున్నట్టుగా సీఐడీ అనుమానిస్తోంది. ప్రస్తుతం లీకైన ప్రశ్నపత్రాలు విద్యార్థులకే  కాకుండా విద్యా సంస్థలకు కూడా చేరాయా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగిస్తోంది. ప్రవేశ పరీక్షకు సంబంధించిన రెండు సెట్ల ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో.. ఎంసెట్‌ను నిర్వహిస్తున్న జేఎన్‌టీయూ(హెచ్) పాత్రపైనా లోతుగా విచారణ జరుపుతోంది. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సిబ్బంది పాత్రపై కొంత స్పష్టత రావడంతో ఎంసెట్ కన్వీనర్ రమణారావు నుంచి సీఐడీ అధికారులు గురువారం మరిన్ని వివరాలు సేకరించారు. ప్రశ్నపత్రాల తయారీ మొదలుకుని ప్రింటర్ల ఎంపిక, పరీక్ష నిర్వహణ తీరు తదితరాలపై మరింత లోతుగా ఆరా తీశారు. ఒకే ముద్రణ సంస్థకు రెండుసెట్ల ప్రశ్నపత్రాల ముద్రణ బాధ్యత అప్పగించడంపై ప్రశ్నించింది. మరోవైపు ప్రింటింగ్ ప్రెస్ నుంచే ప్రశ్నపత్రం లీకైందనే అనుమానాలు బలపడుతుండటంతో ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ పాత్రపైనా దృష్టి సారించారు. ఇప్పటికే సీఐడీకి చెందిన ఆరు బృందాలు లీకేజీ వ్యవహారంపై విచారణ జరుపుతుండగా.. తాజాగా మరో మూడు బృందాలు రంగంలోకి దిగాయి. ఇందులో ఓ బృందం ఢిల్లీలో ప్రింటింగ్ ప్రెస్ కార్యకలాపాలపై ఆరా తీస్తోంది. లీకేజీలో కీలకంగా వ్యవహరించిన షేక్ నౌషాద్‌ను అరెస్టు చేసేందుకు మరో రెండు బృందాలు మహారాష్ట్రలో గాలింపు చేపట్టాయి.
 
కళ్లు తిరిగే కమీషన్లతో బ్రోకర్లకు ఎర
 పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు చేతికి అందడంతో లీకేజీ సూత్రధారి రాజగోపాల్‌రెడ్డి... బ్రోకర్లకు భారీ క మీషన్‌ను ఆశగా చూపాడు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎర వేసే బాధ్యతను వారికి అప్పగించాడు. ‘ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ.35 ల క్షలు మొదలుకుని గరిష్టంగా మీరు ఎంతైనా వసూలు చేయండి. మీరు వసూలు చేసే మొత్తాన్ని బట్టి కమీషన్ ఉంటుంది’ అని హామీ ఇచ్చాడు. తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అడ్వాన్స్‌లో కొంత మొత్తం బ్రోకర్లకు కమీషన్‌గా ఇచ్చాడు. వీలైనంత ఎక్కువ మందిని ముగ్గులోకి లాగేందుకు సబ్ బ్రోకర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేందుకు గతంలో తమ ద్వారా జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలను ప్రస్తావించినట్లు సమాచారం. విచారణలో రాజగోపాల్‌రెడ్డి వెల్లడిస్తున్న అంశాలను విశ్లేషిస్తున్న సీఐడీ.. లీకేజీ కుట్రలో పై స్థాయిలో అదృశ్య శక్తులు ఉన్నట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అదృశ్య శక్తుల పాత్రను రూఢీ చేసేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు సీఐడీ నలుగురు బ్రోకర్లను అదుపులోకి తీసుకోగా.. హైదరాబాద్, ఏపీ, బెంగళూరుకు చెందిన మరింత మంది సబ్ బ్రోకర్లను పాత్రను గుర్తించింది.
 
ప్రశ్నలు-జవాబులు ఇచ్చి ప్రాక్టీస్
 లీకేజీ వలలో చిక్కిన విద్యార్థులను ఒక్కో బృందంలో 20కి మించకుండా ఈ ముఠా జాగ్రత్తలు తీసుకుంది. పరీక్షకు రెండు మూడు రోజుల ముందు ‘ప్రత్యేక శిక్షణ’ కేంద్రాలకు తరలించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, పుణె, ముంబై, విజయవాడ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలకు వచ్చిన విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను బృందాలుగా విభజించి సమాధానాలతో కూడిన ప్రశ్నపత్రాలు అందజేసి.. సాధన చేయించారు. ఒక్కో విద్యార్థికి రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే ప్రశ్నపత్రాన్ని చూసి సాధన చేసే అవకాశం కల్పించినట్లు సమాచారం. విద్యార్థులకు రెండు సెట్లకు సంబంధించి మొత్తం 320 ప్రశ్నలు (ఒక్కో సెట్‌లో 160 మార్కులు) అందజేశారు. అయితే వీటిలో కొన్ని తప్పుడు ప్రశ్నలను ఉద్దేశపూర్వకంగా చేర్చి విద్యార్థులకు అందజేసినట్లు విచారణలో తేలింది.
 
విచారణలో పొంతనలేని సమాధానాలు
 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి ఇప్పటివరకు 74 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరినట్లు ప్రాథమికంగా తేలగా.. 16 మంది తల్లిదండ్రులు మాత్రమే సీఐడీ విచారణకు హాజరయ్యారు. మిగతావారు తాము అందుబాటులో లేమని, సొంత పనులపై ఇతర ప్రాంతాల్లో ఉన్నామంటూ తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 41 ఎ కింద తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. కాగా, వరంగల్, పరకాల, భూపాలపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులను సీఐడీ గురువారం ప్రశ్నించింది. విచారణలో వీరు కూడా తల్లిదండ్రుల తరహాలోనే తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారు. తొలుత తాము ఎక్కడకీ వెళ్లలేదని బుకాయించిన విద్యార్థులు.. వారి కదలికలకు సంబంధించిన విమాన టికెట్లు తదితర ఆధారాలను ఎదుట పెడుతుండటంతో కంగుతింటున్నారు. తాము ప్రత్యేక శిక్షణ కేంద్రాలకు వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే అక్కడ సాధన చేసిన ప్రశ్నలు ఎంసెట్-2లో రాలేదని చెబుతున్నారు.

 లీకేజీలో ఇద్దరు అరెస్టు
 ఎంసెట్-2 లీకేజీలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ గురువారం ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన విష్ణుధర్ అలియాస్ విష్ణువర్ధన్, తిరుమల్ అలియాస్ తిరుమల్‌రావును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఇద్దరు సుమారు 25 మంది విద్యార్థులు, తల్లిదండ్రులను సంప్రదించి బెంగళూరుకు తీసుకెళ్లినట్లు గుర్తించామన్నారు. సూత్రధారి రాజగోపాల్‌రెడ్డి.. విద్యార్థులకు బెంగళూరులో ప్రశ్నలు, సమాధానాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించి పంపారన్నారు. తమ విచారణలో రెండు సెట్లకు సంబంధించి 320 ప్రశ్నలు లీకైనట్లు గుర్తించామన్నారు.

Advertisement
Advertisement