ఇంతటి పరాభవమా! | Sakshi
Sakshi News home page

ఇంతటి పరాభవమా!

Published Sat, Feb 6 2016 3:19 AM

ఇంతటి పరాభవమా! - Sakshi

గ్రేటర్ ఓటమిపై  కాంగ్రెస్‌లో విస్మయం
బాధ్యులెవరో తేల్చాలంటున్న ద్వితీయ శ్రేణి నేతలు
అగ్ర నేతలే నిండా ముంచారంటూ ధ్వజం

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠం అధికార టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని కాంగ్రెస్ అగ్రనేతలంతా ముందుగానే ఓ అంచనాకు వచ్చినా, తమకు మరీ ఇంత దారుణ ఓటమి ఎదురవుతుందని ఎవరమూ ఊహించలేదంటూ వాపోతున్నారు. 150 డివిజన్లలో కేవలం రెండంటే రెండు స్థానాలకే పరిమితం కావడం వారికి మింగుడుపడటం లేదు. తమ మేయర్ అభ్యర్థి కూడా ఓడిపోవడం క్షేత్రస్థాయిలో పార్టీ దుస్థితికి అద్దం పడుతోందన్న భావన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

ఇంతటి ఘోర పరాజయానికి కారణాలపై నేతలు రకరకాల కారణాలు విన్పిస్తున్నారు. మొన్న వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో చావుదెబ్బ తిని ఎంతోకాలం కాకుండానే ఇప్పుడిలా జీహెచ్‌ఎంసీలోనూ మట్టికరవడానికి కారణాలను నిష్పాక్షికంగా విశ్లేషించి కార్యాచరణ రూపొందించుకోకపోతే కష్టమేనని పీసీసీ ముఖ్య నేతలే అంటున్నారు. నేతల్లో ఐక్యత లోపించిందని, సమర్థంగా వ్యూహరచన చేసి దాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయగలిగిన నాయకుడులేకపోయాడన్న భావన వ్యక్తమవుతోంది. ఇక నేతల మధ్య సమన్వయం మొదలుకుని ఆర్థిక వనరుల సమీకరణ దాకా అన్ని విషయాల్లోనూ తప్పిదాలే దొర్లాయని విశ్లేషిస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు హవా చలాయించిన అగ్ర నేతలు చాలామంది జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో అంటీముట్టనట్టు వ్యవహరించారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం తమకు కేటాయించిన డివిజన్లలో కార్యకర్తలను కూడా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేకపోయారన్నారు. అస్మదీయులకు టికెట్లు ఇప్పించుకోవడంపై చూపిన శ్రద్ధలో పదో వంతు కూడా పార్టీని గెలిపించడంపై చూపలేదంటున్నారు. ఓటమికి బాధ్యులెవరో తేల్చాలని ద్వితీయ శ్రేణి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

 తీర్పు శిరసావహిస్తాం: భట్టి
ప్రజల తీర్పు బాధాకరమే అయినా శిరసావహిస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ‘‘టీఆర్‌ఎస్ కల్పించిన భ్రమలను, ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలు నమ్మినట్టు కనిపిస్తున్నది. ఓటమికి కారణాలను విశ్లేషించుకుని భవిష్యత్తులో పార్టీని నిర్మిస్తాం’’ అని చెప్పారు. టీఆర్‌ఎస్ భారీగా భ్రమలు కల్పించి అధికార దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు, అధికారులతో పాటు ఎన్నికల సంఘం కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పని చేసిందన్నారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపడంలో, ఓటర్ల మనోగతాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యామన్నారు. ఫలితాలపై ఆత్మవిమర్శ చేసుకుంటామని కాంగ్రెష్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement