రాజకీయాలకు పట్టిన చెద ఆయనే | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు పట్టిన చెద ఆయనే

Published Thu, Apr 28 2016 12:56 PM

రాజకీయాలకు పట్టిన చెద ఆయనే - Sakshi

చంద్రబాబు ఈ దేశ రాజకీయాలకు పట్టిన చెద అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిని చూసి దేశమంతా నివ్వెరపోతోందని ఆమె అన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో గల పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ తండ్రీకొడుకులు ఎలా దోచుకుంటున్నారో, రెండేళ్లలోనే రూ. 1.34 లక్షల కోట్లకు పైగా ఎలా అవినీతికి పాల్పడ్డారో పుస్తక రూపంలో ప్రచురించి తమ నాయకుడు ఢిల్లీ పెద్దలందరికీ అందించారని చెప్పారు. అన్నిపార్టీల వాళ్లు దీనిపై చర్చ ప్రారంభించారని, చంద్రబాబు అవినీతి, అక్రమాలు, నీతిమాలిన రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారని అన్నారు. అందుకే టీడీపీ మంత్రులు, నాయకులు కల్లు తాగిన కోతుల్లా అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారని మండిపడ్డారు. లోకేష్ మాటిమాటికీ దమ్ముంటే చర్చకు రా అంటాడని, ఇలాగే కేసీఆర్‌ మీద కూడా దమ్ముంటే అంటూ తొడగొడితే ఏమైందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అవినీతిపై చంద్రబాబు సిటింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణకు సిద్ధం కావాలని సవాలుచేశారు. దీనిపై అసెంబ్లీలో అయినా తీర్మానం చేయండి లేదా కేంద్రానికి లేఖ రాయండని ఆమె అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ తప్పు చేయలేదని, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జతకలిసి జగన్‌ను జైలుకు పంపారని రోజా చెప్పారు. వైఎస్ జగన్ ఈరోజుకు కూడా ధైర్యంగా కేసులు ఎదుర్కొంటుంటే.. చంద్రబాబు మాత్రం చీకట్లో చిదంబరాన్ని కలిసి విచారణ జరగకుండా చూసుకున్నారని విమర్శించారు.

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని, ఆ టేపుల్లోని గొంతు చంద్రబాబుదేనని ల్యాబ్‌లు కూడా నిర్ధారించాయని రోజా చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన బాబు.. ఏపీని అవినీతి నిలయంగా మార్చారని, ఆ తర్వాత మోదీ, పవన్ కల్యాణ్‌ల కాళ్లు పట్టుకుని అధికారంలోకి వచ్చారని అన్నారు. వైఎజ్ జగన్ మాత్రం ధైర్యంగా నిలబడి ఒంటరి పోరాటం చేశారన్నారు. ఏపీకి దేశ విదేశాల్లో చెడ్డపేరు తెచ్చింది చంద్రబాబేనని మండిపడ్డారు. కల్తీమద్యం, కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లను ఆయనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో బాబు అనుచరులు పేదలు, దళితుల పొట్టకొడుతున్నారన్నారు.

వైఎస్ పేరు చెబితే 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తాయని, అదే బాబు పేరు చెబితే కమీషన్లు, ముడుపులు, మాఫియాలే గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఘనత చంద్రబాబుదేనని ఆమె అన్నారు. ఇప్పటికైనా బాబు ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఆపి లక్ష కోట్ల సంపదను పేదలకు పంచిపెట్టాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది వైఎస్ఆర్‌సీపీలో కాదని, టీడీపీలోనేనని ఆమె అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరింది చంద్రబాబు అండ్‌ కోనే అని గుర్తు చేశారు. తాను అవినీతికి పాల్పడలేదన్న విషయమై చంద్రబాబు కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అని సవాలు చేశారు.

Advertisement
Advertisement