కథ: కర్మ | Sakshi
Sakshi News home page

కథ: కర్మ

Published Sun, Aug 17 2014 12:15 AM

Story

అయితే ఈ మూడ్రోజులూ మూడుపూటలా తిండిపెట్టి దివారాత్రాలు దివాణంలో ఉంచండ్రా వీణ్ని. ఈలోపు నా కష్టాలు కరగకపోతే వీణ్ని కండకో ముక్కగా నరికి, మన దివాణంలోని కుక్కలకు వెయ్యండి’’ అని పెద్ద పాలేరు వైపు చూసి హుకూం జారీ చేశాడు సూర్రెడ్డి.
 
‘‘ఆహా! సిరిగల మొఖం. కాకపోతే ఆ సిరి జేబుకాడికి రాకుండా శనిగాడు మోకాలడ్డుతున్నాడు’’ అని ముఖస్తుతితో పాటు మెలిక కూడా పెట్టాడు కొండదేవర. ‘శనిగాడా?’ అని చిచ్చుబుడ్డిలా వెలిగిన మొఖాన్ని చిరాగ్గా పెట్టాడు గవరయ్య. ‘‘నువ్వు కొన్ని యేళ్ల నుండి బంగారం పట్టుకున్నా బూడిదయ్యిపోతంది. అవునా? కాదా?’’ అన్నాడు కొండదేవర. తలూపాడు గవరయ్య. ‘‘నేను తలచిందే చెప్తున్నాను, నువ్వు తలూపుతున్నావు. ఏలిననాటి శని నిన్ను ఏపుకు తింటోంది. ఈశ్వరుడైనా శనీశ్వరుడికి భయపడతాడు. కానీ ఆ శనికి ఎలుగుబంటంటే భయం. ఏలిననాటి శని ఈ ఎలుగుబంటి ఎముకతో ఎల్లిపోద్ది. నీ గ్రహచారం మారిపోద్ది’’ అని కొండదేవర చిన్న ఎముక ముక్కనొకదాన్ని గవరయ్య చేతిలో పెట్టి, ‘రెండ్రోజులు ఉంచుకుని నిలవని నీటిలో కలిపేయ’మని చెప్పి, యాభై రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. గవరయ్య కొడుకు ఏదో జబ్బుపడి చచ్చిపోయాడు. కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మనేది పెట్టుకుని పెళ్లాం ప్రాణం విడిచింది. జీవచ్ఛవంలా బతుకుతూ బాధల్ని మర్చిపోవడానికి ఎప్పుడూ తాగుతూ ఒంటిగా ఊరి చివర పాకలో, పెద్ద పంటకాలువ గట్టు మీదుంటాడు. ముక్కు మూసుకుని తపస్సు చేసే మునులకు సైతం దొరకని ఏకాంతం ఎప్పుడూ ఉంటుందా గుడిసెలో.
    
అది జమీందారుగారి దివాణం. రెడ్డిరాజుల హయాంలో పరిపాలన తరువాత బ్రిటిష్‌వారి దగ్గర భరణాలందుకుంటూ స్వాతంత్య్రానంతరం భూములు కొన్ని కరిగిపోయినప్పటికీ ఊరికి పెద్దగా ఉన్న సూర్రెడ్డి గారిదది. రెడ్డిగారికి నీసు లేనిదే ముద్ద దిగదు. కొంగల చెరువులో కొరమీనులు తెప్పించి, మసాలా నూరుతుండగా బట్టలు మడవడానికొచ్చిన చాకలి సూరమ్మ కొండదేవర గురించి చెబితే, ‘పిలవమంది’ సూర్రెడ్డిగారి భార్య.
 
కొండదేవరొచ్చాక, అరుగు మీద సోఫాలో కూర్చుంది రెడ్డిగారి భార్య. బాసింపట్లు వేసుకుని కింద కూర్చొని, తాటాకులతో తయారైన తాళపత్ర గ్రంథం లాంటినొకదాన్ని తీసి, అందులో రూపాయి బిళ్లొకటి పెట్టమన్నాడు కొండదేవర. రూపాయి బిళ్ల పెట్టిన తాటాకుని చూసి ఏవో లెక్కలేసి నిట్టూర్చాడు. ‘‘తెలిసింది తల్లీ, దిష్టి దిగదుడిచి బయట పారేసిన ఎండు మిరపకాయని గానీ, నిమ్మకాయని గానీ, మసి బొగ్గుని గానీ ఈ ఇంటి యజమాని దాటాడు. అందుకే చెడు జరుగుతోంది తల్లీ’’ అని తాళపత్రాన్ని తాడుతో ముడేశాడు కొండదేవర.
     
 వాన నీటి కోసం చాతక పక్షులు చకచకా చలాగ్గా ఆకాశంలో తిరుగుతున్నాయి. ఆకాశమంతా కారు నలుపు. చిరుచిరు చినుకులతో స్నానం చేస్తున్న పచ్చటి పొలాల్లోని మట్టిరోడ్డులో తెల్లటి అంబాసిడర్ కారులో సూర్రెడ్డి గారున్నారు. ఆయనకు పంట యాభై ఎకరాలు, పాడి యాభై శాల్తీల దాకా ఉన్నాయి. గుబురు మీసాలున్న ఆయన గుండెల్లో ఇప్పుడు గుబులుగా ఉంది. పులివాగు పక్కనే ఆయన యాభై ఎకరాల ఏక చెక్కమడి వరి పైరుంది. పోయినేడాది పులివాగు పొంగి, గట్టు తెగి, రెడ్డిగారి పొలాలన్నింటినీ ముంచేసింది. ఇసుక పొలాల్లో మేటేసింది.
 
 వరి గింజలన్నీ ఇసుక పాలయ్యాయి. తూర్పు కొండల మీద కురిసిన వాననీరు పులివాగులోంచి కొంగ చెరువులోకి వస్తుంది. చెరువు నిండి వెనక్కి పోటు పొడుస్తుంది. వెనక్కి ప్రవహించే ఆ పోటుకి, ఎదురొచ్చే కొండనీరుకి మధ్య ఘర్షణ జరిగి, సుడిగుండాలు ఏర్పడి నీటి ఒరిపిడికి తూము దగ్గర గట్టుకి గండి పడింది. ఈసారి అలా జరగ్గూడదని కూలీల్ని పెట్టి ఇసుక బస్తాలు ఇబ్బడి ముబ్బడిగా వేయించి, గట్టుని కంచుకోటలా కట్టించాడు. కారు ముందు సీట్లో పెద్ద పాలేరు, వెనుక సీట్లో రెడ్డిగారు, కారు బయట చేతులు కట్టుకుని ముగ్గురు పాలేళ్లున్నారు. ‘‘పంట చేతికొచ్చేసరికి కొరివి దెయ్యంలా తుపాను తగలడుతుంది. చేలన్నింటికీ గండి కొట్టండి. నీరు దిగకుండా గడ్డివాముల పైన సరిగ్గా సర్దండి. నీళ్లు లోపలికి దిగితే, కుళ్లిపోయిన గడ్డి చివరికి చలిమంటకి కూడా పనికిరాదు’’ అని పాలేళ్లకి పనులు పురమాయించి, కారు ఇంటికి పోనిమ్మన్నాడు సూర్రెడ్డి. ఆకాశంలో మబ్బుల్లాగే ఆయన మనసులో మథనం. పోయినేడాది తుపాను వల్ల తినే తిండిలో ఇసుక పోసుకున్నట్టయింది. మందలో ఆయనకిష్టమైన ఆవు లక్ష్మి రేపో మాపో ఈనడానికి సిద్ధంగా ఉంది. అదెన్ని ఈతలు ఈనినా చచ్చిపోయిన లేగ దూడకే జన్మనిస్తుంది. సూర్రెడ్డికి ఆ ఆవు అంటే ఆరోప్రాణం. దానికేదన్నా జరిగితే, తల్లిలా తల్లడిల్లిపోతాడు.
 
 కారు దివాణంలోకొచ్చింది. కారు దిగి, కొండదేవరని చూసి, ‘‘పనులు మానేసి ఇలాంటి పగటి వేషగాళ్ల దగ్గర కూర్చున్నావా’’ అని భార్యని హూంకరించాడు. కొండదేవర అహం దెబ్బతింది. ముఖం మాడినా మాట మార్చి, ‘‘అయ్యగారి తత్త్వాన్ని తరచి చూస్తే, అయ్యగారు లోపల చెరుకు బయటికి కరుకు’’ అన్నాడు. ‘‘ఇలా అబద్ధాలాడే జనాన్ని మోసం చేస్తారు’’ సోఫాలో కూర్చుంటూ అన్నాడు సూర్రెడ్డి. ‘‘అయ్యగారూ! నేను అబద్ధాలాడి మీ నెత్తిన చెయ్యెడితే భగవంతుడు నా నెత్తిన చెయ్యెడతాడు. నేను మంత్రమేసిన ఈ నిమ్మకాయ, పసుపు, కుంకుమల్ని మీకు దిగదుడిసి ఊరవతల పచ్చని చెట్టు కింద పారెయ్యమనండి. మూడ్రోజుల్లోపే ఆ చెట్టు భగ్గున మండిపోద్ది, మీ కష్టాలు భళ్లున పగిలిపోతాయి. మీరు బూడిద చల్లితే బంగారం పండుద్ది’’ అన్నాడు నమ్మకమైన ఉపాయాల్ని చెబుతున్నట్టు కొండదేవర. సూర్రెడ్డిగారికి సర్రున కాలింది. ‘‘ఓహో! అలాగా! అయితే ఈ మూడ్రోజులూ మూడుపూటలా తిండిపెట్టి దివారాత్రాలు దివాణంలో ఉంచండ్రా వీణ్ని. ఈలోపు నా కష్టాలు కరగకపోతే వీణ్ని కండకో ముక్కగా నరికి, మన దివాణంలోని కుక్కలకు వెయ్యండి’’ అని పెద్ద పాలేరు వైపు చూసి హుకూం జారీ చేశాడు.
 
 కొండదేవర కొయ్యబారిపోయాడు. ‘‘పోన్లేండి, కోటి విద్యలు కూటి కొరకే కదా, వదిలెయ్యండి పాపం’’ అంది జాలిగా సూర్రెడ్డి భార్య. సూర్రెడ్డి కళ్లతో కోపాన్ని ఆమె మీదకు విసిరాడు. ఆమె సోఫాలోంచి లేచి వంటింట్లోకి వెళ్లిపోయింది. ‘‘నిన్ను బొట్టు పెట్టి బతిమిలాడాలా? అయ్యగారిని తీసుకెళ్లి అతిథిలా ఈ మూడ్రోజులు మర్యాద చెయ్యండి’’ అని అవే కళ్లను పెద్దపాలేరు మీదకి విసిరాడు. వాడు వడివడిగా వెళ్లి వీధి గేట్లు మూసేశాడు. అప్పటిదాకా గలగలా గోదారిలా సాగిన కొండదేవర మాటలు గొంతులో విషం పోసినట్టు, ఆనకట్ట వేసినట్టు ఆగిపోయాయి. పెద్దపాలేరు కొండదేవరని తీసుకెళ్లి తూర్పు పక్క గదిలో పెట్టి తాళం పెట్టాడు. తిరిగి వచ్చి సూర్రెడ్డి దగ్గర నిలబడ్డాడు. సూర్రెడ్డి సోఫాలోంచి లేచి లోపలికెడుతూ వాడి దగ్గర ఆ పసుపు, కుంకుమ, నిమ్మకాయ తీసుకొచ్చి, నాకు దిగదుడిసి మన పశువుల పాక దగ్గర తాడిచెట్ల దగ్గర ఏదో దాని మొదట్లో పెట్టు’’ అన్నాడు పెద్ద పాలేరుతో.
    
 ఆ రాత్రంతా కుంభవృష్టి కురిసింది. బడబాగ్ని భయపడేట్టు కురిసింది. గొడుగులు గుమ్మం దాటి రాకుండా విసురుగా కురిసింది. వాగూ వంక ఏకమయ్యేట్టు కురిసింది. ఆ రాత్రి పడిన పిడుగులకు పిల్లలే కాదు, పెద్దలు కూడా నిద్రపోలేదు. మెరుపులతో ఆ రాత్రి పట్టపగలయ్యింది. కొండదేవర మనసు కీడు శంకించింది. తెల్లారింది. అయినా వర్షం కురుస్తూనే ఉంది. కిటికీలోంచి కొండదేవర కొండల్ని చూశాడు. హత్య చేసిన హంతకుల్లా కనబడ్డాయవి. తాతల నాటి మామిడి చెట్టొకటి గోడని ఆనుకుని ఉంది. ఆ గోడ తన గోడుని విననంటూ చెట్టంత ఎత్తుగా ఉంది.
 
 పరగడుపునే పరిగెడుతూ పెద్దపాలేరు దివాణంలోకొచ్చాడు. పశువుల కొట్టం కూలిపోయేలా ఉందని సూర్రెడ్డికి చెప్పాడు. కారు కుదరదని, గొడుగు నిలబడదని మైకా కవరు కప్పుకుని సూర్రెడ్డి రెడీ అయ్యి, పశువుల పాక దగ్గరకు పాలేర్లందరినీ తీసుకెళ్లాడు. గండ్లు కొట్టించినా చేలంతా నీరే. మెరక పొలాల్లోని నీరు పల్లపు పొలాలైన తన చేలలోకి వచ్చి పడుతున్నాయి. గట్టు మీద నిలబడి గమనించాడు. పంటంతా పడిపోయింది. మట్టిలోంచి పుట్టిన మాణిక్యాలు మట్టిగొట్టుకుపోతున్నాయి. గొడ్లన్నీ మోకాళ్ల వరకూ మునిగి ఉన్నాయి. గబగబా గొడ్లన్నింటి పలుపుతాళ్లు విప్పేశారు. వాటన్నింటినీ పల్లం పొలాల్లోని పాక నుండి మెరక పొలాల్లోని పాకలోకి తోలారు. సూడి ఆవు నిలబడలేక నీళ్లలో పడుకుంది. దాని పీకల దాకా నీళ్లున్నాయి. సూర్రెడ్డికి ప్రాణం నీరైపోయింది. దాన్ని లేపి, దివాణంలోకి తోలుకు రమ్మన్నాడు. అప్పుడే చెవుల్లో కర్ణభేరి పగిలేలా పిడుగొచ్చి తాడితోపుల్ని తాకింది. అంత వానలోనూ అగ్ని ఆరక, తాడిచెట్లన్నీ తగలబడిపోతున్నాయి. ఆవుని తోలుతున్న సూర్రెడ్డి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు.
 
     
 దివాణంలో ఆవుని అరుగు మీద కట్టేశారు. వర్షం మాత్రం వదలని శనిలా కురుస్తూనే ఉంది. పొద్దుగూకింది. ఆ రోజు ఆవు ఈనుతుందని అరుగుమీద పాలేర్లందరూ పచార్లు చేస్తున్నారు. కొండదేవరున్న గదికి బయట రాత్రిళ్లు తాళం పెట్టట్లేదు. కొండదేవర తిరిగే కాలు, ఆడే నోరు ఆగవు. అయినా అతను పారిపోయే ప్రయత్నాలు చెయ్యడం లేదు. ఆకాశమంత గోడ, కసిగా చూసే కుక్కలు. రాత్రిళ్లు వాటిని వదిలిపెట్టడంతో అవి అరుస్తూ దివాణమంతా షికార్లు కొడుతుంటాయి. బయట వాటికి దొరికితే పరుగున వచ్చి పీక కొరికేస్తాయేమోనని భయం. వాటి నోటన పడి చచ్చే కంటే, సూర్రెడ్డి చేతిలో తన్నులో, తిట్లో తినడమే ఉత్తమమని ఊరుకున్నాడు. పైగా వరండా దగ్గర పారుతున్న వరద నీటిని చూసి, ఊరంతా ఉప్పెనలా ఉంటుందని భయపడ్డాడు. ప్రమాదాల్ని పసిగట్టి పారిపోవాలన్న ప్రయత్నాన్ని పాతాళ గంగలోకి తొక్కేశాడు.
 
 అర్ధరాత్రయ్యింది. లాంతరు వెలుగులో సూర్రెడ్డి తన క్రీనీడను చూసుకుంటున్నాడు. ఆలమందల్ని ఆదుకున్నానన్న ఆనందం ఉన్నా, ఆవు ఆదుర్దా కలిగిస్తోంది. పులివాగు పరిస్థితి తలచుకున్నప్పుడల్లా మరింత కలవరం కలిగిస్తోంది. ఆయనకు గడియ గడియ గండంలా ఉంది. ఆవు ఈనింది. షరా మామూలే చనిపోయిన దూడ అనుకున్నారందరూ. కానీ దూడ బతికే ఉంది. దక్కదనుకున్న దూడ దక్కేసరికి అంబా అంటున్న ఆవుని చూసి సూర్రెడ్డి సంబరం అంబరాన్ని దాటింది. ఆ రాత్రి ఆయనిక నిద్రపోలేదు. గోవుతో గోముగా ఊసులాడాడు. ఉల్లాసంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తెల్లగా, ముద్దుముద్దుగా ఉన్న లేగదూడతో ముద్దులాడాడు. చక్కగా చెప్పాలంటే చిన్నపిల్లాడైపోయాడు. సరిగ్గా చెప్పాలంటే, పాలేళ్ల ఆశ్చర్యానికి కేంద్రబిందువయ్యాడు. అరుగు మీద నుండి ఆకాశంలోకి చూశాడు సూర్రెడ్డి. కాకి నలుపు కుండలతో సూదుల్ని అమాంతం దిమ్మరిచ్చినట్టు కురిసిన వాన వెలిసింది. ఆకాశంలో నిశ్శబ్దం. అన్ని రోజులు శబ్దం చేసిన ఆ నింగిన నిశ్శబ్దం భయంకరంగా ఉంది.
 
 తెరిపిచ్చిన వాతావరణంతో తెల్లారింది. ఆ వాతావరణం ఎప్పుడూ చూడనంత కొత్తగా ఉంది. తూర్పు కొండలు జడ్జి ముందు బోనులో నుంచున్న నిర్దోషుల్లా నిలబడి ఉన్నాయి. పొద్దుపొద్దున్నే పెద్ద పాలేరొచ్చి, పెద్ద శుభవార్త తెచ్చాడు. పులివాగు తెగలేదనీ, దాని ప్రవాహానికి కొంగల చెరువు గట్టుకి గండి పడి, ఆ నీరు ఊరిని ఆనుకుని ఉన్న పెద్ద పంటకాలువలోకి వచ్చి పడిందనీ, పంట పాడవ్వలేదనీ చెప్పాడు. ఆ రోజు సూర్రెడ్డిగారు కొండదేవరని తీసుకొచ్చి, కొరమీనులతో కూడుపెట్టి, కాసులిచ్చి, కొత్త బట్టలెట్టి పంపించారు. కొండదేవర వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు.
    
 ఒక్కోసారి ఒకరి ఆనందం మరొకరి విషాదానికి దారి తీయొచ్చు. సూర్రెడ్డిగారి సంబరం ఆ అర్ధరాత్రిలో గవరయ్యకి గండం అయ్యింది. వాన పడుతుండటంతో పనుల్లేక గవరయ్య చేతిలో తాగడానికి తడిలేకపోయింది. చివరికి ఎలాగైతేనేం అప్పు పుట్టించాడు. తాగుబోతుకి చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ప్రపంచంలో ఎక్కడైనా అప్పు పుట్టుద్ది. కొంగల చెరువుకి గండి పడిన ఆ క్రితం రోజు సాయంత్రం ఉడుకు సారా మనసారా, తనివితీరా, కరువు తీరా ఖాళీ కడుపుతో తాగాడు. ముసురుని చూసి మురిసిపోతా వాతావరణం చల్లదనానికి పీకల దాకా పూటుగా తాగాడు. నిషా తలకెక్కింది. మైకంతో మగత మొదలయ్యింది. గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. చెరువు నీరు పెద్ద పంట కాలువలో పడి ఆ అర్ధరాత్రి పొంగి పొర్లింది. అంతటి నీరుకి కాలువ సరిపోక, నీరు బయటికొచ్చి ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. పాకని ఆనుకుని ప్రవాహం మొదలైంది. కాలం మాయా స్వరూపం. పాక మట్టిగోడలు కరిగిపోవడం మొదలయ్యాయి. పాకలోకి నీళ్లు చొరబడ్డాయి.
 
 అయినా గవరయ్యకి మెలకువ రాలేదు. గవరయ్య కర్మ కాలింది. పాక పైకప్పు కూలింది. కర్మకు ఈశ్వరుడైనా బద్ధుడే. పాకని ప్రవాహం తనలో ఇముడ్చుకుంది. పాక తనతో గవరయ్యను ఈడ్చుకుపోయింది. చుట్టూ నీరు, నిశీధి. కాసేపు గింజుకుని ఆ జీవుడు జన్మ చాలించాడు. కొన్ని రోజుల తర్వాత గోదాట్లో గవరయ్య శవం తేలింది. ఉబ్బి ఉన్న శరీరాన్ని కింద నుండి చేపలు పొడుచుకుని తింటున్నాయి. అతని చేతి పిడికిలిలో మాత్రం ఎలుగుబంటి ఎముక బలంగా బిగుసుకుని ఉంది. బయట వాటికి దొరికితే పరుగున వచ్చి పీక కొరికేస్తాయేమోనని భయం. వాటి నోటన పడి చచ్చే కంటే, సూర్రెడ్డి చేతిలో తన్నులో, తిట్లో తినడమే ఉత్తమమని ఊరుకున్నాడు కొండదేవర.
 
 కొత్త పుస్తకాలు
 రాస్తా (నవల)
 ఆంగ్లమూలం: జి.జానకీశాస్త్రి
 స్వేచ్ఛానువాదం: డా.పి.మహాలక్ష్మి
 పేజీలు: 216; వెల: 100
 ప్రతులకు: అనువాదకురాలు, శ్రీకనకమహాలక్ష్మి నర్సింగ్ హోమ్, 14-25-11/1, మహారాణిపేట, విశాఖపట్నం-530002. ఫోన్: 0891-2565676
 
 కాలంతెరలు (నానీలు)

 రచన: కోసూరి రవికుమార్
 పేజీలు: 48; వెల: 40
 ప్రతులకు: కవి, దాచేపల్లి, గుంటూరు జిల్లా-522414. ఫోన్: 9491336488
 
 శిష్య శతకము

 రచన: డా. కడిమిళ్ల వరప్రసాద్
 పేజీలు: 32; వెల: 40
 ప్రతులకు: కె.రమేశ్, 3-6-50, యర్రమిల్లివారి వీధి, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. ఫోన్: 08814-274876
 
 ప్రశ్నోత్తరాల్లో పంచమ వేదం

 తెలుగు సాహిత్యంలో సమున్నతమైన స్థానాన్ని సంపాదించుకుని, పంచమవేదంగా పేరు పొందింది మహాభారతం. అంతటి విశిష్ఠమైన గ్రంథాన్ని అధ్యయనం చేయడం అందరికీ అవసరమే. వ్యావహారిక భాషలో పిలకా గణపతి శాస్త్రి వంటివారు రాసిన కవిత్రయ భారతాన్ని ఒకటికి నాలుగు సార్లు చదివితే కాని ముఖ్యమైన విషయాలు గుర్తుండవు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పని చేసిన నండూరి గోవిందరావు సాహితీ సేద్యం కూడా విస్తారంగా చేసిన అనుభవంతో భారతాన్ని మథించి, దానిని ఏవిధంగా అందిస్తే పాఠకులు పదికాలాలపాటు గుర్తు పెట్టుకోగలరో ఒక అవగాహనకు వచ్చారు. దాని ఫలితమే ప్రశ్నోత్తరాల రూపం. పద్ధెనిమిది పర్వాలకు 2,517 ప్రశ్నలు-సమాధానాలు పొందుపరిచారు.

 మహాభారతము- ప్రశ్నోత్తర మాలిక
 రచన: డా. నండూరు గోవిందరావు
 పేజీలు: 278; వెల: 125
 ప్రతులకు: రచయిత, ఇంటి నం: 1-9-1113/31, విద్యానగర్, హైదరాబాద్- 500044.
 ఫోన్: 9849801490
 - డి.వి.ఆర్. భాస్కర్
 

Advertisement
Advertisement