శ్రీకృష్ణుడు | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణుడు

Published Sun, Aug 30 2015 1:31 AM

శ్రీకృష్ణుడు

 ‘కృషిర్భూవాచకః శబ్దో ణశ్చ నిర్వృతివాచకః! విష్ణుస్తద్భావయోగాచ్చ కృష్ణో భవతి సాత్వతః!!’ (ఉద్యోగపర్వం 70-5): ‘కృష’ ధాతువుకు సత్తా, అస్తిత్వమూ ఉనికీ అని అర్థం; ‘ణ’కారం ఆనందాన్ని చెబుతుంది. ‘ఉన్నాన’నడమే తన అస్తిత్వం గురించి తెలుసుకోవడం కూడాను. ఈ మూడింటినీ కలిపితే ‘సత్ చిత్ ఆనందం’ అనే మొత్తం అర్థం వస్తుంది ‘కృష్ణ’ శబ్దానికి. ఇతను దేవకీదేవికి పుట్టిన ఎనిమిది మందిలో ఎనిమిదో వాడు. ఎనిమిదిని ‘అష్ట’ అని సంస్కృతంలో అంటారు: ఆ మాటకు వ్యాపించడమని అర్థం. విశ్వమంతటా అణువణువునా ధ్రువంగానూ స్థిరంగానూ వ్యాప్తమై ఉన్న చైతన్యాన్ని కూటస్థచైతన్యమని అంటారు. కూటమంటే కమ్మరిదిమ్మ. అది ఎంత కదలకుండా ఉంటుందో అంత స్థిరంగానూ ఉండే చైతన్యం కూటస్థ చైతన్యమనే పేరును పొందింది. కూటమంటే మోసమని అర్థం కూడా ఒకటి ఉంది.
 
  ఆ మోసం మాయది. యోగమాయను సృష్టించి, మనందర్నీ మోసంలో పడేసినా, తాను అన్నిట్లోనూ ఉన్న చైతన్యంగా అవుపిస్తూ, మాయను వరిస్తారా తనను వరిస్తారా అని సాక్షిగా పరికిస్తూ ఉంటాడు భగవంతుడు. పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు నిఘా కోసం తిరిగేవాడు, వాళ్లు సరైన జవాబు రాయకపోతే, వాళ్లను సరిదిద్దకూడదన్నట్టే, మనుషులు కూటద్వారంలోకి పోతున్నా ఏమీ మాట్లాడకుండా సాక్షిగానే చూస్తూ ఉంటాడు కూటస్థుడు. శ్రీకృష్ణుడు ఆ కూటస్థ చైతన్యానికి ప్రతీక. ఆ చైతన్యం విశ్వచైతన్యం తాలూకు ప్రతిబింబం. దీని స్థానం కనుబొమల నడిమి బిందువు. దీన్ని ఆజ్ఞాచక్రమని అంటారు: అంటే, అంతటా అన్నివైపులా (ఆ) అర్థం చేసుకొనేదని (జ్ఞా) అర్థం.
 
  ఇక్కడ, శివుడికే కాదు, అందరికీ ఒక కన్ను ఉంటుంది. ఆ కంటి నుంచే ఈ రెండు కళ్లూ ఏర్పడ్డాయి. మన రెండు కళ్లకూ పరిమితమైన చూపే ఉంటుంది. కానీ కనుబొమల మధ్యనున్న ఈ కంటికి అన్నివైపులా, ముందుకీ వెనక్కీ చుట్టూరా ఒకేసారిగా చూడగలిగే సర్వతో దృష్టి ఉంటుంది. ఈ కన్ను బంగారు రంగులో ఉన్న గుండ్రంలో నీలిరంగు గోళంలాగ ఉంటుంది; ఆ నీలిరంగు గోళం మధ్య ఐదుకోణాల తెల్లటి నక్షత్రం ఉంటుంది. ఈ కంటిరూపమే పీతాంబరం కట్టే నీలమేఘ శ్యాముడైన కృష్ణుడి రూపం. ఈ కన్ను తెరుచుకోవాలంటే ప్రాణాన్ని కనుబొమల మధ్య పేరుకొనేలాగ చేసే ప్రాణాయామాన్ని చేయాలి. అప్పుడు ఓంకారాన్ని స్మరిస్తూ ధ్యానాన్ని చేస్తే కూటస్థ చైతన్యాన్ని సాధకుడు పొందగలుగుతాడు. ఇది రాసినంత సులభంగా పొందేదేమీ కాదు.
 
 దేవకికి మల్లేనే అదితికీ గంగకూ కూడా ఎనిమిది మంది పిల్లలు పుట్టడం గురించి ఇంతకుముందు చెప్పుకొన్నాం. ఈ కథనాలన్నీ ఒకే సృష్టి రహస్యాన్ని చెబుతున్నాయి: సృష్టిని నడిపించే దివ్య శక్తుల్లో ఏడు ఎదురుగుండా అవుపించ కుండానే పనిచేస్తాయి; ఎనిమిదోది మాత్రమే సృష్టిలో ఉంటుంది. ఇన్నిసార్లూ ఒకే విషయాన్ని చెబుతూన్నా, మనం వాటినన్నింటినీ వేరు వేరు కథలను కొంటూ చదివేస్తూ ఉంటాం. ఆలోచించం; ఇదేమిటబ్బా అని తరచి చూడం. కూటస్థ చైతన్యం కూడా ప్రత్యక్షంగా కనిపించదు. అది సాక్షిగా మాత్రమే అంతటా వ్యాపించి ఉంటుంది. దేవకి తాలూకు ఏడో గర్భాన్ని తీసుకొనిపోయి రోహిణీ గర్భంలో పెట్టారు కనక, శ్రీకృష్ణుడు నిజానికి ఏడోవాడిగా పుట్టాడని చెప్పాలి. ఇది కంసుడికి మతిభ్రమను పుట్టించడానికే. సరొగేట్‌గా తయారైన రోహిణీ గర్భం నుంచి పుట్టిన బలరాముడు అహంకారానికి గుర్తు.
 
  ఎదురుగుండా అవుపించకుండా ఉండవలసిన కూటస్థ చైతన్యం అష్టమగర్భంలో పుట్టి కృష్ణుడిగా లోకంలో అవుపిస్తూ తిరిగాడు. అతన్ని కూటస్థుడిగా గుర్తించినవాళ్లు చాలా తక్కువమందే. అందరూ అతన్ని కొడుకూ బావా మరిదీ మేనల్లుడూ మొదలైన రూపాల్లోనే చూశారు. శిశుపాలుడి లాంటివాళ్లు తిట్టిపోశారు; కంసుడిలాంటివాళ్లు చంపుదామని చూశారు; సాల్వుడిలాంటివాళ్లు పోరాడారు; దుర్యోధనుడిలాంటి వాళ్లు తాళ్లతో కట్టి చెరసాలలో పడేద్దామని చూశారు.
 
 శ్రీకృష్ణుడు మాత్రం సాక్షిగానే లోకంలో ఉంటూ వచ్చాడు. అతని సాయం కోరడానికి వచ్చిన దుర్యోధనుడు, నిద్రపోతున్న అతని పాదాల దగ్గర కూర్చోడమేమిటని గర్వంతో తలదగ్గరా, లేచీలేవగానే చూస్తాడని చెప్పి భక్తికొద్దీ అర్జునుడు పాదాల దగ్గరా కూర్చున్నారు. తనకున్న పదికోట్ల గోపనారాయణ సేనను ఒక భాగంగానూ, ‘అస్త్రం పట్టకుండానూ యుద్ధం చేయకుండానూ ఉండే’ సాక్షి రూపమైన తనను ఒక్కణ్నీ మరో భాగంగానూ చేశాడు. ముందు దుర్యోధనుడు వచ్చినా తాను ముందుగా అర్జునుణ్ని చూడడమే గాక, అతను దుర్యోధనుడి కన్నా చిన్నవాడు గనక అతన్నే ముందు కోరుకోమన్నాడు. ఇది నిజానికి భక్తుడికి కృష్ణుడు పెట్టిన పరీక్షే. ‘నన్నే కోరుకొంటాడా నేనిచ్చే బహుమతుల్ని కోరుకొంటాడా’ అనేదే కూటస్థుడు పరీక్షించేది.
 
 అందరూ బహుమతుల్నే కోరుకొంటారు. కానీ అర్జునుడు యుద్ధం చేయకుండా సలహాలనిచ్చే సాక్షి చైతన్యాన్నే కోరుకొన్నాడు. కృష్ణుడు ముందన్నమాటతో కంగుతిన్న దుర్యోధనుడు ఊపిరి పీల్చుకొన్నాడు; తనకు దొరికిన పెద్ద సేనతో చాలా సంతోషించి వెళ్లిపోయాడు. బలరాముడికి దుర్యోధనుడంటే మక్కువ. అహంకారానికి కోరికంటే మక్కువ ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ కృష్ణుణ్ని కాదని అతను ఏ పనీ చేయలేడు గనక దుర్యోధనుడితో అతను, ‘నేనెవరివైపూ యుద్ధం చేయను’ అని చెప్పి తీర్థాటనానికి వెళ్లిపోయాడు. శరీరంలో కూటస్థ చైతన్యం అంతరాత్మగా ఉంది: ఆ అంతరాత్మే మాయచేసే మోసానికి మురిసిపోయి అహంకారమవుతుంది. అహంకారం తన మునపటి రూపమైన ఆత్మ కన్నా మించి పనిచేయలేదు. కనకనే బలరాముడు యుద్ధాన్ని విడిచి వెళ్లిపోయాడు.
 కానీ మరో అహంకారం భీష్ముడి పేరన యుద్ధం చేసింది.
 
 అర్జునుడి అదుపును తునాతునకలు చేస్తూ బాణాల్ని వేస్తూ ఉంటే, భక్తుడి బాధను చూడలేక, తన సాక్షిత్వాన్ని పక్కకు పెట్టి, అక్కడ పడి ఉన్న రథచక్రం ఎత్తి, భీష్ముడి మీదకు కుప్పించి దూకాడు. ‘కౌస్తేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి’ (భగవద్గీత 9-31): ‘నా భక్తుడెప్పుడూ నాశనం కాడని చాటింపు వేసి మరీ చెప్పు అర్జునా!’ అన్నమాటను నిలబెట్టుకోడానికి తన ప్రతిజ్ఞను కూడా మరిచిపోతాడితను. అప్పుడు భక్తుడే అతన్ని పొదివి పట్టుకొని, అతని ప్రతిజ్ఞను నిలబెట్టాడు. శిశుపాలుడు ఇతనికి మేనత్త కొడుకు. కృష్ణుడికి తిట్టూ దీవెనా ఒకటే. వాటిని పట్టించుకోడు. కానీ మహాచైతన్య నిధిని అనరాని మాటల్ని అంటూంటే భక్తులకు చాలా బాధగా ఉంటుంది. వాళ్లకోసమని శిశుపాలుణ్ని చంపాడు, వంద తిట్లు పూర్తయ్యాయని కాదు.
 
 ఆ మాట మనలాగ కథల్లో మునిగిపోయేవాళ్లకోసం. జూదసభలో దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టుపట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు. వలువల్ని విప్పడానికి ఉంకించేసరికి ఆ భక్తురాలి ఆర్తిని చూసి, దుశ్శాసనుడికి చేతులనొప్పే మిగిల్చాడు. దుర్యోధనుడు దుర్బుద్ధితో ఒక పథకంగా దూర్వాసమునిని అతని పదివేల శిష్యులతో సహా వనవాసం చేస్తూన్న పాండవుల దగ్గరికి పంపాడు. యుధిష్ఠిరుడు సూర్యుణ్ని ప్రార్థించి సంపాయించుకొన్న అక్షయపాత్ర రోజుకోసారే భోజనం పెడుతుంది. ఆ రోజున ద్రౌపది దాన్ని కడిగేసింది కూడాను. దూర్వాసుడూ అతని శిష్యులూ స్నానానికి నదికి వెళ్లారు. భక్తురాలైన ద్రౌపది విన్నపాన్ని విని, కృష్ణుడు స్నానానికి అక్కడికి వచ్చి, ఆకలేస్తోందని చెబుతూ కడిగేసిన అక్షయపాత్రనే తెమ్మన్నాడు. దాంట్లోకి తొంగిచూసి, ఒక ఆకుముక్కను తీశాడు. దాన్ని నోట్లో వేసుకొన్నాడు. అతను ప్రతి అణువులోనూ ఉన్న కూటస్థ చైతన్యం గనకనే ఆ ఆకుముక్కతో సృష్టిలోని అందరి కడుపులతోపాటు దూర్వాసుడిదీ అతని పదివేల శిష్యులవీ కూడా నిండిపోయాయి. వాళ్లు అక్కణ్నించే కాలికి బుద్ధిచెప్పి పారిపోయారు.
 
 శివుడికే కాదు, అందరికీ ఒక కన్ను ఉంటుంది.  ఆ కంటి నుంచే ఈ రెండు కళ్లూ ఏర్పడ్డాయి. మన రెండు కళ్లకూ పరిమితమైన చూపే ఉంటుంది. కానీ కనుబొమల మధ్యనున్న ఈ కంటికి అన్నివైపులా, ముందుకీ వెనక్కీ చుట్టూరాను ఒకేసారి చూడగలిగే సర్వతో దృష్టి ఉంటుంది. ఈ కన్ను బంగారు రంగులో ఉన్న గుండ్రంలో నీలిరంగు గోళంలాగ ఉంటుంది.ఆ నీలిరంగు గోళం మధ్య ఐదుకోణాల తెల్లటి నక్షత్రం ఉంటుంది.
 
 (మిగతా వచ్చేవారం)
 

Advertisement
Advertisement