ద్రోణాచార్యుడు | Sakshi
Sakshi News home page

ద్రోణాచార్యుడు

Published Sun, Oct 4 2015 1:38 AM

dronacharya story

 పూర్వుల ఆచారాన్ని గ్రహింపజేసేవాడు ఆచార్యుడు. మనిషికి పూర్వులు అతని మునపటి కర్మలే. ఆ పనులకు మూలం అతను చేసిన మునపటి ఆలోచనలు. అంటే, ఆచార్యుడనే మాటకు సంస్కార మని అర్థమన్నమాట. ఈ సంస్కారాలు మంచివీ గావచ్చు, చెడ్డవీ గావచ్చు. అంచేతనే ఇటు పాండవులకూ అటు కౌరవులకూ కూడా ఆచార్యుడు ద్రోణుడే. ‘ద్రోణ’ అనే పేరు ‘ద్రు-గతౌ’ అనే క్రియ నుంచి వచ్చింది. అంటే, ద్రవంలాగ కరిగిన స్థితిలో ప్రవహిస్తూన్నట్టు ఉండేది అని అర్థం. చేసిన ఆలోచనగానీ చేసిన పనిగానీ ఇక లేకుండా పోదు. అది మన చేతనత్వంలో ఆ ఫలానా ఆలోచన జాడగానూ ఆ ఫలానా పనిముద్రగానూ సూక్ష్మ రూపంలో, అంటే, ద్రవీభూత రూపంలో ఉంటుంది. వీటినే సంస్కారాలని అంటాం. ఆ ముద్రలు అంతస్సులో బలీయమైన మొగ్గుదలల్ని ఏర్పరుస్తాయి.
 
 అవి ఆ ఆలోచనల్నీ ఆ పనుల్నీ మళ్లీ మళ్లీ చేసేలాగ మన బుద్ధిని నిర్బంధపెడతాయి. మాటి మాటికీ జరిగే ఆ పనులు నిర్బంధించే అలవాట్లుగా తయారవుతాయి. అంటే, సంస్కారం, ఒకలాగ చెప్పాలంటే, లోపలి మొగ్గుదలా, లేక, అలవాటూ అన్నమాట. ద్రోణుడు చెక్కదొన్నెలోంచి పుట్టాడని పురాణం కథ చెబుతుంది. ఈ దొన్నె ద్రవీభూతమైన సంస్కారాలతో నిండి ఉన్నది. చెక్కదొన్నెను పగలగొట్టడం సాధ్యం గనకనే, ప్రయత్నం చేసేవాడికి ఈ పూర్వసంస్కారాల నిర్బంధం నుంచి బయటపడడం అసాధ్యమేమీగాదు. యజ్ఞాల్లో ద్రోణకలశం అనే గ్రహం, అంటే, పాత్ర ఒకటి ఉంటుంది. అది ప్రజాపతి సంబంధమున్నది. ప్రజాపతి అంటే సృష్టించే బ్రహ్మ. సృష్టి అంతా వాసనల విలాసమే. భరద్వాజుడు ఘృతాచి అనే అప్సరసను చూసి చలించి పోవడం వల్ల ద్రోణుడు పుట్టాడని ఆ కథ చెబుతుంది. వాజమంటే స్పందన.
 
 స్పందనలతో నింపి పోషించేవాడు (భరత్) భరద్వాజుడు. ఘృతాచి అంటే, ప్రవాహంగా (ఘృ=క్షరణం, ప్రవహిం చడం) ప్రకటమవుతూ సాగిపోయేది. (‘అంచు’ = గమనం) అని అర్థం. ఈ ఇద్దరికీ పుట్టిన ద్రోణుడు అంచేత, ‘మునపటి ఆలోచనా స్పందనలనూ క్రియల కదలికల్నీ ప్రవహింపజేసి ప్రకాశింపజేసేవాడ’న్న మాట. ఈ విధంగా పురాణకథలో ఇమిడి ఉన్న అర్థం కూడా ద్రోణుడంటే సంస్కారమూ అల వాటూ అనే తెలుస్తోంది. ఎలాగైతే కాకి తన తలను తిప్పుతూ ఒక్కొక్కసారీ ఒక్కొక్క కంటిని మాత్రమే ఉపయోగించి, తనకు కావలసిన వస్తువును చూస్తుందో అలాగే, అలవాటుకు అమ్ముడుపోయిన బుద్ధి, ఏకాక్షిలాగ, ప్రబలమైన సంస్కా రాలకే కొమ్ముకాస్తుంది తప్ప, మంచీ చెడూ అనే రెండు రకాల సంస్కారా లనూ సరిసమానంగా చూడలేదు.
 
 మనిషిలో దుష్టమైన సంస్కారాలు ఎచ్చులో ఉన్నప్పుడు, అతనిలోని ‘ద్రోణుడు’ కౌరవులవైపే చేరతాడు. చిన్ననాటి నేస్తం ద్రుపదుడి మీద ద్రోణుడికున్న కక్ష సాధిద్దామన్న బుద్ధే అతనిలోని చెడు సంస్కారానికి అద్దం పడుతుంది. ద్రోణుడికి కృపాచార్యుడి చెల్లెలు కృపితో పెళ్లి అయింది. వాళ్లకు అశ్వత్థామ అనే కొడుకు పుట్టాడు. భరద్వాజుడు అగ్నికి కొడుకైన అగ్ని వేశుడికి ఆగ్నేయాస్త్రాన్ని చెప్పాడు. ఆ అగ్ని వేశుడు తిరిగి ఆ అస్త్రాన్ని భరద్వాజుడి కొడుకైన ద్రోణుడికి చెప్పి, గురువు రుణం తీర్చుకొన్నాడు. భరద్వాజుడికి పృషతుడనే రాజు స్నేహితుడు. పృషతుడికి ద్రుపదుడనే కొడుకున్నాడు. ద్రుపదుడికీ ద్రోణుడికీ అగ్నివేశుడే గురువు. ద్రుపదుడు రోజూ భరద్వాజుడి ఆశ్రమానికి వచ్చి, ద్రోణుడితో కలిసి ఆడుకొంటూ ఉండే వాడు. చదువుకొనేవాడు కూడాను. ఆ విధంగా ఇద్దరూ సహాధ్యాయులయ్యారు.
 
 పృషతుడు చనిపోగానే పార్షతుడు, అంటే ద్రుపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు. భరద్వాజుడు కూడా పోయిన తరవాత, ద్రోణుడు ఆ ఆశ్రమం లోనే ఉంటూ తపస్సు చేసుకొనేవాడు. మొదట వేదాన్ని చదువుకొన్నాడు. ఆమీద ధనుర్వేదాన్ని అభ్యసించడం ప్రారంభిం చాడు. పిల్లవాడికి పాలను కొనడానికి కూడా డబ్బులేని దారిద్య్రం అతనిది. అశ్వత్థామ, ఎవరో అబ్బాయి పాలు తాగుతోంటే ‘నాకూ పాలు కావాల’ని ఏడ్చాడు. ఎంత ప్రయత్నించినా ఆవు దొరకలేదు ద్రోణుడికి. గోధుమపిండిలో నీళ్లు కలిపి అవి పాలని చెప్పి అశ్వత్థామను ఊరుకోబెట్టారు తల్లిదండ్రులు. మహేంద్ర పర్వతం మీద ఉన్న పరశురాముడు దానాలు చేస్తున్నాడని విని ద్రోణుడు వెళ్లాడు.
 
 కానీ ఇతను చేరేసరికి అతని దగ్గర ఏ రకమైన భౌతిక ధనమూ మిగల్లేదు; అస్త్రధనం మాత్రం ఉంది. దాన్నే కోరు కొన్నాడు ద్రోణుడు. అక్కణ్నించి సఖుడు గదా అని ధనం కోసం ద్రుపదుడి దగ్గరికి గంపెడాశతో పోయి ‘సఖుడా!’ అని పిలిస్తే అది ద్రుపదుడికి గిట్టలేదు. ద్రోణుడనే మాటలోనూ ద్రుపదుడనే మాటలోనూ ఒకే ‘ద్రు’ అనే ధాతువు ఉంది. కానీ ఇద్దరి స్వభావాన్ని బట్టి అది వేరు వేరు అర్థాల్ని సంతరించుకొంటుంది. ద్రుపదుడంటే, త్వరత్వరగా (‘ద్రుతగతితో’) ఆధ్యాత్మి కంగా పురోగమించేవాడని అర్థం. ప్రతి సాధకుడూ మొదట్లో తన ఆధ్యాత్మికమైన కోరికలూ లోపలి వాసనలూ కలిసిమెలిసే ఉంటున్నాయనుకొంటాడు. కానీ సంస్కా రమెప్పుడైతే తన భౌతికమైన మొగ్గు దలల్ని కనబరుస్తుందో అప్పుడు ఆధ్యా త్మికమైన కామన దాని సంగాన్ని కాల దన్నుతుంది. ఇదే ద్రుపదుడు చేసిన పని.
 
 ఆ మీద బావమరిదింటికి వచ్చి ప్రచ్ఛన్నంగా ఉండడం మొదలుపెట్టాడు ద్రోణుడు. ఒకరోజున హస్తినాపురం నుంచి బయటకు వచ్చి రాజకుమారులందరూ ఒకచోట గిల్లిదండా ఆడుతున్నారు. అకస్మా త్తుగా ఆ గోటీబిళ్ల నీళ్లులేని బావిలో పడిపో యింది. దాన్ని బయటికి తీయడం చేత కాలేదు ఆ కౌరవరాజకుమారులందరికీను. అక్కడికొచ్చిన ద్రోణుడు వాళ్లను చూసి నవ్వాడు: ఉంగరాన్ని వేసి ‘దాన్ని కూడా తీస్తాను, నాకు భోజన సదుపాయం చేయండ’ని అడిగాడు. గుప్పెడు గడ్డి పోచల్ని కోసి, వాటిని అభిమంత్రించి, ఒక పోచను ఆ బిళ్లమీద గురిపెట్టి వేశాడు. ఆ పోచకు మరో పోచను కలిపాడు. ఇలాగ మంత్రించిన పోచలతో ఆ గోటీ బిళ్లను పైకి తీశాడు. ‘మరి ఆ ఉంగరాన్ని కూడా తీయండి’ అనడిగారు పిల్లలు. అప్పుడు బాణాలను సంధించాడు. మొదటి బాణంతో ఉంగరాన్ని గుచ్చాడు. ఆ మీద బాణంమీద మరో బాణాన్ని గుచ్చుతూ నిలువు కట్టెలాగ చేసి ఉంగరాన్ని పైకి లాగాడు. ఆనందంతో పిల్లలు ‘మేము మీకేం చేసిపెట్టాలి?’ అనడంతో ‘మీ భీష్ముడి తాతకు నా గురించి చెప్పండి చాలు’ అన్నాడు. భీష్ముడు అతని విలు విద్యాపాండిత్యాన్ని గుర్తించాడు. కౌరవ పాండవులందరికీ విలువిద్యను నేర్పమని నియోగించి, ఆయనకు ఏ లోటూ లేకుండా చేశాడు భీష్ముడు.
 
 ఈ విలువిద్యను నేర్పడాన్ని పురస్క రించుకొని ఈ వాసనలకాపు వైరాగ్యానికి అందరిలోనూ అర్జునుడి గొప్పతనాన్ని గమనించాడు: అతన్ని పెద్దగా చేద్దామని ఏకలవ్యుడి వింటినేర్పనే కుడిబొటనవేలిని దక్షిణగా తీసుకొనే క్రూరత్వానికి ఒడి గట్టాడు. అర్జునుణ్ని దన్నుగా చేసుకొని, ద్రుపదుడి మీద దండెత్తాడు ఈ బ్రాహ్మ ణుడి రూపంలో ఉన్న ప్రతీకారి ద్రోణుడు. ద్రుపదుడి ఛత్రవతీపురాన్ని కైవసం చేసు కొని, ‘నీతో మళ్లీ స్నేహంగానే ఉందామను కొంటున్నాను. రాజుకు రాజుతో సఖ్యం కుదురుతుందని చెప్పావుగనక, నేనూ రాజునయ్యాను. నేను ఉత్తర పాంచాలాన్ని ఉంచుకొని నీకు దక్షిణ పాంచాలాన్ని ఇస్తాను’ అని ద్రుపదుణ్ని చిన్నబుచ్చాడు.
 ఇంత కక్ష తీర్చుకొన్నా, తనను చంప డానికి పుట్టిన ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడికి విలువిద్యను ద్రోణుడే చెప్పాడు. సంస్కారస్వరూపుడైన ద్రోణుడు మంచీ చెడూ రెండు సంస్కారాలకూ ప్రతి నిధే. ధృష్టద్యుమ్నుడు మంచి సంస్కా రానికి ప్రతీక. అంచేత అతనికీ ద్రోణుడు గురువే అవుతాడు.
 
 భీష్ముడి తరవాత ద్రోణుడే కౌరవుల సేనానాయకు డయ్యాడు. ఐదురోజులు యుద్ధం చేశాడు. ఈ ఐదురోజుల్లోనూ చాలా ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ధర్మరాజును బంధిస్తే, యుద్ధం అయి పోతుంది. మీరు అది చెయ్యగలిగీ చెయ్యట్లేదు. మీకు పాండవ పక్షపాతం ఉంది’ అని దుర్యోధనుడు ఎత్తిపొడిచి నప్పుడు, ‘అర్జునుణ్ని సంశప్తకులు దూరంగా తీసుకెళితే దీన్ని సాధ్యం చేయవచ్చు. నేను అప్పుడు చక్రవ్యూహం పన్ని విజృంభిస్తాను’ అని ద్రోణుడు అభిమన్యుడి చావుకు బీజం వేశాడు. ఒంటరివాణ్ని చేసి, ఆరుగురు యోద్ధలొక్క సారిగా మీదపడి అభిమన్యుణ్ని చంప డానికి పథకం వేసినవాడూ ఇతనే. అభి మన్యుడు చావగానే, అతని సహాయానికి భీముడూ నకులసహదేవులూ ఎవరూ వెళ్లకుండా ఆపిన దుశ్శల మొగుడు జయ ద్రథుణ్ని చంపుతానని అర్జునుడు శపథం చేశాడు. చంపలేకపోతే అగ్నిప్రవేశం చేస్తా నని చెప్పడంతో సైంధవుడైన ఆ జయ ద్రథుణ్ని కాపాడడానికి వ్యూహం పన్నాడు ద్రోణుడు.
 
 లోపల ఉన్న అర్జునుడికి సాయంగా భీముడు వెళ్దామని చూస్తే అతనికి అడ్డంగా ద్రోణుడే నిలుచున్నాడు. కానీ భీముడు ద్రోణుడి రథాలను ఎత్తెత్తి కుదేస్తూ అతని బాణాలను, వర్షాన్ని ఎదిరించి ఎద్దు ముందుకు సాగిపోయి నట్టు, సహిస్తూనే లోపలికి వెళ్లాడు. ఘటో త్కచుడితో జరిగిన రాత్రియుద్ధం కూడా ద్రోణుడి హయాంలోనే జరిగింది. కర్ణుడి శక్తి అతనిమీద ప్రయోగించక తప్ప నంతగా ఘటోత్కచుడు విజృంభించాడు. తెల్లారిన తరవాత, అశ్వత్థామ పోయాడన్న పుకారును ధర్మరాజు నోట విని ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ధ్యాన ముద్రలో కూర్చొని ప్రాణాన్ని వదిలేసిన ద్రోణుడి తలను ధృష్టద్యుమ్నుడు వరప్రభావం కొద్దీ నరికేశాడు. ధృష్టద్యుమ్నుడంటే నిబ్బరమైన కాంతి అనర్థం. ప్రశాంతమూ నిర్దుష్టమూ అయిన ఈ కాంతే నిర్బంధించి ఏడిపించే అలవాటును కాల్చివేయగలదు: ధృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ని వధించడంలో ఉన్న అంతరార్థం ఇదే. ఇబ్బందిపెట్టే అల వాటును నశింపజేయడానికి, అబద్ధాన్నైనా చెప్పడమనే ఉపాయం పన్నడంలో ఏ రకమైన తప్పూ ఉండదు.                  
 
 

Advertisement
Advertisement