లబ్ డబ్ @ పబ్ | Sakshi
Sakshi News home page

లబ్ డబ్ @ పబ్

Published Mon, Sep 1 2014 3:07 AM

లబ్ డబ్ @ పబ్

పబ్‌లు, క్లబ్‌లు యూత్ గుండెల లబ్‌డబ్‌గా మారాయంటే.. అందుకు కారణం చీర్స్.. చిప్స్ అనుకుంటే పొరపాటే.  అవి మస్తీ మ్యూజిక్ అందించే మ్యూజిక్ హబ్స్ కావడమే యంగ్‌తరంగ్‌ను కట్టిపడేస్తున్నాయి. చాలా మందికి రాత్రి అంటే మామూలు రాత్రే. పార్టీ లవర్స్‌కు మాత్రం నైట్ అండ్ హీట్. హార్ట్ బీట్.. కుర్రకారును ఉడుకెత్తించే బీట్.  కాళ్లు నేల మీద ఉంటే నేరమనిపించే బీట్. రాగాల రాసులు మోసుకొచ్చే బీట్. రాత్రుల పేర్లు మార్చే బీట్. సిటీలో ఇప్పుడు ప్రతి రాత్రి వసంత రాత్రే. సంగీతపు అక్షయ పాత్రే.
 -ఎస్. సత్యబాబు
 
 సోమ, మంగళవారాలు మేమేం పాపం చేసుకున్నామో అని... భారంగా గడిచిపోతాయి. మూడో రోజైన బుధవారానికి  కాస్త మూడొస్తుంది. ‘వర్క్ లోడ్ ఈ రోజు హెవీగా ఉంది. రీఫ్రెష్ కావాల్సిందే. బీ అండ్ సీలో కార్పొరేట్ నైట్‌కి పద డూడ్’ ఇలా మొదలవుతుంది. అక్కడి నుంచి గురువారం అంటే కరావోకేనైట్, శుక్రవారం అంటే రెట్రో క్లాసిక్ రాక్ నైట్, శనివారం.. బాలీవుడ్ నైట్, ఆదివారం..  ఈడీఎం నైట్... అలా రాత్రులు హీటెక్కుతూనే ఉంటాయి. సిటీ లేటెస్ట్‌గా కోల్పోయింది ఏమైనా ఉందా అంటే అది లేడీస్ నైట్. (ఇటీవలే  బ్యాన్ చేశారు)
 
 కొత్తకు ‘పాత’ర...
 ఫిల్‌కొల్లిన్స్, మైకేల్‌జాక్సన్, బోనియం, అబా, మడొన్నా... ఈ పేర్లన్నీ వెస్ట్రన్ మ్యూజిక్‌లో ఒకనాటి స్టార్స్. యూత్ చిల్ అవుట్ అయ్యే ప్లేస్‌లలో  స్లో, మెలోడీ, ఓల్డ్ క్లాసిక్ రాక్ రాగాలకు ప్లేస్ దక్కడం విచిత్రమే. సిటీ పబ్స్‌ని హౌస్‌ఫుల్ చేస్తున్న సంగీత శైలుల్లో రెట్రోరాక్ ఒకటి. ఇక్కడ గోల్డెన్ ఓల్డ్ సాంగ్స్ వినిపిస్తాయి. ‘ఓల్డ్ క్లాసిక్ రాక్‌ని సిటిజనులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థర్టీ ప్లస్ ఏజ్‌గ్రూప్‌కి ఇది యాప్ట్. రెట్రో థీమ్‌కు తగ్గట్టుగా డ్రెస్‌కోడ్‌ను ఫాలో అయ్యేవాళ్లు ఉన్నార’ని అంటారు రెట్రో మ్యూజిక్ ప్లే చేయడంలో  పేరొందిన డీజే పాల్.  రెట్రోనైట్స్‌లో పొరపాటున కూడా లేటెస్ట్ మ్యూజిక్‌ని ప్లే చేయరు.
 
 పాడుతా తీయగా.. వెచ్చగా
 గొంతులోకి పోయిన చుక్క రాత్రిని వెచ్చగా మార్చకపోతే అది హీటూ కాదు.. గుక్క తిప్పుకోకుండా పాడకపోతే  కరావోకే నైటూ కాదు. సిటీలో పాటగాళ్లు ఇందరున్నారా అని ఆశ్చర్యపోవాలంటే కరావోకే నైట్‌కి ఓ రౌండ్ కొట్టాలి. ప్రస్తుతం ‘గాతా రహే మేరా దిల్’ అంటూ సాంగుల్ని బట్టీపట్టే యువ‘పాట’కుల పుణ్యమా అని ఈ నైట్  సిటీయూత్‌కి సెకండ్ హా‘టేస్ట్’నైట్‌గా మారిపోయింది. ‘కరావోకే నైట్‌ని ఇష్టపడే గెస్ట్స్ అందరూ  మ్యూజిక్ లవర్సే. పాడేవాళ్లే కాదు, పాపులర్ సాంగ్స్‌ని కొత్త వాయిస్‌లతో విని ఆనందించేవాళ్లకూ ఈ నైట్స్ ఫుల్ జోష్‌నిస్తాయ’ని అంటాడు కరావోకే నైట్స్‌కి కేరాఫ్ అయిన కేజే ఆనంద్.
 
 బాలీవుడ్ సే జాలీవుడ్ తక్...
 నవాబ్‌ల సిటీలో ఆదాబ్‌లూ కబాబ్‌లు ఎంత నేచురలో ఆర్డీ బర్మన్‌లూ అనురాధా పౌడ్వాల్‌లూ అంతే కామన్. హిందీ గీతాలతో ‘లత’లా పెనవేసుకున్న హైదరాబాదీలు.. బాలీవుడ్ నైట్ అంటే చెవులప్పగించేస్తున్నారు. హాట్ హాట్‌గా, హార్ట్‌బీట్‌తో పాటుగా సాగిపోయే హిందీ హిట్స్‌కి ఉన్న క్రేజ్ తక్కువేం కాదు. ‘బాలీవుడ్ మ్యూజిక్ ట్రాక్స్ ప్లే చేసిన రోజు మంచి రె స్పాన్స్ వస్తుంది. ఆల్బమ్స్‌కి మాత్రమే కాదు సినిమా పాటలకి పబ్స్‌లో డిమాండ్ ఎక్కువే’ అంటున్నాడు బాలీవుడ్‌నైట్స్‌ని కదం తొక్కించే డీజే జీతు.
 
 కార్పొ‘రేట్’... సపరేట్...
 పగలూ రాత్రీ తేడా లేకుండా కంప్యూటర్‌లకు కళ్లు అప్పగించేసిన కార్పొరేట్ జీవుల్ని డ్యూటీలకు బైబై చెప్పేసి వీకెండ్ వినోదాలకు రారమ్మంటున్నాయి కార్పొరేట్  నైట్స్. అచ్చంగా కార్పొరేట్, ఎంఎన్‌సీ ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన ఈ నైట్స్‌కు వెళ్లినప్పుడు కంపెనీ ఐడి చూపిస్తే మంచి డిస్కౌంట్ కూడా లభిస్తుంది.  ‘కార్పొరేట్స్ మ్యూజిక్ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. హెవీ మెటల్, హిప్ హాప్‌లను వీరు  ఇష్టపడతారు’ అంటూ చెప్తున్నాడు కార్పొరేట్‌నైట్స్‌కు పేరొందిన డీజే శేఖర్.
 
 ఇంటర్నేషనలిజం...ఈడీఎం..
 టాప్ ఇంటర్నేషనల్ డీజేలకు చెందిన మిక్స్‌డ్ ట్రాక్స్‌ని ప్లే  చేసే ఈడీఎం (ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్) నైట్స్ కూడా సిటీలో బాగా పాప్యులర్. డీజేలు అవిచ్చి, సియెస్టో, డేవిడ్ గోయెట్టా.. తదితర వరల్డ్‌క్లాస్ డీజేల మ్యూజిక్‌ను స్థానిక డీజేలు తమదైన శైలిలో సమర్పించే ఈ నైట్స్ అంటే యూత్ మంచి ఆసక్తి కనబరుస్తారు. ‘గోవా లాంటి పార్టీ సిటీస్‌లో ప్లే చేసిన మ్యూజిక్‌నే ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అడుగుతున్నారు. ఈడీఎం ట్రాక్స్ విషయంలో సిటీ చాలా అడ్వాన్స్ అయింది’ అంటున్నాడు గోవాకు సిటీకి రాకపోకలు సాగించే సిటీ డీజే మూర్తి.

Advertisement
Advertisement