పలుకుబడికి పురస్కారాల జడి.. | Sakshi
Sakshi News home page

పలుకుబడికి పురస్కారాల జడి..

Published Sun, May 24 2015 1:22 AM

పలుకుబడికి పురస్కారాల జడి..

రేడియో జాకీలు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఐఆర్‌ఎఫ్-2015’ అవార్డులు ఈసారి నగరానికి నాలుగు కేటగిరీల్లో లభించాయి. జాతీయ స్థాయిలో వివిధ స్టేషన్స్ నుంచి అనేక కేటగిరీల్లో టౌన్ స్థాయి నుంచి మెట్రో సిటీస్ రేడియో స్టేషన్స్, ఆర్‌జేలు ఈ అవార్డుల కోసం పోటీ పడతారు. అంత పోటీని తట్టుకుని నగర ఆర్జేలు పురస్కారాలు సాధించారు. ఆ వివరాలు..
  - సాక్షి, సిటీబ్యూరో    
 
బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ షో.. శివ్
ఎఫ్‌ఎం రేడియో కార్యక్రమాలను బ్రేక్ ఫాస్ట్‌షో, నాన్ బ్రేక్‌ఫాస్ట్ షోలుగా విభజిస్తారు. దీనిని బట్టి బ్రేక్ ఫాస్ట్‌షో ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. రేడియో సిటీ 91.1 ఎఫ్‌ఎంలో ప్రసారమయ్యే బ్రేక్‌ఫాస్ట్ షోకు ఆర్‌జే శివ్ అవార్డు అందుకున్నారు. ‘రెండవ అవార్డ్‌ను ఈ బ్రేక్‌ఫాస్ట్ షోకి అందుకోవడం చాలా ఆనందంగా వుంది. నా బ్రేక్ ఫాస్ట్‌లో న్యూస్ హెడ్‌లైన్స్, లోకల్ హ్యాపెనింగ్స్, జాబ్ అప్‌డేట్స్, హాట్‌సీట్‌లో ఒక సెలబ్రిటీని లేదా పొలిటికల్ పర్సనాలిటీని కూర్చోబెట్టి సెటైరిక్ ప్రశ్నలు వేయడం, సినిమాలో పంచ్ డైలాగ్స్‌కి రేడియో సిటీ మార్క్‌లో పంచ్ ఇవ్వటం వంటివి డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తుంటాను’ అని చెప్పారు శివ్.
 
బెస్ట్ షో ఆఫ్ ది ఇయర్.. ‘జబర్ దస్త్ మస్తీ’

‘అనుకున్నది క్లిక్ అయితే ఆ కిక్కే వేరు’ అంటున్నాడు రెడ్ ఎఫ్‌ఎం ఆర్జే చైతు. ఈయన చేసిన ‘జబర్ దస్త్ మస్తీ’కి అవార్డ్ అందుకున్నారు. ‘ముందు ఈ లేడిస్ షో నేను చేయనన్నా. కానీ వర్కవుట్ అవుతుందని  ఒప్పించారు. ఐదు నెలల్లోనే అవార్డు వచ్చింది.  బెస్ట్ ఆర్‌జే అవార్డ్ సాధించాలని కోరిక’ అంటూ చెప్పాడు.
 
బెస్ట్ ఆర్‌జే.. శేఖర్ మామ

ఎఫ్‌ఎం రేడియో వినే సిటీవాసులకు శేఖర్ మామ అంటే తెలియనివారు అరుదే. రేడియో జాకీగా, జెమిని యాంకర్‌గా చిరపరిచితుడైన శేఖర్ బాషా.. ఐఆర్‌ఎఫ్ నుంచి ‘బెస్ట్ ఆర్‌జే ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ను మరోసారి అందుకున్నాడు. ‘లిజనర్స్‌కు నా షోస్‌ను నిర్విరామంగా ఆదరించడం వల్లే ఈ అవార్డ్‌ను వరుసగా దక్కించుకోగలిగా’ అంటూ ఆనందంగా చెప్పే శేఖర్.. అత్యధిక సంఖ్యలో ఐఆర్‌ఎఫ్ అవార్డ్స్ (బెస్ట్ ప్రోమోస్, బెస్ట్‌షోస్ సహా మొత్తం 15) అందుకున్న ఏకైక ఆర్‌జేగా ఇండియాలోనే రికార్డ్ సృష్టించాడు. వీటితో పాటు ఐఎస్‌బీ నుంచి ‘యంగ్ కమ్యూనికేటర్ అవార్డ్’ సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.
 
బెస్ట్ ప్రోమో.. శ్రీరామ పవన్

ఈసారి ‘బెస్ట్ ప్రోమో ఇన్‌హౌజ్ ప్రొడక్షన్’ కేటగిరిలో మళ్లీ అవార్డు దక్కించుకున్నారు రెడ్ 93.5 ఎఫ్‌ఎం సౌండ్ ఇంజినీర్ శ్రీరామ పవన్ కుమార్. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘నా రేడియో కెరీర్‌లో మూడో నేషనల్ అవార్డ్ అందుకున్నాను. ‘రేడియో అండ్ టీవీ అడ్వర్టైజ్‌మెంట్ ప్రాక్టీషనర్ అవార్డ్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (రాపా) ఇచ్చే అవార్డు కూడా నాకొక సర్‌ప్రైజ్. అలాగే 2012లో రెడ్ ఎఫ్‌ఎంలో చేసిన ‘సిల్లీ ఫెల్లో’ స్పార్క్‌లర్‌కు న్యూయార్క్ రేడియో అవార్డ్ అందుకున్నా’ అని చెప్పారు.

Advertisement
Advertisement