మన కథల వారణాసి

మన కథల వారణాసి


కథలెందుకు రాస్తారు?

 

వాళ్లూ వీళ్లూ సరే. మన దగ్గర ఎవరున్నారు? ప్రపంచస్థాయి రచయితలు ఎవరున్నారు?

 ప్రేమ్‌చంద్!

 అవును.

 మన పుణ్యక్షేత్రం. మన పాఠ్యగ్రంథం. కథల వారణాసి. సిసలైన అర్థంలో నిజమైన భారతీయ కథకుడు.

 ప్రేమ్‌చంద్ అన్నీ చూశాడు. ఈ దేశంలో నూటికి తొంభై శాతం ఉన్న బీదా బిక్కి జనాల మధ్యతరగతి మనుషుల సమస్త తలపోతలనీ తలకెత్తుకున్నాడు. వాటన్నింటినీ రాశాడు. గురజాడ ప్రేమ్‌చంద్... ఇద్దరికీ సామ్యముంది. ఇద్దరూ దాదాపు ఒకేసారి కథల్లోకి దిగారు. కథల పరమార్థం గ్రహించారు. గురజాడ మౌఢ్యం నుంచి పరివర్తన ఆశిస్తే ప్రేమ్‌చంద్ సంస్కారాల నుంచి పరివర్తన ఆశించాడు. గురజాడ తన తొలి కథ రాయడానికి సరిగ్గా మూడేళ్ల ముందే ప్రేమ్‌చంద్ తన విశ్వవిఖ్యాత కథ ‘నమక్ కా దరోగా (1907) రాశాడు.

 

ఏమిటా కథ?

ఒక నిజాయితీపరుడైన యువకుడు. సాల్ట్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం వస్తుంది. బ్రిటిష్ కాలం. నల్ల బజారులో ఉప్పు బంగారంలా అమ్ముడుపోతున్న కాలం. రేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ఉప్పు పెద్దవాళ్ల చేతుల్లోకి పోకుండా చూడటమే సాల్ట్ ఇన్‌స్పెక్టర్ పని. ఉద్యోగంలో చేరి ఎన్నోరోజులు గడవవు. ఆ రాత్రి అతడికి పరీక్షా సమయం ఎదురయ్యింది. ఊరి పొలిమేరల్లో వరుసగా వెళుతున్న ఎడ్లబండ్లలో ఉప్పుమూటలు. ఒకటి కాదు రెండు కాదు... లెక్కలేనన్ని మూటలు. అన్నీ కూడా ఆ ఊరి కామందువి. గుట్టు చప్పుడు కాకుండా పట్నం పోతున్నాయి. పొలిమేర దాటితే ఇక నరుడి కంటికి దొరకనట్టే. కొత్త కుర్రవాడు ఉత్సాహవంతుడు నిజాయితీపరుడు సాల్ట్ ఇన్‌స్పెక్టర్... పట్టేసుకున్నాడు. గుర్రం మీద వెంబడించి బెబ్బులిలా గాండ్రించి బండ్లన్నీ నిలువరించాడు. ఎంత పెద్ద ఉత్పాతం ఇది. ఉప్పు పోతే పోయింది కాని దీని హక్కుదారుడు ఫలానా కామందు అని చుట్టుపక్కల పరగణాలన్నింటికీ తెలిసిపోతే? పరువేంగాను? కామందు వచ్చాడు. పక్కకు తీసుకెళ్లాడు. ఎంతకావాలో అడుగు అన్నాడు. చిల్లర పైసల ఉద్యోగి సాల్ట్ ఇన్‌స్పెక్టర్. వేలైనా సరే. లక్షలైనా సరే. పరువు ముఖ్యం. కాని కుర్రవాడు లొంగలేదు. అరెస్ట్ చేశాడు. అయితే పెద్దవాళ్లకెప్పుడూ పది దారులు. కోర్టులో కేసు నిలవలేదు. పైగా అంత పెద్దమనిషిని ఇబ్బంది పెట్టినందుకు ఉల్టా ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఊడింది. నిజాయితీకి దొరికిన ప్రతిఫలం. కుర్రవాడు ఏం పట్టించుకోలేదు. తన ధర్మం తాను నిర్వర్తించాడు. ఒకరి ముందు తాను ఎలా ఉంటే తనకేమిటి? తన ఆత్మ ముందు తాను వజ్రం! మరో రెండు రోజులు గడిచాయి. ఇన్‌స్పెక్టర్ ఇంటి ముందు కామందు బండి ఆగింది. లోపలి నుంచి కామందు దిగాడు. తనకు మేనేజర్‌గా పని చేయమని అర్థించాడు. పెద్ద జీతం. పెద్ద దర్జా. బోలెడంత మర్యాద. వజ్రంలాంటి మనిషివి నువ్వు... నాకు కావాలి అన్నాడు. అంతేకాదు. ఇక మీదట దొంగ వ్యాపారాలన్నీ బంద్ చేసి అతడితో ముందుకు నడవడానికి నిశ్చయించుకున్నాడు. ఎందుకు? ఏమీ లేని ఆ కుర్రవాడే అంత నిజాయితీగా ఉంటే అన్నీ ఉన్న తాను ఎంత నిజాయితీగా ఉండాలి? జాతికి కావాల్సిన సంస్కారం అది. పరివర్తన.

 ప్రేమ్‌చంద్‌ది కాయస్త్ల కులం. వీళ్లను ఉత్తరాదిన శ్రీవాస్తవ్లని కూడా అంటారు. వీళ్ల మూలపురుషుడు చిత్రగుప్తుడు. కమ్మరివృత్తి ఒక కులంగా మారినట్టుగా, కుమ్మరివృత్తి ఒక కులంగా వూరినట్టుగా వ్రాయసగాళ్లు ఒక కులంగా మారి కాయస్త్‌లయ్యారని అంటారు.  అయితే ప్రేమ్‌చంద్‌కు రాయడం ఈ వ్రాయసకులం వల్ల ఏర్పడలేదు. ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి చనిపోతే, మారుతల్లి వేధిస్తుంటే, ఏం చేయాలో తోచక తన ఊరు వారణాసిలో ఎక్కడ పుస్తకాలు దొరికితే అక్కడికల్లా వెళ్లి ఆ అక్షరాల్లో పడ్డాడు. చదివి చదివి కలం చేత పట్టాడు. చిత్రగుప్తుడు వలే అన్ని పాపాలనూ చూసి వాటిని కథలు చేశాడు. ఒకటీ రెండూ అని ఏం చెప్తాం. అన్ని కథలదీ ఒకటే రుచి. కన్నీటి ఉప్పదనం.

 అతడి ఒక కథ సవాసేర్ ఘెవూ.

 అంటే సేరుంపావు గోధుమలు.  

 ఏమిటా కథ?

 ఒక కల్లాకపటం ఎరగని రైతు. హాయిగా బతుకుతుంటాడు. ఒకసారి ఒక సాధువు కాశీకి వెళుతూ ఆ రాత్రికి ఆ రైతు ఇంట బస చేస్తానని అంటాడు. రైతు సంతోషంగా ఒప్పుకుంటాడు. ఇంట్లో జొన్నపిండి ఉంది. కాని సాధువుకు గోధుమ రొట్టెలు చేసి పెడితే మర్యాద కదా అంటుంది భార్య. గోధుమలు లేవు. ఏమిటి దారి? రైతు ఆ ఊరి పురోహితుడి దగ్గరకు వెళ్లి అప్పుగా అని చెప్పి సేరుంపావు గోధుమలు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోతాడు. ప్రతి సంవత్సరం పంట పండాక ఊళ్లో అన్ని కులాల వారికి మేర ఇచ్చినట్టే పురోహితుడికి కూడా ఇస్తున్నాను కదా అన్ని సేర్ల గోధుమలు ఉచితంగా పట్టుకెళుతున్న పురోహితుడికి నా బాకీ చెల్లేసినట్టే కదా అనుకుంటాడు. కాని అతడి లెక్క తప్పు. ఐదేళ్ల పాటు పురోహితుడు ఒక్కమాటా మాట్లాడడు. రైతు కనిపించినా అసలా ప్రస్తావనే ఎత్తడు. ఐదేళ్ల తర్వాత చల్లగా లెక్క తీస్తాడు. ఆనాడు రైతు తీసుకున్న సేరుంపావు గోధుమల ధరను రొక్కంలోకి మార్చి దానికి వడ్డీ వేసి మారువడ్డీ వేసి చక్రవడ్డీ వేసి బండెడు అప్పు తేలుస్తాడు. నీ ఇష్టం. తీర్చకపోతే పైలోకాల్లో దేవుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటాడు. పైలోకాలు ఎలా ఉంటాయో రైతుకేం తెలుసు? దేవుడు సమాధానం కోరితే ఏం చెప్పాలో అంతకన్నా ఏం తెలుసు? అవన్నీ తెలిసింది పురోహితులకే. అయ్యా పురోహితులుగారూ... తమరు చేసింది మోసం. రేపు మీరైనా దేవుడికి సమాధానం చెప్పాలి కదా అనంటే పురోహితుడు లెక్క చేయడు. తాను దైవానికి భయపడను అంటాడు. అలా భయపడాల్సిన పని నోరులేని జనాలదే. ఇక చేసేదేముంది? బంగారం లాంటి రైతు. ఆ అప్పు తీర్చలేక- కేవలం సేరుంపావు గోధుమల అప్పు తీర్చలేక- డబ్బులు చెల్లించీ చెల్లించీ చివరకు పొలాన్ని పోగొట్టుకొని ఆఖరుకు ఆ పురోహితుడి పొలంలోనే వెట్టికి చేరుతాడు.  

 ఈ కథలో రైతు ప్రాణాలతో అయినా మిగిలాడు.

 మరో కథలో అది కూడా లేదు.

 ప్రేమ్‌చంద్ రాసిన అతి బీభత్సమైన కథ- సద్గతి.

ఒక మాదిగవాడు. జ్వరం నుంచి బయటపడి ఆ పూటే లేస్తాడు. కానీ కూతురి నిశ్చితార్థానికి ఆ రోజే పురోహితుణ్ణి ఇంటికి పిలుచుకుని రావాలి. పురోహితుడొచ్చి ముహూర్తం పెట్టకపోతే ఏ ఇంట ఏ పని జరుగుతుందని? మాదిగవాడు పురోహితుడి ఇంటికి బయలు దేరి- పెద్దవాళ్ల దగ్గరకు ఉత్తచేతులతో పోకూడదు కనుక ఆ నీరసంలోనే గడ్డి కోసి మోపు కట్టి తీసుకెళతాడు. మాదిగవాణ్ణి ముట్టుకోకూడదుగాని అతడు కష్టించి కోసిన గడ్డికి ఏం మైల? పురోహితుడు తీసుకుంటాడు. కాని ఇంటికి మాత్రం రాడు. కాస్త ఆ పని చెయ్ అంటాడు. చేస్తాడు. కాస్త ఈ పని చెయ్ అంటాడు. చేస్తాడు. పెరడంతా ఊడ్చు అంటాడు. ఊడుస్తాడు. ఒక పెద్ద చెట్టు మొద్దు పెరట్లో పడేసి కట్టెలు కొట్టు అంటాడు. పాపం మాదిగవాడు. జ్వరం ఇంకా పోలేదు. కడుపులో పచ్చి మంచినీరు కూడా పడలేదు. కాని తప్పదు. కూతురి నిశ్చితార్థం కోసం, తాను పెట్టుకోలేని ముహూర్తం కోసం ఆ చాకిరి తప్పదు. ఓపిక తెచ్చుకుంటాడు. కాని మొద్దు వాడి గొడ్డలికి లొంగదు. చేతుల్లో బలం చాలదు. ఆకలి. శోష. ఎండిపోతున్న నోరు. నడుమ పురోహితుడి భార్య వచ్చి వాణ్ణి చీదరగా చూసి ఇంట్లో ఒకటి రెండు రొట్టెలు ఉన్నా పెట్టదు. ఏం తల్లీ... రెండు రొట్టె ముక్కలు పెడితే ఏం పోయే... మాదిగవాడు ఏడుస్తాడు. మళ్లీ శక్తి తెచ్చుకొని మొద్దు ఎందుకు లొంగదో చూద్దాం అని... గొడ్డలి విసురుతూ విసురుతూ.. కింద పడిపోయి... గుడ్లు తేలేసి... ఊళ్లో పెద్దగోల అవుతుంది. మాదిగపల్లె ఆడవాళ్లంతా వచ్చి బ్రాహ్మణుడి ఇంట అడుగుపెట్టకూడదు కనుక బయటి నుంచే  ఏడ్చి శాపనార్థాలు పెట్టి పోతారు. ఆ కోపంతో శవం తీయడానికి ఎవరూ రారు. వాన మొదలవుతుంది. శవం అలాగే పడి ఉంటుంది. ఇక ఈ మాదిగవాడికి సద్గతి ఏది? పురోహితుడు ఆలోచిస్తాడు. కాసేపటికి ఒక కర్రతో వాడి కాలు ఎత్తి, దానికి తాడుతో ఉచ్చు వేసి దానిని ఏ మాత్రం అంటుకోకుండా లాక్కుంటూ వెళ్లి దూరాన పశువులు చస్తే పారేసే దిబ్బ మీద పారేసి వస్తాడు. మరుసటి రోజు తెల్లారుతుంది. పురోహితుడు యథావిధిగా లేచి ఇల్లంతా సంప్రోక్షణ చేసి నీళ్లు చిలకరించి తన దైనందిన జీవితంలో పడతాడు. కథ ముగుస్తుంది.

 ఏం కథ ఇది!

 సద్గతి ఎవరికయ్యా రావాల్సింది? ఈ కులాల వ్యవస్థకి కాదా. ఈ అంటరానితనానికి కాదా. ఈ దోపిడీ ముఠాలకు కాదా. ఈ నీతిమాలిన మనుషులకు కాదా. ఈ కనికరం లేని ఆచారాలకు కాదా.

 ఇన్నాళ్లు గడిచాయి.

 పరిస్థితిలో ఏ మార్పూ లేదు.

 సంస్కారాన్ని ఆశించాల్సి ఉంది. పని కొనసాగించాల్సి ఉంది.

 అదిగో- ప్రేమ్‌చంద్ మొదలెట్టిన ఆ పనిని కొనసాగించడానికి-

 నిబద్ధతతో స్వీకరించడానికి-

 చాలామంది- నిజంగానే చాలామంది -కథలు రాస్తుంటారు.

 

 - ఖదీర్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top