బతుకును పండుగ చేసుకున్న మనిషి

బతుకును పండుగ చేసుకున్న మనిషి - Sakshi


90వ పుట్టిన రోజు / ఆవంత్స సోమసుందర్



 

సోమసుందర్ వ్యక్తి వేరు, సాహిత్యం వేరు కాదు. ఎప్పుడూ చుట్టుపక్కల పదిమంది కుర్రాళ్లు ఉండవల్సిందే.నడుస్తున్న రాజకీయాల నుంచి సినిమాలు, సంగీతం, కవిత్వం ఎన్నెన్ని విషయాలు.

 

ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు ఒక నెత్తుటి బొట్టులోనె ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు ఖబడ్దార్.. ఖబడ్దార్..

 అంటూ నైజాం పాలనపై ఎత్తిన కవితల కత్తి ఆవంత్స సోమసుందర్ ‘వజ్రాయుధం’. ‘బానిసల దండయాత్ర’ కవితలోని ఈ మాటల బాణాలు తెలంగాణా సాయుధ పోరాటంలో దిక్కుదిక్కులా వినపడిన జనగర్జనలు.  తన చరిత్ర తనె పఠించి  ఫక్కున నవ్వింది ధరణి తన గాథను తనె స్మరించి  భోరున ఏడ్చింది ధరణి...



ఏం మిగిలింది చెప్పుకోడానికి? ప్రభువుల అణచివేత, పాలెగాళ్ల దురాగతాలు... అందుకనే కదా ధరణి నిస్సహాయంగా నవ్వింది. తట్టుకోలేక ఏడ్చింది. ఈ కవిత్వం సత్యం పలికింది. అందుకే పాలకులకు కోపం వచ్చింది. 1949లో వచ్చిన ‘వజ్రాయుధం’ పుస్తకాన్ని ఏడాది తిరగకుండానే మద్రాసు ప్రభుత్వం నిషేధించింది. 1956లో మళ్లీ ఈ పుస్తకం ప్రజల ముందుకు వచ్చింది.



ఆవంత్స సోమసుందర్‌కి ఈ నెల 18కి తొంభై ఏళ్లు నిండుతాయి. ఇప్పటి వరకు ఆయన సుమారు 100 పుస్తకాలు రాశారు. రాయడం మొదలుపెట్టి 73 ఏళ్లు అయినా 90 ఏళ్ల వయసు వల్ల కాలు, కళ్లు మొరాయిస్తున్నా ఇంకా రాస్తూనే ఉన్నారు. అరకొరగా నాలుగు ముక్కలు రాసి సోషల్ మీడియాలోకి ఎక్కించి అరగంటకొకసారి ‘లైకులు’ లెక్కించుకునేవారికి ఈయన ఒక ఎవరెస్టు శిఖరంలా కనపడతాడు కాబోలు. రాసినవన్నీ అందరూ చదువుతున్నారా? అని ఆయనను అడగటం అర్థం లేని ప్రశ్న. ఎందుకంటే రాయడం ఆయన ధర్మం. తనకు తెలిసింది పదిమందికి చెప్పాలనుకోవటం ఆయన ఫిలాసఫీ. ఆయన రాయని సాహితీరూపాలు లేవు. కవిత్వం, కథ, విమర్శ, విశ్లేషణ, ఆత్మకథ, ఉత్తరాలు ఇలా అన్ని ప్రక్రియలు వాడుకున్నారు.



1950లో ‘బానిసల దేశం’ కథల సంపుటి వేశారు. తర్వాత రాసిన కథలతో కలిసి ’84లో మరో కథల సంపుటి వేశారు. ‘సంచారిణీ దీపశిఖ’ లాంటి కథలు ఉన్నతమైన మానవ సంబంధాలకి ప్రతిబింబాలు. ‘కళాకేళి’ పత్రిక స్థాపించి నడిపింది నాలుగు ఏళ్లే అయినా అనేక మంది రచయితలకి ముఖ్యంగా యువకులకి వేదిక కల్పించి ఉత్సాహపరిచారు. ఆరుద్ర ‘త్వమేవాహం’ మొదలు ప్రచురించింది సోమసుందరే. అభ్యుదయ రచయితల సంఘం పెరిగి, పెద్దదై ఉద్యమంలా ఎదగడంలో సోమసుందర్ ‘కృషి’ చాలా ఉంది. అయితే అభ్యుదయం నీరసించినా సోమసుందర్ చతికిల పడలేదు.



ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా మొహం మీద ఎలా చెప్పగలరో తను ప్రేమించిన విషయాన్ని దాచుకోకుండా చెప్పగలరు అనడానికి ఉదాహరణలు- కృష్ణశాస్త్రి, తిలక్, అనిశెట్టిల మీద రాసిన విశ్లేషణలు. మరీ ప్రేమ ఎక్కువైతే మరింత ఎత్తుకు తీసుకెళ్లి కూర్చోబెట్టగలరు. కావాలంటే ‘శేషేంద్రజాలం’, ‘రుధిర జ్యోతిర్దర్శనం’ సాక్ష్యాలు.



సోమసుందర్ వ్యక్తి వేరు, సాహిత్యం వేరు కాదు. ఎప్పుడూ చుట్టుపక్కల పదిమంది కుర్రాళ్లు ఉండవల్సిందే. నడుస్తున్న రాజకీయాల నుంచి సినిమాలు, సంగీతం, కవిత్వం ఎన్నెన్ని విషయాలు. నాలుగు చుక్కల మందే అమృతం. ఇంక అక్కడ మిరియాల లక్ష్మీపతో, చందు సుబ్బారావు లాంటి వాళ్లో ఉంటే జాతరే జాతర. అలాంటి ఓ సంబరాలలోనే కదా ‘ఏనుగు పాదాల కింద నలిగిన చీమ కాలు విరిగిన శబ్దాన్ని’ సైగల్ గొంతులో విన్నది. అబ్దుల్ కరీంఖాన్ గారు ‘హంసధ్వని’ని హిందుస్తానీ చేశారు అని తెలుసుకున్నది.

 జన్మెత్తిన మానవునకు



జీవితమే పరమ ధనం

అయితే అది ఒకమారే

అతని కొసగబడిన వరం



అందుకనే కదా ఆయన తన బతుకునెప్పుడూ పండుగలా చేసుకున్నారు. వర్తమానంలోనే ఉంటూ భవిష్యత్తు మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నారు.



కాలము సైకత తీరము

నడచినపుడె పడును జాడ

గాలి కదిలెనా

మళ్లీ కనిపించదు

నరుని జాడ....



 కాని సార్, మీ తోటి జ్ఞాపకాలు ఎప్పుడూ పచ్చని ఆకుల్లా మాలో కొత్తగానే ఉంటాయి. కాలం గాలికి రెపరెపలాడుతూ నవ్వుతూనే ఉంటాయి.

 - కృష్ణమోహన్‌బాబు,  98480 23384

 





 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top