మద్దతు..ఉత్తదే! | Sakshi
Sakshi News home page

మద్దతు..ఉత్తదే!

Published Sun, Apr 20 2014 3:21 AM

No tie up!

మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : రబీ ధాన్యానికి మద్దతు ధర రావడం లేదు. మిల్లర్లు సిండికేట్‌గా మారి ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తుండడంతో ఆరుగాలం కష్టించి పండించిన రైతులు లబోదిబోమంటున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ధాన్యం తేమగా ఉందనే సాకుతో మద్దతు ధర చెల్లించడం లేదంటే మిల్లర్ల తీరు ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. మిషన్ల ద్వారా తేమశాతం పరిశీలిస్తున్నా రైతులకు శాతం వివరాలు తెలియజేయకపోవడంతోపాటు వారి ఎదుట శాతం పరిశీలించడం లేదు. దీనిని మార్కెట్ అధికారులు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
 
 మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం తీసుకువచ్చినా టెండర్లు వేయకపోవడంతో రైతులు రెండు, మూడు రోజులు మార్కెట్‌లోనే పడిగాపులు పడుతున్నారు. అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌లోకి రైతులు ఈ నెల 11వ తేదీ నుంచి ధాన్యం తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు 46,926 క్వింటాళ్ల ఎంటీయూ- 1010 రకం ధాన్యం మార్కెట్‌కు వచ్చింది. మార్కెట్ ప్రారంభమైన మొదటి రోజు క్వింటాకు వెయ్యి రూపాయలే చెల్లించిన మిల్లర్లు ప్రస్తుతం 1200 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు రూ.1345, సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు 1310 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం మొత్తం ఏ గ్రేడ్ ధాన్యం వస్తున్నది. దీంతో ఈ ధాన్యానికి క్వింటాకు రూ.1200లు చెల్లిస్తున్నారు.

 
 1861 క్వింటాళ్లకే మద్దతు ధర
 రబీ సీజన్‌లో మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం 1861 క్వింటాళ్ల ధాన్యానికి మాత్రమే మద్దతు ధర లభించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 46,926 క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌కు రాగా ఎక్కువ శాతం మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోళ్లు చేశారు. 11వ తేదీన సగటు ధర క్వింటాకు రూ.1276 చెల్లించగా మిగతా రోజుల్లో క్వింటాకు సగటు ధర కేవలం రూ.1270  చెల్లించారు. శనివారం కేవలం 2.57 శాతం ధాన్యానికి మద్దతు ధర చెల్లించారు.
 
 మార్కెట్‌కు 15,127 క్వింటాళ్ల ధాన్యం రాగా కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.1345, సగటు ధర రూ.1270 చెల్లించారు. 3794 క్వింటాళ్ల ధాన్యానికి కేవలం రూ.1151  నుంచి రూ.1200 లోపు చెల్లించారు. 4609 క్వింటాళ్ల ధాన్యానికి రూ.1201 నుంచి రూ.1240 లోపు, 4109 క్వింటాళ్ల ధాన్యానికి  రూ.1241 నుంచి రూ.1280 లోపు చెల్లించారు. 2226 క్వింటాళ్లకు రూ.1281 నుంచి రూ.1344 లోపు చెల్లించారు. కేవలం 389 క్వింటాళ్ల ధాన్యానికి మాత్రమే రూ.1345 మద్దతు ధర చెల్లించారు.
 

Advertisement
Advertisement