బాలయ్య దిగాలు | Sakshi
Sakshi News home page

బాలయ్య దిగాలు

Published Sun, Apr 20 2014 2:18 AM

మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు ఇంటికెళ్లి మాట్లాడుతున్న బాలకృష్ణ - Sakshi

సాక్షి, అనంతపురం :  ‘అనంత’ రాజకీయాలు ఎలాగుంటాయో బాలయ్యకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తన రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా ప్రారంభించానుకున్న బాలకృష్ణ సేఫ్‌జోన్‌లో ఉండేందుకు టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఇక్కడి నాయకుల మధ్య వర్గపోరుతో ఆయనకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా ఉంది. నాలుగు వర్గాలుగా విడిపోయిన నాయకులతో అటు బాలయ్య.. ఇటు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
 
 పచార పర్వంలో కూడా బాలయ్యకు అంతంత మాత్రంగానే ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. హిందూపురం మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులు, వెంకటరాముడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, టికెట్ ఆశించి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన అంబికా లక్ష్మినారాయణలు ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు. బాలయ్య ప్రచారంలో అబ్దుల్ ఘని, అంబికా వేర్వేరుగా కన్పిస్తున్నా మిగిలిన వారు దూరం దూరంగా ఉంటున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బాలకృష్ణ శుక్రవారం ప్రచారం ముగించుకుని అదే రాత్రికి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే నియోజకవర్గంలో నాయకత్వ లోపం ఉందని గ్రహించిన ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి హిందూపురంలోనే బసచేసి అసంతృప్తి నేతలు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడారు.
 
 శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు ఇంటికి వెళ్లి తన విజయానికి కృషి చేయాలని కోరినట్లు తెలిసింది. వెంకటరాముడు అనారోగ్యం కారణంగా బయట తిరగలేని పరిస్థితి ఉన్నా ఆయనకంటూ ఓ వర్గం ఉంది. దీంతో నాయకులందరినీ కలుపుకుని ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని బాలయ్య కోరినట్లు సమాచారం. అయితే అంతా ఏకతాటిపై నడిచేందుకు మాత్రం ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా తాను ఇతర జిల్లాలకు వెళ్లాల్సి ఉందని, పది రోజుల తర్వాత వస్తానని.. ఆ సమయానికి పార్టీ పరిస్థితి మెరుగయ్యేలా చూడాలని చెప్పి తన బావమరిది ప్రసాద్‌ను హిందూపురంలోనే ఉంచి బాలకృష్ణ హైదరాబాద్‌కు వెళ్లారు. జరిగిన విషయాన్ని ఆయన చంద్రబాబుకూ తెలియజేశారు.
 
 అయితే స్థానిక నేతలపై నమ్మకం లేక చంద్రబాబు తన దూతగా నారా వారి పల్లె నుంచి శేఖర్ అనే వ్యక్తిని హుటాహుటిన హిందూపురం పంపారు. ఇదిలా ఉండగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప బాలయ్యతో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. తరచూ తన కోపాన్ని అనుచరులు, నేతలపై బాలయ్య ప్రదర్శిస్తుండడమే ఇందుకు కారణమని సమాచారం. ‘ఎంత హీరో అయితే మాత్రం.. మమ్మల్ని పూచికపుల్లలా తీసేస్తారా?’ అంటూ కొంత మంది నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. అందుకే బాలకృష్ణను కలవడానికి కొంత మంది నాయకులు ఇష్టపడడం లేదని సమాచారం. రెండ్రోజుల క్రితం నిమ్మల కిష్టప్ప, అబ్దుల్ ఘని, అంబికా లక్ష్మినారాయణపై బాలకృష్ణ అందరి ముందూ చిర్రుబుర్రులాడినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామాల్లో బాలయ్య ప్రచారానికి అనుకున్నంత స్పందన రాకపోవడంతో ఓ టీడీపీ నేత ధైర్యం చేసి.. ‘సార్.. 30 ఏళ్లుగా మనం ఇక్కడ గెలుస్తున్నా పెద్దగా అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం ఈ విషయంపై బాగా చర్చ జరుగుతోంది.
 
 మొన్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ నామినేషన్‌కు జనం విపరీతంగా వచ్చారు. ఈ పరిస్థితిలో వాహనంపై నుంచి కాకుండా పల్లెల్లో ఇల్లిల్లూ తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లడుగుదాం’ అని సలహా ఇవ్వగానే బాలయ్య భగ్గుమన్నట్లు తెలిసింది. ‘ఈ ప్రాంతంలో మా నాన్న ఎన్టీఆర్ పేరు చెబితే చాలు ఓట్లు అవే పడతాయి’ అంటూ బాలకృష్ణ అవేశంగా ఊగిపోయారట. తర్వాత పలువురు నేతలు ఇదే విషయాన్ని నొక్కి చెప్పడంతో ఆందోళన చెందిన ఆయన శుక్రవారం రాత్రి, శనివారం నేతల మధ్య సయోధ్య కుదర్చడంపైనే దృష్టి పెట్టారు. అయినా స్థానిక నేతలు ఎవరంతకు వారు వారి వాదనలు వినిపిస్తుండటంతో బాలకృష్ణ తలపట్టుకున్నట్లు సమాచారం.  
 

Advertisement
Advertisement