సెన్సార్‌... సెన్సార్‌! | Sakshi
Sakshi News home page

సెన్సార్‌... సెన్సార్‌!

Published Wed, Jul 19 2017 2:14 AM

Central Board of Film Certification

ఉన్న సెన్సార్‌ బోర్డును ఏం చేయాలో, కొత్త బోర్డు ఏర్పాటు చేస్తే దాని నియమ నిబంధనల తీరెలా ఉండాలో నిర్ణయించబోతున్నారని చాన్నాళ్లుగా వినబడుతోంది. శ్యాం బెనెగళ్‌ నేతృత్వంలో అందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం, అది నివేదిక ఇవ్వడం పూర్తయి కూడా ఏడాది గడుస్తోంది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం రేపో మాపో తుది నిర్ణయం వెలువరించవచ్చునని చెబుతున్నారు. ఈలోగా సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ) చైర్మన్‌ పహ్లాజ్‌ నిహలానీ యధావిధిగా తన దోవన తాను ‘కట్‌...కట్‌’ అంటూ చలనచిత్ర పరి శ్రమనూ, డాక్యుమెంటరీ నిర్మాతలనూ ఠారెత్తిస్తున్నారు.

మరోపక్క కొన్ని పార్టీలూ, బృందాలూ సెన్సార్‌ బాధ్యతల్ని తమకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారన్నట్టు రెచ్చిపోతు న్నాయి. చిత్రాన్ని ముందుగా మాకు చూపించి, మేం ఓకే అన్నాక సెన్సార్‌ బోర్డుకు పంపుకోవాలని నిర్మాతలనూ, దర్శకులనూ బెదిరిస్తున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని ఘనంగా చెప్పుకునేచోట భావ ప్రకటనా స్వేచ్ఛకు అధికార, ప్రైవేటు బృందాల నుంచి ఈ స్థాయిలో అవరోధాలు ఎదురుకావడం విస్మయం కలిగిస్తుంది. ఇతర కళారూపాల్లాగే సినిమా అనేది కూడా ఒక కళా రూపం. పైగా అది సమాజాన్ని ప్రభావితం చేయగల బలమైన సాధనం. దానికి ఆంక్షల సంకెళ్లు వేయడమే తన కర్తవ్యమన్నట్టు సెన్సార్‌బోర్డు వ్యవహరిస్తోంది.

సీబీఎఫ్‌సీకి ఎందుకనో సెన్సార్‌ బోర్డు అనే మాట స్థిరపడిపోయింది. అలాగని ఆ బోర్డు నిజంగా అదే పని చేస్తున్నదన్న నమ్మకం కలగదు. కొన్ని చిత్రాల విషయంలో ఎంతో ‘విశాల దృక్పథాన్ని’ ప్రదర్శించి ఉదారంగా ధ్రువీకరణను అందజేసే బోర్డే... కొన్నిటి విషయంలో ఎక్కడలేని కారణాలనూ చూపి అడ్డుకుం టుంది. చాదస్తపు వాదనలతో చికాకు పెడుతుంది. ప్రభుత్వాలు మారినా, బోర్డుకు కొత్త వారొచ్చినా దాని పనితీరు మారదు. ఈమధ్యే నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌పై నిర్మాణమైన ‘ఆర్గ్యుమెంటేటివ్‌ ఇండియన్‌’ డాక్యుమెంటరీపై నిహలానీ కత్తిగట్టారు. ‘హిందూ ఇండియా’, ‘ఆవు’, ‘గుజరాత్‌’లాంటి పదాలను దాన్నుంచి తీసేయాలని తీసేయాలని హుకుం జారీచేశారు.

ఈ డాక్యుమెంటరీని నిర్మించిన సుమన్‌ ఘోష్‌ గతంలో తీసిన పలు చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నాయి. అమర్త్యసేన్‌తో ఆయన పూర్వ విద్యార్థి, అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అయిన కౌశిక్‌ బసు జరిపిన సంభాషణను తీసు కుని ఈ డాక్యుమెంటరీ రూపకల్పన చేశారు.

అమర్త్యసేన్‌ అభిప్రాయాలు ఎవరికీ తెలియనివి కాదు. ఆ అభిప్రాయాలతో ఏకీభవించేవారున్నట్టే వాటితో తీవ్రంగా విభేదించేవారున్నారు. ఇప్పుడు ఒక డాక్యుమెంటరీలో ఆయన వాడిన పదాల్ని కొత్తగా తొలగించినంత మాత్రాన సెన్సార్‌ బోర్డు సాధించేదేముంటుంది? అత్య వసర పరిస్థితి కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీరుతెన్నులు, దాని నియం తృత్వ ధోరణులు ఇతివృత్తంగా మాధుర్‌ భండార్కర్‌ నిర్మించిన ‘ఇందూ సర్కార్‌’ కు కూడా సెన్సార్‌ బోర్డు డజను కత్తిరింపులు చెప్పి ఆయన్ను అయోమయంలో పడేసింది. ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై బురఖా’, ‘జబ్‌ హారీ మెట్‌ సెజాల్‌’ చిత్రాలకు కూడా ఈ గతే పట్టింది.

సెన్సార్‌ బోర్డు తీరుపై నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయని ప్రశ్నిస్తే నిహలానీ చిత్రమైన జవాబిస్తున్నారు. తమ సినిమాలకు ప్రచారం లభించాలన్న యావతో కొందరు నిర్మాతలు ఇలా చేస్తున్నారని ఆయన వాదన! నిజానికి నిర్మాతలు చెబుతున్న సమస్య మరో రకమైనది. సెన్సార్‌ బోర్డు పెట్టే ఇబ్బందుల గురించి నోరెత్తినవారిని ‘బ్లాక్‌ లిస్ట్‌’లో పెట్టి అలాంటివారి తదుపరి చిత్రాలకు కూడా లేనిపోని అవరోధాలు కల్పిస్తున్నారని వారు చెబుతున్నారు. వీటి గురించి నిర్మాత ఎవరికి చెప్పుకోవాలి? ఈ బోర్డును నియమించిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పెద్దరికం వహించి ఏమైనా చెబుతుందనడానికి లేదు. 

కశ్మీర్‌ అశాంతిపైనా, నిరుడంతా జవహర్‌లాల్‌ యూనివర్సిటీలో చోటుచేసుకున్న నిరసనలపైనా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్‌ వేములపైనా నిర్మించిన డాక్యుమెంటరీలపై ఆ మంత్రిత్వ శాఖ వ్యవహరిం చిన తీరు చూస్తే ఆ నమ్మకం కలగదు. గత నెలలో కేరళలో డాక్యు మెంటరీలు, చిన్న కథా చిత్రాల అంతర్జాతీయోత్సవం జరిగినప్పుడు ఈ మూడు డాక్యుమెంటరీల ప్రదర్శనకూ ఆ శాఖ అనుమతి నిరాకరించింది. నిరుడు కూడా ఇలాగే రెండు చిత్రాలకు అనుమతి నిరాకరిస్తే ఒక నిర్మాత కేరళ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నాడు.

 విపక్షంలోని కాంగ్రెస్‌ ఈ సెన్సార్‌షిప్‌ను ప్రశ్నిస్తుందని ఆశపడక్కర్లేదు. అధి కారం కోల్పోయి మూడేళ్లవుతున్నా దానికి ఆ మత్తు దిగిన జాడలేదు. ‘ఇందూ సర్కార్‌’ చిత్రాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నాయకులు చిత్ర నిర్మాత, దర్శకులను బెదిరిస్తున్నారు. మాధుర్‌ భండార్కర్‌ నిర్వహించబోయిన మీడియా సమావేశాలను వారు రెండుసార్లు అడ్డుకున్నారు. ఎమర్జెన్సీ పేరిట దేశంలో 21 నెలలపాటు నియంతృత్వాన్ని అమలుచేసి వేలాదిమందిని జైళ్లలో కుక్కి, వందలమంది ప్రాణాలు తీసినందుకు ఆ పార్టీ కనీసం క్షమాపణలు చెప్పే సంస్కారాన్నయినా ప్రదర్శించలేకపోయింది. ఆనాటి స్థితిగతులపై చిత్రం వస్తే మాత్రం అభ్యంత రమట!

జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నవే ఇలా ఉంటే తమ కులాన్ని కించ పరిచారని, మతాన్ని అవమానించారని ఆరోపిస్తూ వీరంగం వేసే ఛోటా నేతల గురించి చెప్పుకోవాల్సింది ఏముంటుంది? తమతో ఏకీభవించని ఆలోచనలనూ, అభిప్రాయాలనూ అడ్డగించడం... పీక నొక్కాలని చూడటం అనాగరికం. ఆ పని సెన్సార్‌ బోర్డు చేసినా, వీధి రౌడీలు చేసినా ఖండించాల్సిందే. సెన్సార్‌ బోర్డు తీరుతెన్నులెలా ఉండాలో సూచిస్తూ శ్యాం బెనెగెళ్‌ కమిటీ నివేదిక ఇచ్చి ఏడా దవుతోంది. ఆ సిఫార్సుల ఆధారంగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు బిల్లు తెస్తారని, సెన్సార్‌ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలు చాలామటుకు పోతాయని చెబుతున్నారు. ఆ ముసాయిదా బిల్లు త్వరగా రూపుదిద్దుకుని, దానిపై సమగ్ర చర్చ జరిగి మెరుగైన విధానాలు అమల్లోకి వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement