తాయత్తు.. ప్రాణం తీసింది | Sakshi
Sakshi News home page

తాయత్తు.. ప్రాణం తీసింది

Published Mon, Jul 24 2017 11:09 AM

తాయత్తు.. ప్రాణం తీసింది - Sakshi

క్షణికావేశం.. క్షణికోద్రేకం..
ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి...
ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేశాయి 

నేలకొండపల్లి(పాలేరు): తన ఇద్దరు పిల్లలకు తరచూ జ్వరం. వైద్యం చేయించినా ఫలితం కనిపించలేదు. ఆ తల్లికి చెప్పలేనంత ఆందోళన.. ఆవేదన. ఇంటి ముందుకు వచ్చిన పకీర్‌తో తాయత్తులు కట్టించింది. అలా చేస్తేనన్నా తన బిడ్డలకు ఆరోగ్యం కుదుటపడుతుందని నమ్మింది. అదే ఆమె ప్రాణం తీసింది. మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో ఆదివారం ఇది జరిగింది. నూకమళ్ల అశ్విని(33)కి ఇద్దరు పిల్లలు విష్ణువర్ధన్‌(4), విష్ణు(2). వారికి తరచూ జ్వరం వస్తోంది. వైద్యం చేయించినప్పటికీ తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోం ది. గ్రామంలోకి శనివారం వచ్చిన పకీర్‌కు చెప్పింది. తాయత్తులు కట్టిం చింది. అలా చేస్తేనన్నా జ్వరం తగ్గుతుందేమోనన్నది ఆమె ఆశ.

సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఉపేందర్‌.. తన ఇద్దరు పిల్లలకు తాయత్తులు ఉండడాన్ని చూసి కోపగించుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న ఘర్షణ జరిగింది. ఆమె ఉద్రేకానికి లోనయింది. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. చుట్టుపక్కల వారు సర్దిచెప్పడంతో ఊరుకుంది. అంతటితో గొడవ సద్దుమణిగిందని  అనుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున బహిర్బూమికి వెళ్లిన అశ్విని, గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ప్రాణం తీసుకుంది. ఆ ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు, ఆలనాపాలనకు దూరమయ్యారు. ఏం జరిగిందో తెలీక, అమ్మ ఎందుకు కనిపించడం లేదో తెలీక ‘అమ్మా.. అమ్మా’ అంటూ గుక్కపట్టి ఏడుస్తున్న ఆ చిన్నారులను ఓదార్చడం, ఊరుకోబెట్టడం ఎవరి తరం కాలేదు. తాను ఈ లోకం నుంచి వెళ్లిపోతే.. ఈ ఇద్దరు పసిగుడ్లు ఏమవుతాయోనని ఆ తల్లి ఒకే ఒక్క క్షణం ఆలోచిస్తే... ఆ పిల్లలిద్దరికీ ఈ శోకం ఉండేది కాదుగా! ఇక తమకు జీవితాంతం అమ్మ ప్రేమ దొరకదన్న విషయం ఆ పసి మనసులకు అర్థమైతే.. ఏం జరిగేదో? ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement