భూ నిర్వాసితుల పొట్టకొడితే ఊరుకోం | Sakshi
Sakshi News home page

భూ నిర్వాసితుల పొట్టకొడితే ఊరుకోం

Published Sun, Jun 26 2016 8:32 PM

the former deputy CM Damodara raja narasimha slams TRS Government

-2013 చట్టం ప్రకారమే భూసేకరణ జరపాలి
-మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ

కొండపాక

 మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పొట్టకొడితే ఊరుకునేది లేదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా కొండపాకకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడిన టీఆర్‌ఎస్ సర్కార్ భూనిర్వాసితుల పొట్టకొట్టేలా 123 జీఓను తేరమీదికి తెచ్చిందని విమర్శించారు.

 

దీన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వం లేనిపోని విమర్శలు చేసిందని, అయినా బెదిరేది లేదన్నారు. భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టుల కోసం భూముల కోల్పోతున్న నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూసేందుకు యూపీఏ ప్రభుత్వం 2013లో భూసేకరణ చట్టాన్ని అమలు చేసి చట్టబద్ధత కల్పించిందన్నారు. అలాంటి చట్టాన్ని పక్కన పెట్టడం దారుణమన్నారు.

 

గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామస్తుల అనుమతి మేరకే భూసేకరణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామంటూ ముందుకు రావడం వెనుక మరో రకమైన కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. డబ్బులు అందిన తరువాతే భూములు రిజిస్ట్రేషన్లు చేయాలని ఆయన నిర్వాసితులకు సూచించారు. ప్రాంతీయేతరులు మోసం చేస్తే పొలిమెరల దాకా తరిమి కొట్టండి... తెలంగాణ వారే మోసం చేస్తే పాతి పెట్టండి... అంటూ భూనిర్వాసితులకు పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి చిలువేరి రాంరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement