వీళ్లంతా మన హీరోలకు డూప్‌లు... | Sakshi
Sakshi News home page

వీళ్లంతా మన హీరోలకు డూప్‌లు...

Published Sun, May 22 2016 3:59 PM

వీళ్లంతా మన హీరోలకు డూప్‌లు...

- డ్యాన్స్‌లే జీవితానికి ఆధారం
- హీరోలకు అనుకరణ మా అదృష్టం
- సామాన్యులమేనైనా సినిమాల్లో ఛాన్స్‌
- ఇదీ డూప్ సినీ ఆర్టిస్టుల మనోగతం

 
 అక్కినేని...  నాగేశ్వరావు కాదు.. మెగాస్టార్... చిరంజీవి అంతకన్నా కాదు
 మన్మథుడు...నాగార్జున కానేకాదు.. యువరత్న... బాలకృష్ణ అస్సలు కాదు
 ప్రిన్‌‌స.. మహేష్ బాబు ఎంతమాత్రమూ కాదు
 పవర్‌స్టార్... పవన్‌కల్యాణ్.. ఛ.. కాదేమో
 మరెవరు వీళ్లంతా??
 ఇక్కడ అక్కినేని అంటే కృష్ణారావు
 మెగాస్టార్ అంటే... వాసంశెట్టి శ్రీనివాసరావు
 మన్మథుడంటే ... శివప్రసాద్
 యువరత్న అంటే సతీష్‌కుమార్
 ప్రిన్స్‌ అంటే...రాము...
 పవర్‌స్టార్ అంటే...బాబీ
 అచ్చుగుద్దినట్టు ఉన్న వీళ్లంతా హీరోలకు డూప్‌లు...
 వాళ్లలా ఉండటమే వీరికి వరం వారి అనుకరణే వీరికి ఆదాయం
 వారు కాలు కదిపితేనే వీళ్లకు ఇళ్లు గడిచేది...
 ఆరేసుకోబోయి నుంచి బ్లాక్‌బాస్టర్ వరకూ పెనవేసుకున్న సినీబంధం వీరిది... ఈ సూపర్‌‘డూపర్’ల లైఫ్ స్టైల్ సండే స్పెషల్...
 -గోపాలపట్నం

 
ఆ హీరోలు ఈ భూమ్మీద పుట్టడమే మాకు వరం. వారే పుట్టకపోయి వుంటే ఇపుడు మేం ఏ కూలోనాలో చేసుకునేవాళ్లం... వారు పుట్టడం, సినిమా హీరోలవ్వడం మా పూర్వ జన్మ సుకృతం. వారిని అనుకరిస్తే మాక్కూడా సినిమాల్లో ఛాన్సులొచ్చేస్తున్నాయి. మమ్మల్నీ చప్పట్లు కొట్టి అభినందిస్తున్నారు. ఇంతకంటే ఏంకావాలి... ఇదీ సినీడూప్‌ల మనోగతం. అచ్చం చిరంజీవిని పోలిన ఏలూరు హనుమాన్ జంక్షన్ వాసి  వాసంశెట్టి శ్రీనివాసరావు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హావభావాలు ప్రదర్శించే రాజమండ్రి కళాకారుడు కేవీ కృష్ణారావు, బాలకృష్ణను పోలిన విశాఖ నగర ఆరిలోవకు చెందిన డి.సతీష్‌కుమార్, డిటో పవన్‌కళ్యాణే అన్నట్లు వుండే రాజమండ్రి కళాకారుడు ఎం.బాబి, అదే ప్రాంతానికి చెందిన మహేష్‌బాబు డూప్ బి.రాము.. గోపాలపట్నం శివారు నందమూరినగర్‌లో నటసామ్రాట్ సినీ డాన్స్‌ ట్రూప్ పేరుతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు.
 
చిరును కలిసే అదృష్టం కోసం ఎదురుచూస్తున్నా

చిరంజీవి పుట్టడమే నాకు వరం. ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచీ మహా ప్రాణం. ఆయనలా డాన్‌‌స చేయాలని...అలాగే మాట్లాడాలని నా ఆశ.  ఒకరోజు పండుగ ఊరేగింపులో అంతా చిరంజీవిలా వున్నావని చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. అలా స్టేజ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యాను. ఇపుడు చిరంజీవినే అనుకరించడం వల్ల టీవీల్లో లెక్కలేనన్ని డాన్‌‌స షోలిచ్చాను. వర్మ దర్శకత్వంలో అప్పలరాజు, గజదొంగలు, రణం-2 సినిమాల్లో నటించాను. ఎప్పటికైనా చిరుని కలిసి ఆయన ముందు ప్రదర్శన ఇవ్వాలని ఉంది.
 -వాసంశెట్టి శ్రీనివాసరావు, చిరంజీవి డూప్
 
‘టైటానిక్ అంతర్వేదిక్ అమలాపురం’ సినిమాలో ఛాన్స్‌

 నాకు ఇపుడు డెబ్భై ఏళ్లు. అయినా ఇప్పటికీ అక్కినేని డ్యాన్‌‌సలతో అదరగొడతాను. పదో ఏట నుంచే ఏన్‌ఆర్ డాన్సులు, పాత్రలంటే ఇష్టం. అందులో కష్టనష్టాలు చూశాను. బడిఎగ్గొట్టి డాన్సులు వేస్తుండడం వల్ల పరీక్షల్లో నిద్రపోతుండేవాణ్ణి. మొత్తంమ్మీద చదువు అబ్బలేదు. అలా అలా నాటకాలరాయుడని పేరుండేది. పూర్వం రోజుల్లో కంటే ఇపుడు డాన్సులకు ఆదరణ పెరిగింది. కళలో నైపుణ్యం ఉంటే ఆదరిస్తున్నారు. నేను ఎందరో కళాకారుల్ని తయారు చేశాను. ఏఎన్‌ఆర్ డూప్ పాత్రల వల్ల సినిమాలు, సీరియళ్లలో నటించాను. తాజాగా రాజవంశీ దర్శకత్వంలో మా టీమ్ అంతా కలిసి ‘టైటానిక్ అంతర్వేదిక్ అమలాపురం’...సినిమాలో నటిస్తున్నాం.      
  -కేవీ కృష్ణారావు, ఏఎన్‌ఆర్ డూప్
 
 ప్రవృత్తిగా బాగుంది
 వృత్తి రీత్యా బీరువాలు, మంచాలు, గృహోపకరణాలు ఇంటింటికీ తిరిగి స్కీంగా అమ్ముతుంటాను. మానాన్న సూరిబాబు జూనియర్ కృష్ణ డూప్‌గా నటిస్తుంటారు. నాన్న స్ఫూర్తితో నేనూ డాన్‌‌సపై ఇష్టం పెంచుకున్నాను. మా నాన్న కృష్ణ అయితే నేను మహేష్‌బాబు డూప్ పాత్ర చేస్తుంటాను. ఇపుడు మహేష్‌బాబు ట్రెండ్‌లో నాకు బాగానే డిమాండ్ నడుస్తోంది.  
 -బి.రాము, జూనియర్ మహేష్‌బాబు
 
 సినిమా, సీరియల్స్‌లో అవకాశాలు
 మా నాన్న రవికుమార్ కృష్ణ డూప్. చదువుకూడా కొంతవరకే అబ్బింది. ఏడుతో చదవు ఆపేసి పవన్‌కళ్యాణ్ డాన్సులు నేర్చుకున్నాను. సాంఘిక నాటకాలు కూడా వేస్తుండేవాణ్ణి. ఒక సినిమాలో అవకాశం వచ్చింది. సీరియళ్లు, టీవీ కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చాను. ఇంకా గణపతి నవరాత్రులు, దుర్గావేడుకలు, షాపింగ్‌మాల్స్ ప్రచారాలకు మమ్మల్ని సినీ డూప్‌లుగా ప్రదర్శనలకు ప్రోత్సహించడం ఆనందంగా ఉంది.
- బాబి, పవన్‌కళ్యాణ్ డూప్
 
 అమ్మానాన్నలను పోషిస్తున్నా...
 చిన్నపుడు నేర్చుకున్న డాన్సే నాకు జీవితం అయింది. ఈ డాన్సుతోనే మా అమ్మ నాన్నలను పోషిస్తున్నాను. చెల్లికి పెళ్లిచేశాను. భార్యాపిల్లల్ని పోషించుకుంటున్నాను. మరో పనిరాదు. సరదాగా నేర్చుకున్న డాన్‌‌స ఉపాధి అయింది. అచ్చం నాగార్జున గెటప్‌లో లీనమవ్వడం వల్ల ప్రేక్షకులనుంచి భలే స్పందన ఉంటోంది. మా లాంటి కళాకారులను ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రచారాలకు ఉపయోగించుకోవడం, ఆ రకంగా మాకు జీవనోపాధి కల్పిస్తే బాగుంటుంది.  
 - శివప్రసాద్, నాగార్జున డూప్
 
 చెల్లెళ్ల బాధ్యత నా మీదే ఉంది
 చిన్నతనం నుంచీ డాన్సులంటే సరదా. ఆర్థిక కారణాల వల్ల చదువు అంతగా సాగలేదు. పెయింటిం గ్ పనులు చేస్తుంటాను. ఇద్దరి చెల్లెళ్ల బాధ్యత నామీదే ఉంది. ఒకప్పుడు కృష్ణ డూప్‌గా వేసేవాణ్ణి. తర్వాత బాలకృష్ణ పోలికలు కూడా ఉండడంతో ప్రేక్షకుల అభిమానం పొందుతున్నాను.
 - సతీష్‌కుమార్, బాలకృష్ణడూప్

Advertisement
Advertisement