విశాఖ స్టేషన్‌పై విదేశీ కన్ను | Sakshi
Sakshi News home page

విశాఖ స్టేషన్‌పై విదేశీ కన్ను

Published Wed, Jun 14 2017 1:19 AM

విశాఖ స్టేషన్‌పై విదేశీ కన్ను - Sakshi

► స్టేషన్‌ రీడెవలపింగ్‌ ప్రాజెక్టు కోసం పోటీ
► రూ.600 కోట్లతో అత్యాధునికీకరణ
►  టెండర్ల వేయడానికి 19 తుది గడువు


సాక్షి, విశాఖపట్నం : స్వచ్ఛతలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్న విశాఖ రైల్వేస్టేషన్‌ పై విదేశీ సంస్థలు కన్నేశాయి. అందానికి అందం, ఆదాయానికి ఆదాయం, పరిశుభ్రతకు పరిశుభ్రం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న ఈ స్టేషన్‌ రీడెవలపింగ్‌ ప్రాజెక్టును దక్కించుకోవడానికి పోటీపడుతున్నాయి.

దేశంలోని 23 ప్రఖ్యాత స్టేషన్లలో విశాఖ కూడా ఒకటి! ఈ నేపథ్యంలో ఈ స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేయడానికి పబ్లిక్, ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో ముందుకెళ్లనున్నారు. 45 ఏళ్ల పాటు లీజు అమలులో ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో రూ.200 కోట్లు బ్యూటిఫికేషన్‌కు ఖర్చు చేయనున్నారు. మిగిలిన రూ.400 కోట్లతో స్టేషన్‌లో అభివృద్ధి పనులు, షాపింగ్‌మాల్స్, వాణిజ్య సముదాయాల నిర్మాణంతో పాటు ప్లాట్‌ఫారాల విస్తరణ వంటివి చేపడతారు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ప్లాట్‌ఫారాల సంఖ్యను 12కి పెంచే యోచన కూడా ఉంది. ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫారానికి ఆనుకుని జ్ఞానాపురం వైపున సుమారు 19 వేల చదరపు మీటర్ల స్థలం రైల్వే స్థలం ఉంది. అందులో స్టేషన్‌ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు.

రోజూ 50 వేత మంది రాకపోకలు
విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి రోజూ 111 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 50 వేల మంది ఈ స్టేషన్‌ మీదుగా ప్రయాణిస్తుంటారు. దేశంలోని ఏ–1 గ్రేడ్‌ స్టేషన్లన్నింటినీ తలదన్నుతూ స్వచ్ఛతలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని మరింత ఖ్యాతినార్జించింది.

అంతర్జాతీయ సంస్థల ఆసక్తి
స్టేషన్‌ రీడెవలపింగ్‌ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ప్రముఖ దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. ఇందులో ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్, మలేసియాలతో పాటు దేశంలోని ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇలా ముందుకొచ్చిన సంస్థల ప్రతినిధులతో రైల్వేశాఖ ఇటీవల ప్రీ–బిడ్‌ సమావేశం నిర్వహించింది. వారితో పాటు ప్రజల నుంచి రీడెవలపింగ్‌కు సంబంధించి వివిధ మాధ్యమాల ద్వారా సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు బిడ్లు దాఖలు చేయడానికి జూన్‌ 19 ఆఖరు తేదీగా నిర్ణయించారు. 29న టెండర్లను తెరుస్తారు. ఎన్ని సంస్థలు టెండర్లను దాఖలు చేశాయో ఆ రోజు వెల్లడవుతుంది. భారతీయ రైల్వేలో విశాఖపట్నం స్టేషన్‌కు ప్రత్యేకత, ప్రాధాన్యం ఉంది.

Advertisement
Advertisement