ఉద్యోగాల కోసం రావద్దు | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల కోసం రావద్దు

Published Mon, Jul 25 2016 11:35 PM

not coming for employement

 

ఉద్యోగాల కోసం రావద్దు 
‘మీ కోసం’లో కలెక్టర్‌ కె.భాస్కర్‌
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ఆస్తి తగాదా కేసులు కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలే తప్ప మీ  కోసం కార్యక్రమంలో పరిష్కారం కుదరదని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ మీ కోసం కార్యక్రమానికి ఉద్యోగాల కోసం ఎవరూ రావద్దని అర్హతను బట్టి ఉద్యోగాల ఎంపిక జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలను కలెక్టర్‌కు చెప్పుకున్నారు. 
∙ఏలూరు న్యూమార్కెట్‌లో మునిసిపాలిటీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ వ్యాపారులు షెడ్డును నిర్మించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తూర్పువీధికి చెందిన ఎన్‌.వీరబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 
∙దువ్వలో ప్రభుత్వాసుపత్రి లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తే పది గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ గ్రామ ప్రజలు కలెక్టర్‌ను కోరారు. 
∙ఉండ్రాజవరం మండలానికి చెందిన జీడీవీ అయ్యప్పస్వామి తనకు రెండు నెలల కిత్రం గ్రేడ్‌ లైబ్రేరియన్‌గా గ్రంథాలయ సంస్థలో అపాయింట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ ఉద్యోగంలో జాయిన్‌ చేసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. 
∙చాగల్లు సెంటర్‌లోని మేకల చెరువు పూడ్చి కల్యాణ మండపం నిర్మించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం కేవలం 25 శాతం మాత్రమే చెరువు ఉందని, దీంతో ఇబ్బందులు తప్పవని, కల్యాణ మండప నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆ గ్రామానికి చెందిన జి.సూర్యారావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా వెంటనే సంబంధితాధికారిని పిలిచి చెరువులు ఉన్న చోట కల్యాణ మండపం కట్టడమేమిటని ప్రశ్నిస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
∙దెందులూరు మండలం మేధినరావుపాలెం కొవ్వలి రాజేంద్రప్రసాద్‌ తన ఫిర్యాదులో ఉపాధి హామీ పథకం నిధుల్లో పలు అవకతవకలు జరిగాయని, జన్మభూమి సభ్యులకు వారి అకౌంట్‌లలో నిధులు వేసి పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 
∙నిడదవోలు పట్టణానికి చెందిన ముంగర ఏసుబాబు కుమార్తె మరియమ్మ 17 ఏళ్ల మైనర్‌ బాలిక అదృశ్యంపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై కలెక్టర్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్‌ భాస్కర్‌ వెంటనే వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.  జేసీ పి.కోటేశ్వరరావు, డీఆర్వో కె.ప్రభాకరరావు, అదనపు జేసీ ఎంహెచ్‌.షరీఫ్, డీపీవో కె.సుధాకర్‌ పాల్గొన్నారు. 
 

 

Advertisement
Advertisement