ఇక్కడే కుట్ర | Sakshi
Sakshi News home page

ఇక్కడే కుట్ర

Published Fri, Jun 9 2017 11:47 PM

ఇక్కడే కుట్ర - Sakshi

నేర ప్రణాళికలకు జిల్లా జైలే అడ్డా
శిక్ష అనుభవిస్తూ ఒక్కటవుతున్న  క్రిమినల్‌ మైండ్స్‌
విడుదల అనంతరం పక్కగా చోరీలు
హత్యలకూ వెనకాడని వైనం
పోలీసుల విచారణలో వెలుగు  చూసిన నిజాలు


క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు పరివర్తన చెందే స్థలం జైలు. వివిధ నేరాలలో శిక్ష పడి జిల్లా జైలుకు వస్తున్న కొందరు ఖైదీలు అందుకు విరుద్ధంగా రాటుదేలుతున్నారు. ఇతర ఖైదీలతో కలిసి నేరాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. బయటకు వచ్చి పక్కాగా అమలు చేస్తున్నారు. వారిలో మార్పుతీసుకురావడంలో జైలు అధికారుల కృషి నీరుగారుతోంది.

నిజామాబాద్‌ క్రైం  (నిజామాబాద్‌ అర్బన్‌) : వారంతా ఎక్కడెక్కడి వారో తెలియదు.. అంతా ఒక్కటవుతున్నారు.. చేసిన నేరాలే వారిని ఒక్కటిగా చేస్తున్నాయి. సారంగపూర్‌లోని జిల్లా జైలే వారికి వేదికగా మా రింది. వివిధ నేరాల్లో శిక్ష పడి జైలులో శిక్ష అనుభవించేందుకు వచ్చే కొంతమంది ఖైదీలు.. పరివర్తనలో మార్పు చెందకపోగా ఒకరి నేర చరిత్రను ఒకరు తెలుసుకుంటూ దోస్తీ చేస్తున్నారు. ఈ రకమైన చోరీకి నీ లాంటివాడే సరైనోడు అంటే, ఆ రకమైన నేరానికి నీ లాంటి వాడి సహకారం అవసరమంటూ జైలులోనే దొంగతనాలకు, నేరాలకు వ్యూహరచనలు చేస్తున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఒకచోట కలుసుకుంటున్నారు. జైలులో వేసుకున్న ప్రణాళికలను అమలు పరిచేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఈ రకమైన ఘటనే ఇటీవల మాక్లూర్‌ మండలం చిన్నాపూర్‌ గండిలో రామాలయం పూజారీ నారాయణదాస్‌ దారుణహత్య.

నిందితులలో ఒకరు ఆటోడ్రైవర్‌ దుబ్బాక లక్ష్మణ్‌ ది నిజామాబాద్‌ మండలం సారంగాపూర్‌ గ్రామం కాగా, మరో నిందితుడు నర్ర ఎల్లయ్య ది ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామం. వీరిద్దరూ వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు పంపారు. కోర్టు వీరు చేసిన నేరాలపై శిక్ష విధిస్తూ జిల్లా జైలుకు పంపింది. అక్కడ వీరిద్దరు పరిచయం అయ్యారు. ఒకరి నేర చరిత్రను ఒకరు తెలుసుకున్నారు. జైలులోనే చోరీలకు ప్రణాళికలు రచించుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం చేసే క్రమంలో చిన్నాపూర్‌ గండిలో ఆలయ పూజారిని దారుణంగా హత్య చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వీరిని పట్టుకున్నారు. జైలులో వీరి పరిచయం..అనంతరం చోరీలకు పాల్పడడం పోలీసులను విస్మయానికి గురిచేసింది.

నేరాలపై అవగాహన కల్పిస్తున్నా ..
జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండేలా జైలు అధికారులు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. న్యాయ సేవాసంస్థ ఆ ధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఏ నేరాలకు ఎటువంటి శిక్షలు ఉంటాయి, నేర చరిత్ర వలన ఖైదీలు,  వారి కుటుంబాలు ఎంత నష్టపోతున్నా యో వివరిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలతో కొంతమంది ఖైదీల్లో మార్పువచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతుండగా.. మరికొంత మంది బుద్ధి మా రక తిరిగి నేరబాట పడుతున్నారు. జైలు లో శిక్ష అనుభవించిన ఖైదీలు చేసిన తప్పులను మళ్లీ చేయకుండా జైలు, పోలీసు అధికారులు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement