కరీంనగర్‌ డెయిరీ అభివృద్ధికి కృషి | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ డెయిరీ అభివృద్ధికి కృషి

Published Tue, Jan 3 2017 3:07 AM

కరీంనగర్‌ డెయిరీ అభివృద్ధికి కృషి - Sakshi

కరీంనగర్‌సిటీ : కరీంనగర్‌ డెయిరీని విస్తరించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలందిస్తామని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ హామీ ఇచ్చారు. సోమవారం నిర్వహించిన డెయిరీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశాఖ, మదర్, కరీంనగర్‌ డెయిరీలు లాభార్జనలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కరీంనగర్‌ డెయిరీ 97 వేల లీటర్ల పాలను మాత్రమే సేకరించేదని, రెండేళ్లలోనే 2.20లక్షల లీటర్లకు పెరగడం ఆనందంగా ఉందని, దీనిని ఐదు లక్షలకు పెంచాలని సూచించారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు ఎన్‌సీడీసీ పథకం కింద 20 శాతం సబ్సిడీతో రూ.398కోట్లు రుణాలు తీసుకొచ్చినట్లు తెలిపారు.

భూనిర్వాసితులకు పునరావాసం కల్పించే చర్యల్లో భాగంగా పాడి పశువులను ఇప్పించేందుకు బ్యాంకుకు డెయిరీ గ్యారంటీగా ఉండాలని పాలకమండలిని కోరారు. ఇందుకు చైర్మన్‌ రాజేశ్వర్‌రావు అంగీకరించారు. ఈ విషయం లో నాబార్డు, ఎన్‌సీడీసీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇచ్చేందుకు కృషి చేస్తాన ని హామీ ఇచ్చారు. పాల శీతలీకరణ, సరఫరా నిమిత్తం ఇంటిగ్రేటెడ్‌ కోల్డ్‌చైన్‌ ప్రాజెక్టును త్వర లో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఇందుకు కేంద్రం నుంచి రూ.42 కోట్ల రుణాన్నిప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, కార్పొరేటర్లు సునీల్‌రావు, శ్రీకాంత్, ఏవీ రమణారావు, నాయకులు చల్ల హరిశంకర్, దిండిగాల మహేశ్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement