చుక్కానిలేని నావ! | Sakshi
Sakshi News home page

చుక్కానిలేని నావ!

Published Wed, Oct 26 2016 1:30 AM

Cukkanileni boat!

సాక్షి ప్రతినిధి, కడప: ‘పల్లకిలో ఊరేగే రాజును కాదోయ్‌....ఆ పల్లకిని మోసే బోయలను గుర్తించవోయ్‌..’ ఓ మహాకవి వెల్లడించిన సూక్తికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారిస్తోంది. మూడున్నర్ర దశాబ్దాలుగా టీడీపీనే నమ్ముకొని ఉన్న వారిని విస్మరిస్తూనే, అరువు నేతలకు అందలమెక్కిస్తున్నారు. పోనీ జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక చొరవ చూపుతున్నారంటే అదీలేదు. చుక్కానిలేని నావలా పెండింగ్‌ పనులు ఉండిపోయాయి. ప్రధాన నాయకులు వ్యక్తిగత ఫోకస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మినహా ప్రత్యేకచొరవ చూపడంలో విఫలమవుతున్నారు. వెరసి ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లుగా తెలుగుతమ్ముళ్లు ఉండిపోయారు. మరోవైపు అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉండిపోయాయి.
ప్రగతి పట్టదు.. భూములు మాత్రం కావాలి
టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పైగా రాజధాని ఏరియాలో అటవీ భూములు స్వా«ధీనం చేసుకొని, ప్రత్యామ్నాయంగా జిల్లాలో 50వేల ఎకరాలను అటవీశాఖకు అప్పగించారు. అలాగే పట్టుబడ్డ ఎర్రచందనం ద్వారా దాదాపు రూ.1,000 కోట్లు ఆదాయం గడించారు. ఇంకోవైపు ఇసుక ద్వారా మరో రూ.200కోట్లు ఆదాయం దక్కింది. ఇదేకాకుండా వివిధ మైనింగ్‌ నిర్వహణ ద్వారా ప్రభుత్వ ఖజానా గణనీయంగా భర్తీకి జిల్లా దోహదపడింది. ఇక్కడి నుంచి లభించిన ఆదాయం మేరకు కాకపోయినా అందులో సగభాగమైన జిల్లాకు నిధులు దక్కలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఉన్న పెండింగ్‌ పథకాలు ఇవి, వీటి పట్ల ప్రత్యేక చొరవ చూపండి అని ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడి చేసిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. బుధవారం నాటి టీడీపీ విస్తృత స్థాయి సమావేశమైనా జిల్లా ఉన్నతికి దోహదపడేలా కార్యచరణ ఉండాలని ప్రజానీకం కోరుతోంది.
గడ్డం పెరుగుతూ....నే ఉంది
‘పులివెందుల గడ్డమీద కృష్ణజలాలను పారించే వరకూ గడ్డం గీయను’ అని ప్రతినబూనిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ఎస్వీ సతీష్‌రెడ్డి గడ్డం పెరగడం మినహా తీయించే పరిస్థితి ఇప్పట్లో కన్పించడం లేదు. 2013లోనే గండికోట రిజర్వాయర్‌లో 3.5టీఎంసీల నీరు నిల్వ చేశారు. టీడీపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక శరవేగంగా పెండింగ్‌ పనులు చేపట్టి ముంపు గ్రామాలను ఖాళీచేయించి ఉంటే, ఈపాటికి పైడిపాళెం రిజర్వాయర్‌కు నీటిని లిప్ట్‌ చేసే అవకాశం ఉండేది. తద్వారా పులివెందుల గడ్డమీద కృష్ణజలాలను పారించే అవకాశం ఉండేది. ఆ దిశగా ప్రభుత్వం కానీ, ప్రతినబూనిన సతీష్‌రెడ్డి కానీ, జిల్లా నేతలు చర్యలు తీసుకోలేకపోయారని పలువురు విమర్శిస్తున్నారు. తుదకు సతీష్‌రెడ్డి సైతం వ్యక్తిగత ఫోకస్‌ కోసమే గడ్డం గీయను అంటూ ప్రతిజ్ఞ చేశారంటూ అధిష్టానంకు ఆ పార్టీ నేతలే ఫిర్యాదులు చేశారు. దీనిని బట్టే తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉండిపోయాయని చెప్పవచ్చు.
ఈ ఏడాదికి కష్టమే
ప్రస్తుతం గండికోటకు 200 క్యూసెక్కుల చొప్పున నీరు వస్తోంది. ఇప్పటికి దాదాపు 0.82 టీఎంసీల నీరు గండికోటలో నిల్వ ఉంది. డిసెంబర్‌ వరకూ ఇలా గండికోటకు నీరు లభించే అవకాశం ఉంది. ఇలా నీరు వచ్చినా మహా అయితే మరో 1.5టీఎంసీల నీరు చేరవచ్చునని నిపుణులు వివరిస్తున్నారు. 5 టీఎంసీలకు తక్కువ ఉంటే పైడిపాళెంకు లిఫ్ట్‌ చేయడం సాధ్యం కాదు. అంటే ఈఏడాది కూడా సతీష్‌రెడ్డి గడ్డం గీయించే అవకాశం ఉండకపోవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణ కోసం యోగ్యకరమైన రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణం, బ్రహ్మంసాగర్, గండికోట, వామికొండ, సర్వారాయసాగర్‌ ప్రాజెక్టుల పెండింగ్‌ పనులు పూర్తిచేయించాలని జిల్లావాసులు కోరుతున్నారు. పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధి కోసం కృషిచేసేలా ఉండాలని అలాంటి ఒత్తిడి అధికారపార్టీ నాయకులు తేవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
మూడు వర్గాలు..ఆరు గ్రూపులు
టీడీపీలో మూడు వర్గాలు ఆరు గ్రూపులు అన్నట్లుగా పరిస్థితి ఉండిపోయింది. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తుంటే, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ మరోవర్గాన్ని భుజానికెత్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈక్రమంలో ‘ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడీ’ అన్నట్లుగా జిల్లా నాయకులు వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘకాలంగా టీడీపీని అంటిపెట్టుకొని ఉన్నవారిని కాదని, మధ్యలో వచ్చి∙పార్టీ నేతలుగా చలామణి అయ్యేవారికే ప్రాధాన్యమిస్తున్నారని ఆపార్టీ సీనియర్‌ నాయకులు వాపోతున్నారు. ఇప్పటికైనా పార్టీకోసం శ్రమించే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. అలాంటివారినే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకంటించాలని, ఆమేరకు జిల్లా విస్తృత స్థాయి సమావేశం తీర్మానం చేయాలని అంతర్గతంగా కోరుతున్నట్లు సమాచారం. 

Advertisement
Advertisement