రాజమహలే కలెక్టరేట్! | Sakshi
Sakshi News home page

రాజమహలే కలెక్టరేట్!

Published Mon, Jun 27 2016 1:39 AM

రాజమహలే కలెక్టరేట్!

ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
రాజావారి బంగ్లా మరమ్మతులకు ఆదేశాలు
►  ఏర్పాట్లలో ఆర్‌అండ్‌బీ శాఖ
 

వనపర్తి టౌన్ : పాలనాసౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటులో వనపర్తికి చోటు దక్కడం దాదాపు ఖాయమనే చెప్పవచ్చు. అధికార యంత్రాగం చేస్తున్న హడావుడి మరింత బలాన్ని చేకూరుస్తోంది. వనపర్తి కలెక్టరేట్‌గా రాజ మహల్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం నుంచి అనుమతులు అందగా ఆర్‌అండ్‌బీ అధికారులు బంగ్లా మరమ్మతులుకు ఏర్పా ట్లు కూడా మొదలెట్టారు. కలెక్టరేట్‌కు ఈ బంగ్లా అన్ని రకాల అనుకూలంగా ఉండటం, సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల స్థలం ఉండటంతో కలిసి రానుంది.


ప్రతిపాదనల తయారీ
రాజమహల్ ప్రస్తుత భవన పరిస్థితులు, మరమ్మతులకు, పెయింటింగ్ ఇతర వాటికి  కావాల్సిన నిధులపై ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు అదే పనిలోనే ఉన్నారు. ఆదివారం ఆర్‌అండ్‌బీ ఏఈ మురళీధర్ మహల్‌లో పర్యటించి కావాల్సిన ఫొటోలు తీసుకున్నారు. ఈ నెలాఖ రులోపు బంగ్లాకు కావాల్సిన ప్రతిపాదనలు తయారుచేసి పంపనున్నారు.


గిప్ట్ అగ్రిమెంట్ మాత్రమే..
స్వాతంత్య్రం అనంతరం 1956లో భారత ప్రధాన మంత్రి నెహ్రూ చేత తొలిసారిగా వనపర్తి రాజమహల్‌లో ప్రైవే ట్ పాలిటెక్నిక్ కళాశాలను రాజా రామేశ్వర్‌రావు ప్రారంభించారు. 1978లో ఈ బంగ్లాలో కేవలం పాలిటెక్నిక్ విద్యను మాత్రమే కొనసాగించేలా నిబంధన పెట్టి భవనాన్ని ప్రభుత్వానికి దానపూర్వకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. భవనంపై పూర్తి అధికారాలు ప్రభుత్వానికే ఉన్నప్పటికీ అప్పటి అగ్రిమెంట్ గురించి ఆలోచన చేస్తున్నారు. వాటి ప్రతులను రెండ్రోజుల కిందట తెప్పించుకొని పరిశీ లించినట్లు తెలిసింది. ఇదిలావుండగా రాజ మహల్‌లో కొనసాగుతున్న పాలిటెక్నిక్ కళాశాలను నూతన భవనంలోకి మార్చనున్నారు.

Advertisement
Advertisement