మరీ ఇంత దారుణమా? | Sakshi
Sakshi News home page

మరీ ఇంత దారుణమా?

Published Wed, Nov 25 2015 8:38 AM

మరీ ఇంత దారుణమా? - Sakshi

♦ ఫలితాలతో షాక్ తిన్న కాంగ్రెస్
♦ గత ఎన్నికల కన్నా ఓట్లు తగ్గిపోవడంపై ఆందోళన
♦ మీడియాకు దూరంగా పార్టీ ముఖ్యులు

 
 సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేశాయి. గత సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోవడానికి, పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపడానికి ఈ ఉప ఎన్నిక తోడ్పడుతుందని కాంగ్రెస్ భావించింది. అయితే ఎన్నిక ఫలితాలు ఆ పార్టీ మనోస్థైర్యాన్ని మరింత దెబ్బకొట్టాయి. 2014 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు లక్షకుపైగా ఓట్లు తగ్గాయి. దీనిపై టీపీసీసీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన ఫలితాలను ఊహించలేకపోయామని, ఇది తమను షాక్‌కు గురి చేసిందని టీపీసీసీ, సీఎల్పీ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో సుమారు 2.7% టీఆర్‌ఎస్ వైపు మళ్లినట్టు ఎన్నికల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

 ఎందుకిలా జరిగింది?: గత ఎన్నికల్లో వరంగల్‌లో 3.95 లక్షల మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలిస్తే.. ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి 4.59 లక్షల మెజారిటీ వచ్చింది. ఇది కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. టీఆర్‌ఎస్, సీఎంపై చాలా అంశాల్లో వ్యతిరేకత ఉన్నందున లక్ష, లక్షన్నర మెజారిటీతో ఆ పార్టీ గెలుస్తుందని టీపీసీసీ నేతలు అంచనా వేశారు. కానీ రాష్ట్రంలోనే రికార్డుస్థాయి మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలవడం, తమ బలం కూడా భారీగా తగ్గిపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

 ఏం చెబుదాం..?: వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలపై అధికారికంగా మాట్లాడకుండా టీపీసీసీ, సీఎల్పీ ముఖ్యులు మీడియాకు దూరంగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా దూకుడును ఎక్కువగా చూపించామా, టీఆర్‌ఎస్ వేగాన్ని అందుకోలేకపోతున్నామా అని వారు మథనపడుతున్నారు. తక్కువ మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలిస్తే పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ విశ్వాసం కల్పించేలా మాట్లాడే అవకాశం ఉండేదని వారంటున్నారు. రెండు, మూడ్రోజుల తర్వాత టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ఉప ఎన్నిక ఫలితాలపై సమీక్షించాలని యోచిస్తున్నారు.

Advertisement
Advertisement