ఇన్ఫోసిస్ అంచనాలు మిస్ | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ అంచనాలు మిస్

Published Sat, Apr 25 2015 1:31 AM

ఇన్ఫోసిస్ అంచనాలు మిస్

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్... అంచనాలు తప్పింది. మిగతా ఐటీ దిగ్గజాల మాదిరిగానే నిరాశాజనకమైన ఫలితాలను ప్రకటించింది. అయితే, బోనస్ షేర్ల ప్రకటన ద్వారా ఇన్వెస్టర్లను మాత్రం ఆశ్చర్యపరిచింది. ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర ఒకే రోజు 6 శాతం దిగజారింది.
క్యూ4లో నికర లాభం రూ.3,097 కోట్లు; 3.5% వృద్ధి
సీక్వెన్షియల్‌గా 4.7 శాతం డౌన్...
ఇన్వెస్టర్లకు 1:1 బోనస్ షేర్లు...

షేరుకి రూ.29.5 డివిడెండ్ ప్రకటన...
6 శాతం కుప్పకూలిన షేరు ధర...

బెంగళూరు: ఇన్ఫోసిస్ మార్చి క్వార్టర్ (2014-15, క్యూ4)లో రూ.3,097 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,992 కోట్లతో పోలిస్తే లాభం 3.5 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం విషయానికొస్తే.. రూ.12,875 కోట్ల నుంచి రూ.13,411 కోట్లకు చేరింది. 4.2 శాతం వృద్ది నమోదైంది. మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ4లో రూ.3,161 కోట్ల నికర లాభం, రూ.13,818 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. ప్రైసింగ్ ఒత్తిడి, కరెన్సీ సంబంధ ఒడిదుడుకులు, ఇతరత్రా అంశాలు కంపెనీ పనితీరుపై ప్రభావం చూపాయి.
 
సీక్వెన్షియల్‌గా డౌన్...

క్రితం ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం 4.7 శాతం దిగజారింది. క్యూ3లో లాభం రూ. 3,250 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం 2.8%(క్యూ3లో రూ.13,796 కోట్లు) క్షీణించింది.
 
గెడైన్స్ ఇలా...
ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీ విలువ ప్రకారం కంపెనీ ఆదాయాల్లో 10-12 శాతం వృద్ధి(గెడైన్స్) ఉండొచ్చని కంపెనీ ప్రకటించింది. ఇక రూపాయల్లో ఆదాయ వృద్ధి 8.4-10.4 శాతంగా, డాలర్ల ప్రాతిపదికన 6.2-8.2 శాతంగా అంచనా వేసింది. పరిశీలకులు గెడైన్స్ 9-11 శాతం మేర ఉండొచ్చని అంచనా వేశారు. దీనికన్నా ఇన్ఫీ గెడైన్స్ ఎక్కువే అయినా... ఐటీ పరిశ్రమ చాంబర్ నాస్కామ్... ఈ ఏడాది సాఫ్ట్‌వేర్ సేవల ఆదాయాల్లో వృద్ధి 12-14% ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో పోలిస్తే ఇన్ఫీ గెడైన్స్ తక్కువగానే ఉంది.
 
పూర్తి ఏడాదికి చూస్తే...
2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.12,329 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.10,648 కోట్లతో పోలిస్తే 15.8 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 6.4 శాతం వృద్ధితో రూ.50,133 కోట్ల నుంచి రూ.53,319 కోట్లకు ఎగబాకింది.
 
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
రూ. 5 ముఖవిలువగల ఒక్కో షేరుపై రూ.29.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది (1:1 బోనస్ ఇష్యూను పరిగణనలోకి తీసుకుంటే షేరుకి రూ.14.75 చొప్పున).
క్యూ4లో కొత్తగా 52 క్లయింట్లను కంపెనీ జత చేసుకుంది.
ఈ ఏడాది మార్చినాటికి ఇన్ఫీ వద్ద నగదు, తత్సంబంధ నిల్వలు రూ.32,585 కోట్లకు చేరాయి. 2014 మార్చి నాటికి ఈ మొత్తం రూ.30,251 కోట్లు కాగా, డిసెంబర్ చివరికి రూ.34,873 కోట్లు.
క్యూ4లో 6.549 మంది ఉద్యోగులను కంపెనీ నికరంగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య మార్చినాటికి 1,76,187కు చేరింది. ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు క్యూ3లో 20.6 శాతం కాగా, క్యూ4లో 18.9 శాతానికి తగ్గింది.
 
నిరుత్సాహకరమైన ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర భారీగా పడిపోయింది. శుక్రవారం బీఎస్‌ఈలో ఒకానొక దశలో 6.5 శాతం మేర దిగజారి రూ.1,982 కనిష్టస్థాయిని తాకింది. చివరకు 5.95 శాతం నష్టపోయి రూ.1,996 వద్ద స్థిరపడింది.

 
బోనస్ బొనాంజా...
ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసం పెంచడంపై ఇన్ఫోసిస్ దృష్టిపెట్టింది. దీనిలో భాగంగానే ప్రతి ఒక్క షేరుకి మరో షేరును(1:1 నిష్పత్తిలో) బోనస్‌గా ఇవ్వాలని బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన అమెరికన్ డిపాజిటరీ షేర్(ఏడీఎస్)లకు కూడా ఇదే నిష్పత్తిలో బోనస్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. వాటాదారుల ఆమోదానికి లోబడి ఈ ప్రతిపాదన అమలవుతుందని వెల్లడించింది. కాగా, కంపెనీ కొత్త సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టాక ఇది రెండో బోనస్ ఇష్యూ కావడం విశేషం.గతేడాది అక్టోబర్‌లో(క్యూ2 ఫలితాల సందర్భంగా) ఇన్ఫీ 1:1 నిష్పత్తిలోనే బోనస్‌ను ప్రకటించింది.
 
‘కలిడస్’ కొనుగోలు...

అమెరికాకు చెందిన డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సొల్యూషన్స్ కంపెనీ ‘కలిడస్’ను కొనుగోలు చేస్తున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. ఈ డీల్ విలువ 12 కోట్ల డాలర్లు(దాదాపు రూ.750 కోట్లు). దీంతోపాటు  ఎయిర్‌విజ్‌లో మైనారిటీ వాటా కోనుగోలు కోసం 2 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందానికి కూడా బోర్డు ఓకే చెప్పినట్లు కంపెనీ వెల్లడించింది. ఫినాకిల్, ఎడ్జ్‌సర్వీసెస్ వ్యాపారాలను సబ్సిడరీ సంస్థ ఎడ్జ్‌వెర్వ్ సిస్టమ్స్‌కు బదలాయించే ప్రతిపాదనకు సైతం ఆమోదముద్ర పడింది.
 
ఐటీ పరిశ్రమఫండమెంటల్‌గా, నిర్మాణాత్మకమైన మార్పులను సంతరించుకుంటోంది. గడిచిన త్రైమాసికంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. మేం కొత్తగా అనుసరిస్తున్న ‘రెన్యూ-న్యూ’ వ్యూహంలో ఆరంభ విజయాలను ఆస్వాదిస్తున్నాం. 2017కల్లా దేశీ ఐటీ పరిశ్రమ సగటు వృద్ధి రేటును అందుకోగలమన్న విశ్వాసం ఉంది.
- విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ

Advertisement
Advertisement