తీవ్ర హెచ్చుతగ్గులు... | Sakshi
Sakshi News home page

తీవ్ర హెచ్చుతగ్గులు...

Published Sat, May 20 2017 1:24 AM

తీవ్ర హెచ్చుతగ్గులు...

► ప్రారంభంలో సెన్సెక్స్‌ కొత్త రికార్డు
► చివరకు ఫ్లాట్‌గా ముగింపు
► వెలుగులో ఎఫ్‌ఎంసీజీ షేర్లు


ముంబై:  ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా గురువారం క్షీణించిన భారత్‌ మార్కెట్‌....జీఎస్‌టీ రేట్ల ఖరారుతో శుక్రవారం భారీ గ్యాప్‌అప్‌తో మొదలై, రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. పలు ఉత్పత్తులకు జీఎస్‌టీ కౌన్సిల్‌ పన్ను రేట్లను నిర్ణయించిన ప్రభావంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా గ్యాప్‌అప్‌తో మొదలై 30,712 పాయింట్ల కొత్త రికార్డును నెలకొల్పింది.

అయితే అటు తర్వాత ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్‌ షేర్లలో అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారిపోయి, 30,338 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అటుతర్వాత బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ప్రకటించిన ప్రోత్సాహకర ఫలితాల ప్రభావంతో తిరిగి లాభాల్లోకి ప్రవేశించి, చివరకు 30 పాయింట్ల లాభంతో 30,465 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ప్రారంభంలో 9,506 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగి, అక్కడ్నుంచి 100 పాయింట్లకుపైగా క్షీణించి 9,390 పాయింట్ల వద్దకు పడిపోయింది. అటుతర్వాత కోలుకుని 9,428 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 1.5 పాయింట్ల మేర స్వల్పంగా  నష్టపోయింది.

ఐటీసీ జూమ్‌...
జీఎస్‌టీ రేట్ల ఖరారుతో ఎఫ్‌ఎంసీజీ షేర్లు జోరుగా పెరిగాయి. కొత్త రేట్ల ప్రకారం హెయిర్‌ ఆయిల్, టూత్‌పేస్టులు, సబ్బులు ధరలు తగ్గుతాయని, తద్వారా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అమ్మకాల్ని పెంచుకోగలుగుతాయన్న అంచనాలతో ఈ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీసీ ఒకదశలో 6 శాతం మేర ర్యాలీ జరిపి కొత్త చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ. 393 స్థాయికి చేరింది.

అటుతర్వాత లాభాల స్వీకరణ జరగడంతో గరిష్టస్థాయి నుంచి తగ్గి, చివరకు 3.5 శాతం లాభంతో రూ. 386 వద్ద క్లోజయ్యింది. మరో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనీలీవర్‌ కూడా రూ. 1,018 కొత్త రికార్డుస్థాయికి పెరిగి, చివరకు 1 శాతంపైగా లాభంతో రూ. 1,008 వద్ద క్లోజయ్యింది. బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌లు 2 శాతం మేర ర్యాలీ జరిపాయి. టాటా మోటార్స్, ఎన్‌టీపీసీలు 1 శాతం వరకూ పెరిగాయి. తగ్గిన షేర్లలో మారుతి, ఐషర్‌ మోటార్స్, టీసీఎస్, టెక్‌ మహింద్రా, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌లు ఉన్నాయి. ఇవి 1–2 శాతం మధ్య క్షీణించాయి.  

డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లోకి కొత్తగా ఐదు షేర్లు
న్యూఢిల్లీ: బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఈక్విటీ డెరివేటివ్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ఐదు కంపెనీలకు సంబంధించి ఫ్యూచర్, ఆప్షన్లను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించాయి. వీటిలో ఆర్‌బీఎల్‌ బ్యాంకు, నాల్కో, హిందుస్థాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, కజారియా సిరామిక్స్, రామ్కో సిమెంట్స్‌ ఉన్నాయి. ఈ నెల 26 నుంచి ఈ కంపెనీల్లో ఫ్యూచర్, ఆప్షన్‌ కాంట్రాక్టులు అందుబాటులో ఉంటాయి. ఈ ఐదు కంపెనీల్లో ఫ్యూచర్, ఆప్షన్‌ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించిన మరుసటి రోజే బీఎస్‌ఈ కూడా అదే నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement