అన్నీ.. అప్పుల కుప్పలే! | Sakshi
Sakshi News home page

అన్నీ.. అప్పుల కుప్పలే!

Published Wed, Jul 1 2015 1:37 AM

అన్నీ.. అప్పుల కుప్పలే! - Sakshi

సాక్షి, బిజినెస్ విభాగం
అప్పుల కుప్పలా మారిన గ్రీస్ ఎప్పుడు దివాలా తీస్తుందోనని ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. నిజానికి మరికొన్ని యూరోపియన్ దేశాలు అప్పుల్లో గ్రీస్‌తో పోటీ పడుతున్నాయి. ఆ అప్పులు వాటి జీడీపీతో పోలిస్తే చాలా ఎక్కువ.
 
మాస్ట్రిచ్ ఒప్పందం ప్రకారం ఒక దేశం అప్పులు దాని జీడీపీలో 60 శాతం వరకూ ఉండొచ్చు. కానీ గ్రీస్ అప్పులు దాని జీడీపీతో పోలిస్తే 180 శాతంగా ఉన్నాయి. 132 శాతంతో ఇటలీ, 130 శాతంతో పోర్చుగల్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈయూలో తక్కువ రుణాలున్న దేశాలను తీసుకుంటే ఎస్తోనియా, నార్వే, బల్గేరియా ముందు వరసలో ఉన్నాయి. వీటి అప్పులు జీడీపీలో 30 శాతానికి మించిలేవు.
 
యూరప్ మొత్తం ఇలా అప్పులు పెరుగుతుండటాన్ని చూస్తే తెలిసేదొక్కటే. ప్రభుత్వాలు తమ వ్యయాన్ని నియంత్రించటంలో విఫలమవుతున్నాయని. తక్కువ అప్పులున్న దేశాలు కూడా ఈ మధ్య విపరీతంగా రుణాలు తీసుకోవటం గమనార్హం. 2012-14 మధ్య చూస్తే నార్వే మాత్రమే జీడీపీలో 17.9 శాతంగా ఉన్న రుణాన్ని 11 శాతానికి తగ్గించుకోగలిగింది. కానీ తక్కువ అప్పున్న ఎస్తోనియా, బల్గేరియాల రుణం ఇదే కాలంలో ఏకంగా 80 శాతం వరకూ పెరిగింది.
 
గ్రీసు రుణం... ఎవరికెంత?
ఈ లెక్కన చూస్తే (ఐఎంఎఫ్ నుంచి రావాల్సినవి మినహాయించి) మొత్తం గ్రీసు రుణం దాదాపు 390 బిలియన్ యూరోలు. ఒక యూరో దాదాపు 1.12 అమెరికన్ డాలర్లు. ఈ లెక్కన దాదాపు 436 బిలియన్ డాలర్లు. అంటే జీడీపీ 242 బిలియన్ డాలర్లతో పోలిస్తే దాదాపు 180 శాతమన్న మాట.

యూరో జోన్: దీన్లోని వివిధ దేశాలకు దాదాపు 242 బిలియన్ యూరోలు గ్రీస్ బకాయి పడింది. ఈ రుణాలిచ్చిన దేశాల్లో జర్మనీయే అతిపెద్ద రుణదాత. జర్మనీ అత్యధికంగా 57.23, ఫ్రాన్స్ 42.98, ఇటలీ 37.76, స్పెయిన్ 25.1 బిలియన్ యూరోల చొప్పున రుణాలిచ్చాయి. ఇవన్నీ ఐఎంఎఫ్ రుణాలకు తమ వాటాగా ఇచ్చిన దానికి అదనం. దీన్లో 2010, 2012లో బెయిలవుట్ కోసం ఇచ్చిన ప్యాకేజీలు కూడా కలిసే ఉన్నాయి.

గ్రీసు బాండ్లు: దాదాపు 38.7 బిలియన్ యూరోల గ్రీస్ బాండ్లను ప్రయివేటు ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు.
ట్రెజరీ బిల్లులు: గ్రీస్ తన బ్యాంకులకు 15 బిలియన్ యూరోల మేర స్వల్పకాలిక ట్రెజరీ బిల్లుల్ని జారీ చేసింది.
ఐఎంఎఫ్: 48.1 బిలియన్ యూరోల రుణమిచ్చింది. దీన్లో ఇంకా 16.3 బిలియన్లు విడుదల కావాల్సి ఉంది.
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్: 18 బిలియన్ యూరోల మేర గ్రీసు ప్రభుత్వం జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేసింది. దీన్లో 6.7 బిలియన్ యూరోలు ఈ జూలై, ఆగస్టు నెలల్లో మెచ్యూర్ అవుతాయి. గ్రీసు -
కనక యూరోజోన్ నుంచి బయటకు వెళితే ఈ బాండ్లకు విలువే ఉండదు.
బ్యాంకు నోట్లు: ఈ రూపంలో గ్రీసు మరో 45 బిలియన్ యూరోలు రుణపడి ఉంది.
ఇవి కాక గ్రీసు బ్యాంకులు లిక్విడిటీ కోసం, అత్యవసర నిధుల నిమిత్తం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి దాదాపు 118 బిలియన్ యూరోలు రుణంగా తీసుకున్నాయి. దీన్ని గ్రీసు ప్రభుత్వ రుణంగా పేర్కొనలేం. తీర్చాల్సిన బాధ్యత గ్రీస్ సెంట్రల్ బ్యాంక్‌దే కానీ... గ్రీసు యూరోలో ఉంటేనే. ఒకవేళ వైదొలిగితే ఆ బాధ్యత జర్మనీ సహా ఇతర యూరో దేశాలపై పడుతుంది.

Advertisement
Advertisement