ఎందుకింత అధ్వానం? | Sakshi
Sakshi News home page

ఎందుకింత అధ్వానం?

Published Thu, Mar 26 2015 2:38 AM

Why worse?

రిమ్స్( కడప అర్బన్) : పీజీ హాస్టల్‌లో సౌకర్యాలు ఇంత అధ్వానమా? కడప నగరంలో ఇటీవల యాచకులు, అనాథలు రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన నైట్ షెల్టర్లే వీటి కంటే ఎన్నో రెట్లు మేలుగా ఉన్నాయని రిమ్స్ డెరైక్టర్‌ను జిల్లా కలెక్టర్ కేవీ రమణ ప్రశ్నించారు. బుధవారం కడప రిమ్స్‌లో కలెక్టర్ పర్యటించారు. మొదట రేడియాలజీ విభాగంలో ఆధునీకరణ గదులను ప్రారంభించాల్సి ఉండగా ఆ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది.
 
దీంతో ఆయన రిమ్స్ డెరైక్టర్ డాక్డర్ సిద్ధప్ప గౌరవ్ ఛాంబర్‌లో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయనకు రిమ్స్‌లో పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు తమ సమస్యలను విన్న వించారు. వారి స్టైఫండ్ సమస్యను వివరిస్తే వారంలోపు పరిష్కరించాలని డెరైక్టర్‌కు సూచించారు. హౌస్ సర్జన్లు తమ హాస్టళ్లలోని సమస్యలను వివరించారు. వెంటనే కలెక్టర్ హాస్టల్‌ను సందర్శించారు. బాత్‌రూంలు, గదుల్లోని సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రతపై స్వయంగా పరిశీలించారు.

హాస్టల్ గదులన్నీ అపరిశుభ్రంగా ఉండటం, డ్రైనేజీ పైపులను శుభ్రం చేయకపోవడం, హాస్టల్ వెనుక భాగాన కంపచెట్లు, ఇతర చెట్లు గుంపుగా ఉండటం వలన పాములు సంచరిస్తున్నాయని, అనేకమార్లు వార్డెన్లకు, డెరైక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదనీ హౌస్ సర్జన్లు కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ కేవీ రమణ రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్ధప్ప గౌరవ్‌తో మాట్లాడుతూ హౌస్ సర్జన్ల, పీజీ హాస్టల్ ఇంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయా అని ప్రశ్నించారు. సౌకర్యాలపై వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలన్నారు.
 
ముగ్గురు ఉద్యోగులకు ఛార్జ్ మెమోలు :
రిమ్స్ ఆసుపత్రి విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల లో ఓ సీనియర్ అసిస్టెంట్, ఏఓ, సూపరింటెండెంట్ పనితీరును జిల్లా కలెక్టర్ తప్పు పట్టారు. వారు భవిష్యత్తులో కూడా ఇలానే వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రిమ్స్ కళాశాల రికార్డులను పరిశీలించగా సరిగా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి కావడంతో ఛార్జ్ మెమోలతో సరిపెట్టారు. రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గిరిధర్,  సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమోహన్, ఆర్‌ఎంఓ డాక్టర్ కొండయ్య, ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు, పాల్గొన్నారు.
 
కలెక్టర్ వస్తున్నారని..
కడప అర్బన్ : కడప రిమ్స్‌కు కలెక్టర్ వస్తున్నారని ఫిజియోథెరఫి విభాగం వారు నానా హడావుడి చేశారు. అప్పటికప్పుడు ఓపీ విభాగంలోని ఫిజియో థెరఫీ విభాగం తలుపునకు కర్టెన్లు వేయడం, పరిశుభ్రం చేయడం, పరికరాలు అమర్చుకోవడం లాంటివి చేశారు. కలెక్టర్ రిమ్స్‌కు వచ్చినప్పటికీ ఫిజియోథెరఫీ విభాగానికి వెళ్లకపోవడంతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
 
సిబ్బంది కరువై..
కడప రిమ్స్‌లో ఉద్యోగులు ఎంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారో ఈ దృశ్యాన్ని చూస్తే తెలుస్తోంది. ఐపీ విభాగం వార్డు నుంచి ఓపీకి రోగిని స్ట్రెచర్‌పై తామే తీసుకొచ్చి మరలా తీసుకు వెళ్లాల్సిన ఉద్యోగులు ఆ బాధ్యతను విస్మరించడంతో రోగి బంధువులే ఇలా తీసుకెళ్లాల్సి వచ్చింది.

Advertisement
Advertisement