జీజీహెచ్‌లో నిరసన గళం | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో నిరసన గళం

Published Fri, Sep 4 2015 4:40 AM

జీజీహెచ్‌లో నిరసన గళం

- అరెస్టుల ప్రచారంతో ఆందోళనలు
- రోగుల వైద్యసేవలపై తీవ్ర ప్రభావం
- అయోమయంలో రోగులు
గుంటూరు మెడికల్ :
నిత్యం అంబులెన్స్‌ల మోత, రోగులు, వారి సహాయకుల రాకపోకలతో హడావుడిగా ఉండే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి.. ప్రస్తుతం సమ్మె, నిరసన గళాల హోరుతో మార్మోగుతోంది.  డాక్టర్లు, సిబ్బంది  నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై, ప్రతిరోజూ గంటసేపు నిరసన తెలుపుతున్నారు.  జీజీహెచ్‌లో  ఎలుకలదాడిలో పసికందు మృతిపై ప్రభుత్వం ఆస్పత్రి సిబ్బందిపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలను నిరసిస్తూ గత నెల 29నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం, ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం  నిరసనలను ఉధృతం చేస్తున్నాయి.  

కేవలం గుంటూరుకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనా ఆస్పత్రుల్లో సైతం ప్రారంభమయ్యాయి. నర్సుల సంఘం రాష్ట్ర నేతలు గుంటూరు జీజీెహ చ్‌కు వచ్చి మద్దతు తెలిపారు. వైద్యుల సంఘం సెంట్రల్ కమిటీ నేతలు  గురువారం జీజీహెచ్‌కు వచ్చి తమ మద్దతు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమశిక్షణ చర్యలను సహించబోమని, ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సంఘాల నేతలు పట్టుపడుతున్నారు. ఆస్పత్రిలో ఎలుకలు ఉన్నాయని పలుమార్లు లిఖితపూర్వకంగా చెప్పినా పట్టించుకోకుండా నేడు తమను బాధ్యలుగా చేయడం అన్యాయమని  స్పష్టం చేస్తున్నారు.
 
అరెస్టులు జరుగుతాయంటూ ప్రచారం..
జీజీహెచ్‌లో ఎలుకల దాడి సంఘటనలో పసికందు మృతిచెందడంపై చిన్నారి తల్లి చావలి లక్ష్మి కొత్తపేట ఠాణాలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. విచారణ చేస్తున్న సమయంలోనే మూడు రోజులుగా పసికందు మృతిపై ఆస్పత్రి సిబ్బందిని అరెస్టు చేస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  ఈ సంఘటనతో వెద్యులు, వైద్య సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. అయోమయంలో రోగులు.. గత నెల 26న ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిన నాటినుంచి ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై రోగులు అయోమయానికి గురవుతున్నారు.

పలుమార్లు కలెక్టర్ ఆస్పత్రిలో తనిఖీలకు వస్తూ ఉండడం, రెండు పర్యాయాలు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆస్పత్రిలో తనిఖీలు చేయడం,  వీరితోపాటుగా ఎస్పీలు, ఎంపీ గల్లా జయదేవ్, పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు ఆస్పత్రిలో నిరసనలు తెలియజేస్తూ ఉండడంతో ఆస్పత్రిలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వైద్యులు, వైద్య సిబ్బంది నిరసనల ప్రభావం రోగుల వైద్యసేవలపై కనిపిస్తోంది. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించి ఎలాంటి అవరోధాలు లేకుండా రోగులకు వైద్యసేవలను అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
 
అరెస్ట్‌ల నుంచి కాపాడాలని కలెక్టర్‌కు వినతి...
జీజీహెచ్‌లో గురువారం నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం వైద్యులు, నర్సులు ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఆస్పత్రిలో పసికందు చనిపోయినప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో నేడు కూడా అవే పరిస్థితులు ఉన్నాయని, సమస్యలు పరిష్కరించకుండా రోగులను అడ్మిట్ చేసుకుంటే రోగులకు వైద్యసిబ్బందికి రిస్క్ ఉంటుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేకపోయినా అరెస్టులు చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని, అరెస్టుల నుంచి తమను కాపాడాలని నాయకులు  లిఖితపూర్వకంగా కోరారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్‌లో సమస్యలను పరిష్కరిస్తానని, వైద్య సిబ్బంది ఎలాంటి భయాందోళనలు లేకుండా వైద్యసేవలు అందించాలన్నారు.

Advertisement
Advertisement