పులసొచ్చింది.. రుచుల పండుగ తెచ్చింది! | Sakshi
Sakshi News home page

పులసొచ్చింది.. రుచుల పండుగ తెచ్చింది!

Published Sun, Jul 23 2017 3:58 AM

పులసొచ్చింది.. రుచుల పండుగ తెచ్చింది!

పులస పులుసు.. ఆ పేరు వింటే చాలు ఉభయ గోదావరి జిల్లావాసులకు నోరూరిపోవాల్సిందే. దాన్ని రుచిచూసిందాకా జిహ్వ మారాం మానదు. పిడకల పొయ్యిపై మట్టి మూకిడిలో సన్నకాకపై వండుతూ.. ఉప్పుకారం తగినంత దట్టించి.. కాసింత ఆవకాయ నూనె తగిలించి.. అరటి ఆకుపై వడ్డించుకుతింటుంటే ఉంటుంది నా సామిరంగా.. అబ్బ ఏం రుచిరాబాబు.. అంటూ లొట్టలేసుకు తినాల్సిందే. అంతటి అమోఘమైన రుచి పులస చేపది. అందుకే పుస్తెలమ్ముకోనైనా పులస తినాలంటారు గోదావరి జిల్లావాసులు.

సాక్షి, అమరావతి : గోదావరి తీరానికి పులసల సీజన్‌ వచ్చేసింది. వరద (ఎర్ర నీరు) నీరు రావడంతో పులసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదుతూ వచ్చేస్తున్నాయి. దాదాపు అన్ని సముద్రాల్లోనూ ఉండే ఈ చేప రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో పులస చేపగా ప్రసిద్ధి.

పుస్తెలమ్ముకునైనా పులస తినాలనేది గోదావరి జిల్లాల్లో నానుడి. ఏడాదిలో కేవలం జూలై నుంచి సెప్టెంబర్‌ వరకే పులస లభిస్తుంది. ఎర్రమట్టి తినడం కోసం, సంతానోత్పత్తి కోసం పులస ఈ మూడు నెలల కాలంలో ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రవహించే గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ తదితర నదుల్లోకి వస్తుంది.

సముద్రంలో  ఉన్నప్పుడు విలస!
సముద్రంలో ఉన్నప్పుడు విలసగా పిలిచే ఈ చేపకు గోదావరిలోకి వచ్చాక స్థానికులు ముద్దుగా పులస అనే పేరు పెట్టుకున్నారు. గోదావరి నదీపాయల్లో ప్రవహించే మట్టితో కూడిన వరదనీటిని తాగడం వల్లే పులసకు అంత రుచి వచ్చిందని చెబుతున్నారు. సముద్రం నుంచి ఈదుకుంటూ రాజమహేంద్రవరం సమీపాన ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వచ్చేసరికి పులస ముదిరిపోతుంది. సముద్ర మొగ (ముఖద్వారం)లో లభించే చేప కంటే ధవళేశ్వరం, ఆత్రేయపురం, వద్దిపర్రు, బొబ్బర్లంక, సిద్దాంతం ప్రాంతాలకు వచ్చేసరికి దాని రుచి బాగుంటుంది.

అలా వండితే నా సామిరంగా..
రంపపు పొట్టు లేదా, పిడకల పొయ్యిపై వెడల్పు కలిగిన మట్టి మూకిడిలో సన్నని కాకపై వండాలి. కొత్త ఆవకాయ నూనె, ఆముదం, బెండకాయలు, పెద్ద సైజు పచ్చిమిరపకాయలు వేసి వండితే ఎవరైనా పులస పులుసు లొట్టలేసుకుని తినాల్సిందే. వండిన రోజు కాకుండా తర్వాత రోజు తింటే ఆ టేస్టే వేరట. అరటి ఆకుపై పులస పులుసుతో భోజనం తింటుంటే ఆ రుచి రెట్టింపవుతుందని చెబుతున్నారు స్థానికులు.  

చుక్కల్లో ధరలు
పులసకున్న డిమాండ్‌తో దాని ధర సామాన్యులనే కాదు ఒక మోస్తరు సంపన్నులకు కూడా చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో కేజీ పులస రూ.3000 నుంచి రూ.5000 పలుకుతోంది. పులస పులుసుకున్న డిమాండు నేపథ్యంలో యానాంకు చెందిన కొప్పిశెట్టి రమణ, రాజు ఆన్‌లైన్‌లో పులస పులుసు డోర్‌ డెలివరీ కోసం పులసఫిష్‌.కామ్‌
నడుపుతున్నారు.

పొలుసుపై ఎర్రజార ఉంటేనే ఒరిజినల్‌
డూప్లికేట్‌ పులసలు మార్కెట్‌కు వస్తున్నాయి. గోదావరి పులస పోలికలతో ఉండే చేపలను ఒడిస్సా నుంచి తెచ్చి విక్రయిస్తున్నారు. గోదావరి పులసల పొలుసుపై ఎర్రజార ఉందో లేదో చూసుకుని కొనుక్కోవాలని మత్స్యకారులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement