‘వెబ్’ దడ! | Sakshi
Sakshi News home page

‘వెబ్’ దడ!

Published Thu, Aug 28 2014 2:05 AM

‘వెబ్’ దడ! - Sakshi

చిలకలూరిపేట రూరల్: అన్నదాతల కష్టాలకు అంతుండటం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వారి వెతలను మరింత ఎక్కువ చేస్తోంది. రైతులకు చెందిన సాగుభూముల వివరాలను నమోదు చేసేందుకు రూపొందించిన ‘వెబ్‌ల్యాండ్’ సైట్ నిర్వహణ దారుణంగా ఉండటంతో రైతన్నలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ వర్తింపునకు భూమి యూజమాన్య పత్రాల నకళ్లు సమర్పించాలని బ్యాంకులు డిమాండ్ చేస్తుండటం, ఆన్‌లైన్‌లో ఆ పత్రాల జారీ నిలిచిపోవటం ఇందుకు కారణం.
 
రెండేళ్లుగా సాగుతున్న ప్రహసనం
వెబ్‌ల్యాండ్ సైట్‌లో సాగు భూములు, వాటి యజమానుల వివరాల నమోదు ప్రక్రియ రెండేళ్లుగా సాగుతోంది. అరుునా ఇప్పటికీ చాలా భూములు, యజమానుల వివరాలు నమోదు కాలేదు. రుణమాఫీ వర్తింపునకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేయటంతో అడంగల్, పట్టాదార్ పాస్ పుస్తకం, వన్-బి రిజిస్టర్ పత్రాల కోసం రైతులు మీ-సేవ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయూలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
 
రుణ మాఫీకి బ్యాంకర్ల మెలిక
రుణ మాఫీ ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయటంతో బ్యాంకుల అధికారులు వివిధ రకాల పత్రాల నకళ్లను సమర్పించాలని రైతులను ఆదేశిస్తున్నారు. కొన్ని బ్యాంక్ శాఖలు కేవలం ఆధార్ కార్డు నకలు, ఫోన్ నంబర్లు తీసుకుంటుండగా మరికొన్ని బ్యాంక్ శాఖలు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, అడంగల్, వన్-బి రిజిస్టర్ నకళ్లు ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారుు. కొన్ని బ్యాంకులు రేషన్ కార్డు నకలు కూడా అడుగుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఈ నెల 29వ తేదీలోగా వీటిని సమర్పించాలని కొన్ని బ్యాంకుల శాఖలు గడువు విధించటంతో రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
 
పనిచేయని వెబ్‌సైట్
వారం రోజులుగా వెబ్‌ల్యాండ్ ఆన్‌లైన్ సైట్ ఓపెన్ కావటం లేదు. దీంతో మీ సేవ కేంద్రాల్లో ఆయూ పత్రాల నకళ్లు జారీ కావటం లేదు. మరోవైపు భూములు, రైతుల వివరాలను రెవెన్యూ సిబ్బంది నమోదు చేయలేకపోతున్నారు. రెండేళ్లరుునా తమ వివరాలు ఎందుకు నమోదు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో పలువురు రైతులు చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయూనికి వచ్చి రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  
 
3న బ్యాంకర్ల సమావేశం
సమస్యపై జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ బి.ఎల్.ఎన్.శాస్త్రిని వివరణ కోరగా జిల్లాలో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను సెప్టెంబర్ 10వ తేదీలోగా అందించాలని ప్రభుత్వం కోరిందని చెప్పారు. రైతులు తమ భూమి యూజమాన్య పత్రాల నకళ్లు, ఆధార్  వివరాలు సమర్పిస్తే రుణ మాఫీకి అర్హత ఉన్నవారెవరో తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశంపై వచ్చే నెల 3న చిలకలూరిపేటలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
 
ఆన్‌లైన్ సమస్యే కారణం..
కొన్ని గ్రామాల్లో కొందరు రైతులకు చెందిన సాగుభూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదని, ఆన్‌లైన్ అనుసంధానం కాకపోవటంతో సమస్య తలెత్తిందని చిలకలూరిపేట తహశీల్దార్ జి.వి.ఎస్.ఫణీంద్రబాబు చెప్పారు. రైతులకు అవసరమైన పత్రాలను త్వరలో అందిస్తామన్నారు. రైతుల భూమి యూజమాన్య పత్రాలను చిలకలూరిపేటలోని బ్యాంకర్లు మాత్రమే కోరుతున్నారని చెప్పారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Advertisement
Advertisement