సామాన్యులపైనే | Sakshi
Sakshi News home page

సామాన్యులపైనే

Published Mon, Sep 22 2014 2:23 AM

సామాన్యులపైనే - Sakshi

 సామాన్యుల పట్ల చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్న విద్యుత్ శాఖాధికారులు బడా బాబుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వందల రూపాయల్లో విద్యుత్ బిల్లుల బకాయిలు ఉంటే కనెక్షన్ పీకేసి అవసరమైతే ఆర్‌ఆర్ యూక్ట్ ప్రయోగించే అధికారులు పెద్దల విషయంలో మాత్రం గుంభనంగా వ్యవహరిస్తూ విమర్శలకు గురవుతున్నారు.
 
 విజయనగరం మున్సిపాలిటీ: పట్టణంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్న కె.శ్రీనివాసరావుకు విద్యుత్ ఛార్జీల బిల్లు రూ.290 వచ్చింది. రిక్షా లాగుతూ జీవనం సాగించే ఆయన అధికారులు నిర్ధేశించిన సమయంలో బిల్లు చెల్లించకపోవటంతో సదరు సర్వీసుకు సంబంధించిన ఫీజులు పీకేశారు. ఇది సాధారణ, మధ్య తరగతి కుటుంబీకుల విషయంలో అధికారులు అవలంభించే సర్వసాధారణ విషయం. అయితే రూ.కోట్లలో బిల్లులు పేరుకుపోయిన బడా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ శాఖలపై  కనీస చర్యలు తీసుకోవటంలో అధికారులు తమ దూకుడు చూపించకపోవటం పలు ఆరోపణలకు తావిస్తోంది. ఇందుకు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో    పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలే తార్కాణంగా నిలుస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా రూ.61.92 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయూయి ఇందులో  హెచ్‌టీ విద్యుత్ సర్వీసుల నుంచి మొత్తం రూ.38.40 కోట్లు రావాల్సి ఉండగా..
 
 ఇందులో కేవలం 17  సర్వీసుల నుంచి రూ2.74 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న సర్వీసుల నుంచి రూ.29.45 కోట్లు రావాల్సి ఉంది.  వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.1.53 కోట్లు, నిలిపి వేసిన సర్వీసుల నుంచి వసూలు చేయాల్సింది రూ.4.13 కోట్లు, వివిధ రక్షిత మంచి నీటి పథకాలకు సంబంధించిన సర్వీసుల నుంచి రూ.0.55 కోట్లు  విద్యుత్ శాఖకు రావాల్సి ఉంది. ఎల్‌టీ విద్యుత్ సర్వీసులకు సంబంధించి  బకాయిల మొత్తం రూ.23.52 కోట్లు ఉండగా.. అందులో  నిలిపి వేసిన సర్వీసుల నుంచి వసూలు చేయాల్సిన మొత్తం రూ.4.11 కోట్లు  రావాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి రూ.1.76  కోట్లు, మేజర్ పంచాయతీల నుంచి రూ.4.54 కోట్లు, మైనర్ పంచాయతీల నుంచి రూ.13 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న సర్వీసుల నుంచి రూ.0.11 కోట్లు రావాల్సి ఉంది.  ఇంత పెద్ద మొత్తంలో వినియోగదారుల నుంచి బకాయిలు రావాల్సి ఉన్నా చూసీ చూడనట్లు వ్యవహరించే విద్యుత్ శాఖ అధికారులు సాధారణ , మధ్య తరగతి గృహ విద్యుత్ వినియోగదారులపై మాత్రం కొరడా ఝులిపిస్తుండటం పలు ఆరోపణలకు తావిస్తోంది.   
 
 నోటీసులకు స్పందన కరువు: తమ బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖాధికారులు ప్రభుత్వ శాఖలతో పాటు పెద్ద  మొత్తంలో బకాయిల పడ్డ వినియోగదారులుకు  నోటీసులు పంపిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. నోటీసులు మీద నోటీసులు వస్తున్నాయని ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి అనుమతి లేదంటూ లేకుంటే బడ్జెట్ లేదంటూనే ఆయా శాఖలు బకాయిలు చెల్లింపులకు చేతులు ఎత్తేస్తున్నాయి. జిల్లాలో వివిధ శాఖల నుంచి లక్షలాది రూపాయలు బిల్లుల రూపంలో రావాల్సి ఉన్నా విద్యుత్ శాఖ అధికారులు మాత్రం  ఉదాసీనంగా వ్యవహరించాల్సిన  పరిస్థితి తలెత్తింది. బడా బాబులకు సంబంధించిన సర్వీసుల నుంచి ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. సామాన్యుల విషయంలో నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించని విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. అప్పటికీ చెల్లించకపోతే  ఆర్‌ఆర్ యాక్ట్ ఉపయోగించి ఆస్తుల జప్తునకు సన్నద్ధమవుతున్నారు. సాధారణ వినియోగదారుని  బిల్లు బకాయిల విషయంలో ఒకలా... ప్రభుత్వ శాఖల బిల్లుల బకాయిల వసూళ్ల విషయంలో మరోలా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

 

Advertisement
Advertisement