'రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోంది' | Sakshi
Sakshi News home page

'రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోంది'

Published Sun, Apr 26 2015 12:18 PM

'రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోంది' - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలోని ప్రజలు కరువు పరిస్థితులు తట్టుకోలేక వలసలు పోతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితి రావటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని అన్నారు. ఈ దుర్భర పరిస్థితుల్ని భరించలేని ప్రజలు రాష్ట్రం నుంచి వలసలు పోతున్నారని చెప్పారు.

'మద్దతు ధర అందక అన్నదాతలు రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 25 శాతమే ధాన్యం సేకరణ జరుగుతోంది.
పత్తికి కూడా కనీస మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ హామీ.. ఎన్నికలకే పరిమితమైంది. ఓ పక్క కరువు. మరో పక్క మద్దతు ధర లేదు. ఇన్ని బాధలుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. పంటల నష్టంపై అంచనాలు వేయడం లేదు. కేంద్రానికి నివేదికలు సరిగా పంపడం లేదు' అని మైసూరా రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

'వచ్చే నెల 4, 5 తేదీల్లో ఈ సమస్యలపై మండల స్థాయి అధికారులకు విజ్ఞాపనా పత్రాలు అందజేస్తాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ప్రత్యేక హోదాపై వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలి. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదాని నీరుగారుస్తోంది' అంటూ మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement