ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

Published Sat, Jul 4 2015 4:17 AM

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం - Sakshi

- స్ట్రాగ్‌రూమ్‌కు బ్యాలెట్ పేపర్లు
- 76.10 శాతం పోలింగ్
- ఏడున కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మూడు డివిజన్లలో మొత్తం 992 మందికిగాను 755 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76.10 శాతంగా నమోదైంది. ఈ ఎన్నికల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎన్నిక ఏకపక్షంగా జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులెవ్వరూ పోలింగ్ జరిగేచోటికి రాలేదు. తెలుగుదేశం నాయకులు తమ ఓటర్లను క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లు వేయించారు.  

మొత్తం 319 మంది పురుష ఓటర్లు, 436 మంది మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటర్లకు జారీ చేసిన గుర్తింపు కార్డుల విషయంలో పలు పొరపాట్లు దొర్లాయి. గుర్తింపు కార్డుల్లో ఉన్న సీరియల్ నెంబర్లకు ఓటర్ల జాబితాలో ఉన్న నెంబర్లకు పొంతన లేకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. అద్దంకి నగర పంచాయతీకి చెందిన 15 మంది కౌన్సిలర్ల సీరియల్ నెంబర్ తేడా ఉండటంతో అధికారులు ఓటింగ్‌కు అనుమతించ లేదు. దీంతో అధికారులు వారి గుర్తింపు కార్డులను సరిచేసి ఓటింగ్‌కు అనుమతించారు. ఒంగోలు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసే సమయానికి 292 ఓట్లు పోలయ్యాయి. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 395 ఓట్లుండగా అందులో 292 మంది అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దీంతో పోలింగ్ శాతం 73.92శాతంగా నమోదైంది. కందుకూరు డివిజన్‌లో  366 ఓట్లకుగాను 278మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే పోలింగ్ శాతం 75.95శాతంగా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. మార్కాపురం డివిజన్‌లోని 231మంది ఓటర్లకుగాను 185మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిల పోలింగ్‌ను తెలుగుదేశం అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి,  మంత్రి శిద్దా రాఘవరావు, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, మాజీ ఎంపీ కరణం బలరాం, ఎమ్మెల్యేలు కదిరిబాబూరావు, బాలవీరాంజనేయస్వామి, ఆమంచి కృష్ణమోహన్, జడ్‌పీ చైర్మన్ నూకసాని బాలాజీ  పరిశీలించారు. జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించినా ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న తెలుగుదేశం సభ్యులు సాయంత్రం వరకూ విపక్ష సభ్యులతో బేరసారాలు సాగిస్తూనే ఉన్నారు. సాధ్యమైనంత మందిని అప్పటికప్పుడు డబ్బులిచ్చి ఓటింగ్ కేంద్రాలకు తరలించారు.
 
బలరాం చిందులు
మాజీ ఎంపీ కరణం బలరామ కృష్ణమూర్తి పోలింగ్ కేంద్రం వద్ద హడావిడి సృష్టించారు.ఎన్నికల అధికారులపై విరుచుకుపడ్డారు. ఎవడిక్కడ ఉద్యోగం చేస్తోంది, కనీసం గుర్తింపు కార్డులు కూడా సరిగ్గా ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటూ ఫైరయ్యారు.
 
సీల్డ్ కవర్లో ఈదర
కోర్టు ఆదేశాల మేరకు తన ఓటు హక్కును వినియోగించుకున్న పొన్నలూరు జడ్‌పీటీసీ ఈదర హరిబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తన ఓటును బాక్స్‌లో కాకుండా సీల్డ్‌కవర్‌లో అధికారులకు అందించారు.

Advertisement
Advertisement