ఉరకలెత్తిన ఉత్సాహం | Sakshi
Sakshi News home page

ఉరకలెత్తిన ఉత్సాహం

Published Sun, Jul 9 2017 4:09 AM

ఉరకలెత్తిన ఉత్సాహం - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు 
 
వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం..జనం..జనం.. ఎటు చూసినా జనమే.. వైఎస్సార్‌సీపీ మూడో జాతీయ ప్లీనరీ మొదటి రోజు ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ప్రజాప్రస్థానం పేరిట నిర్వహిస్తున్న ఈ ప్లీనరీలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమాన జనసందోహంతో ప్రాంగణం కిటకిటలాడింది. ఊహించిన దానికన్నా అధిక సంఖ్యలో జనం హాజరయ్యారు.  యువత ఉత్సాహంతో కదం తొక్కింది.  ప్రాంగణంలోని సమావేశంలో ఎంత మంది ఉన్నారో అంతకు మూడింతలు, లోపలకు పోలేక చుట్టూ బయటే ఉండిపోయారు.  

పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీ వేదిక మీదకు వచ్చినపుడు ‘జై జగన్‌’ అనే నినాదంతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది. జగన్‌ అభివాదం చేసినా, ఎటు వైపు చూసినా యువత కేరింతలు కొట్టారు. నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. తీర్మానాలను నేతలు ప్రతిపాదిస్తున్నపుడు శ్రద్ధగా వినడమే కాక సమావేశాలు పూర్తయ్యేవరకు క్రమశిక్షణగా కూర్చోవడం కనిపించింది. పరిమిత సంఖ్యలోనే ప్రతినిధులను ఆహ్వానించినప్పటికీ  పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ అభిమానులు సొంత ఖర్చులతో స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఇక ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి’ పుస్తక ప్రతుల కోసం ప్రతినిధులు పోటీపడడంతో తీవ్ర తోపులాట జరిగింది. తొలిరోజైన శనివారం ఉదయం 7 గంటల నుంచే నేతలు, కార్యకర్తలు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోవడం ప్రారంభించారు.

విజయవాడ– గుంటూరు రహదారిని పెద్ద ఎత్తున స్వాగత ద్వారాలు, బ్యానర్లు, కటౌట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాష్ట్రంలోని జిల్లాలను ప్రతిబింబిస్తూ, ప్రముఖులు, మహనీయులను స్మరిస్తూ వారి పేర్లతో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడం అందరినీ ఆకట్టుకుంది. దారి పొడవునా పార్టీ జెండాల తోరణాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అంచనాలకు మించి నేతలు, కార్యకర్తలు తరలి రావడంతో ఆ రెండు కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి దాదాపు గంట సమయం పట్టింది. 
 
జై.. జగన్‌.. జోహార్‌ వైఎస్సార్‌..
ఇడుపులపాయ నుంచి ప్లీనరీకి విమానంలో బయలుదేరి వచ్చిన జగన్‌ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వేదికపై వచ్చారు. ఆయన వస్తున్నపుడు ప్రాంగణం అంతా అరుపులు, కేరింతలతో హోరెత్తింది. ‘జై...జగన్‌..! జోహార్‌ వైఎస్సార్‌...వైఎస్సార్‌ అమర్‌హై...’ అనే నినాదాలు మిన్ను ముట్టాయి. తొలుత ఆయన వేదికపై వైఎస్‌ విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. వేదికపైకి రావడానికి ముందే జగన్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.  
Advertisement
Advertisement