వైఎస్సార్‌సీపీ నాయకుడి బోరు బావి సీజ్ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడి బోరు బావి సీజ్

Published Thu, Oct 2 2014 1:48 AM

వైఎస్సార్‌సీపీ నాయకుడి బోరు బావి సీజ్

ప్రాధేయపడ్డా కరుణించని అధికారులు

 బత్తలపల్లి : మండలంలోని డీ.చెర్లోపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దరూరి రామకృష్ణకు చెందిన బోరు బావిని ఆ గ్రామ టీడీపీ నాయకుల ఒత్తిడితో రెవెన్యూ అధికారులు బుధవారం పోలీసు బందోబస్తు మధ్య సీజ్ చేశారు. బోరు సీజ్ చేస్తే పంటలు ఎండి పోతాయని, పెట్టుబడులు నష్ట పోయి అప్పులు పాలవుతామని అధికారులకు ఎంత మొర పెట్టుకున్నా కనికరం చూపలేదని బాధిత రైతు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా గ్రామానికి చెందిన గరిశల బావికి సమీపంలో బోరు వేసినందునే వాల్టా చట్టం ప్రకారం బోరును సీజ్ చేశామని ఇన్‌చార్జ్ తహశీల్దార్ సురేష్‌బాబు అన్నారు. దీనిపై బాధిత రైతు మాట్లాడుతూ తనకున్న భూమిలో 1000 చీనీ చెట్లు, 600 జామ చెట్లు, ఐదెకరాల్లో టమాటా పంట సాగు చేశామన్నారు. వీటికి చిత్రావతి నదిలో 30 ఏళ్ల క్రితం వేసుకున్న బోరు ద్వారా నీటిని పారిస్తూ పంటల్ని రక్షించుకుంటున్నామన్నారు. చిత్రావతి నది పరీవాహక ప్రాంతంలోని రైతులందరూ తన లాగే బోర్లు వేసుకున్నారని, ఇలాంటివి దాదాపు 100 నుంచి 120 వరకు ఉన్నాయని తెలిపారు. రాజకీయ కుట్రతోనే తమ బోరును సీజ్ చేశారని, తాను ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా పని చేసినందుకే ఈ కుట్ర జరిగిందని పేర్కొన్నారు. తనను ఆర్థికంగా దెబ్బ తీయడానికి టీడీపీ నాయకులు అధికారులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయాడు. న్యాయం జరగకుంటే కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటామని బాధితుడు హెచ్చరించాడు. కలెక్టర్‌గారు.. మా గ్రామానికి రండి... ఎంత మంది రైతులు చిత్రావతి నదిలో బోర్లు వేసుకున్నారు? చూడండి.. తాను వేసుకున్న బోరును, పంటలను పరిశీలించండి.. తమకు న్యాయం చేయండి..’ అంటూ పత్రికా ముఖంగా వేడుకున్నారు. తమకు 3 వారాలు గడువు ఇవ్వాలని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం అందజేసినా బోరును సీజ్ చేయడం ఎంత వరకు సమంజసమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బోరును సీజ్ చేసిన అధికారులకు మిగతా బోర్లు కనిపించలేదా? అంటూ పులువురు నిలదీశారు. ఆర్‌ఐ సుబ్బారావు, వీఆర్‌ఓ ఆదినారాయణ, ఎస్‌ఐ శాంతిలాల్, తదితరులు పాల్గొన్నారు.



 

Advertisement
Advertisement