20 ఏళ్లుగా నిద్రపోతున్నారా ? | Sakshi
Sakshi News home page

20 ఏళ్లుగా నిద్రపోతున్నారా ?

Published Thu, Nov 20 2014 1:44 AM

is sleeping from 20 years?

సంతనూతలపాడు: ‘కాలనీలో 20 ఏళ్ల నుంచి 50 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. క్రమం తప్పకుండా గతంలో పంచాయతీకి..ఇప్పుడు కార్పొరేషన్‌కు ఇంటి పన్నులు, నీటి పన్నులు కడుతున్నారు. ఇప్పటికిప్పుడు కాలనీని ఖాళీ చేయమని అధికారులు నోటీసులు ఇవ్వడం ఏంటి. ఇన్నేళ్లుగా నిద్రపోతున్నారా..కాలనీకి వైఎస్సార్ పేరు బదులు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే ఓకేనా’ అని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో పేర్నమిట్ట పంచాయతీ పరిధిలో..ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వైఎస్సార్ కాలనీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాల వారు 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. కాలనీలోని స్థలాలు ఎన్‌ఎస్‌పీ కాలువకు చెందినవని..డిసెంబర్ 1వ తేదీనాటికి ఖాళీ చేయకుంటే ఇళ్లను కూల్చేస్తామని ఎన్‌ఎస్‌పీ అధికారులు నోటీసులిచ్చారు. అయితే ఆ నోటీసుల్లో ఎక్కడా సర్వే నంబర్లను పేర్కొనలేదు. ఇదే కాలనీలో పలు రైస్ మిల్లులు, కార్పొరేట్ స్కూళ్లు ఉంటే వాటికి నోటీసులు ఇవ్వకుండా కేవలం వైఎస్సార్ కాలనీలోని ఇళ్ల వారికే పంపడం గమనార్హం.

ఈ క్రమంలో కాలనీవాసులు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బుధవారం కాలనీని సందర్శించారు. కాలనీలోని గృహాలను, వాటి డోర్ నంబర్లు, కరెంటు మీటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల నుంచి ఓ పక్క ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లించుకుంటూ ఇప్పుడు అవి ఎన్‌ఎస్‌పీ కాలువ స్థలాలన్న సాకు చూపి అధికారులు వారిని వీధులపాలు చేయాలని చూస్తే సహించేది లేదన్నారు.

అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మెప్పుకోసమే ఈ పనిచేస్తున్నారా అని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి కాలనీవాసుల తరఫున న్యాయపోరాటం చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.  వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. పేర్నమిట్ట మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు రావూరి లింగారెడ్డి మాట్లాడుతూ ‘అసలిక్కడ కాలువ ఉందా..అధికారం చేతిలో ఉందికదా అని అధికారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని అవసరమైతే గాలిలో కూడా మేడలు కట్టాం అంటారు. అసలు కాలనీకి వైఎస్సార్ పేరు పెట్టడం వల్లే కదా ఇదంతా..ఎన్టీఆర్ పేరు పెడితే అధికారుల కళ్లు చల్లబడతాయా..’ అని అన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు ఓబుల్‌రెడ్డి, కండే రమణాయాదవ్, ఈశ్వరరావు, ఎమ్ ఆంజనేయులు, టీ గోపి, కృష్ణారెడ్డి, చిరంజీవి తదితరులున్నారు.

Advertisement
Advertisement