ఆగడంపై జగడం | Sakshi
Sakshi News home page

ఆగడంపై జగడం

Published Fri, Jul 3 2015 12:58 AM

fighting

సాక్షి ప్రతినిధి, గుంటూరు:  రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణ అరాచకాలపై ఆరోపణలు టీడీపీ రాష్ట్ర కార్యాల యానికి చేరుకున్నాయి. నరసరావుపేటకు చెందిన కొందరు నాయకులు గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ను కలసి తమ బాధలు వెళ్లగక్కారు. నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని నెరుపుతున్న వ్యవహారాలు, ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివరించారు. దీనివల్ల పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఆయన ఆగడాలను ప్రశ్నించినందుకు తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఫిర్యాదు చేశారు.
 
  ఈ వివరాలను లోకేష్ సావధానంగా వినడమే కాకుండా సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ కోసం పనిచేసే వారికి తమ మద్దతు ఉంటుందని, అధైర్యపడొద్దని లోకేష్ వారికి భరోసా కలిగించినట్టు చెపుతున్నారు. అంతేకాకుండా శివరామకృష్ణ సస్పెండ్ చేసిన నాయకుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘మిమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం నాన్నగారికి మాత్రమే ఉంది’ అంటూ వారి వద్ద సభ్యత్వ కార్డులను తీసుకొని వారి మెడలోనే వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
 
  మీరు యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, పార్టీ అభివృద్ధికోసం కృషిచేయాలని కోరారు. శివరామకృష్ణకు సంబంధించిన అనేక విషయాలను లోకేష్ ప్రస్తావించడంతో అసమ్మతినేతలు ఖంగుతిన్నారు. త్వరలో నరసరావుపేట నియోజకవర్గానికి ఇన్‌చార్జిని నియమిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. లోకేష్‌ను కలసిన వారిలో అసమ్మతి నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవీంద్ర, పులిమి వెంకటరామిరెడ్డి, కానూరి శ్రీనివాసరావు, బాజీచౌదరి, చల్లా సుబ్బారావు, జాలాది సత్యమోహన్ తదితరులు ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement