మంత్రులకు చంద్రబాబు మరో షాక్! | Sakshi
Sakshi News home page

మంత్రులకు చంద్రబాబు మరో షాక్!

Published Fri, Sep 19 2014 2:38 PM

మంత్రులకు చంద్రబాబు మరో షాక్! - Sakshi

ప్రజలకే కాదు తన మంత్రివర్గంలోని మంత్రులకు ఊహించని షాక్ లిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే మంత్రులకు గ్రేడింగ్ ఇచ్చిన ఆయన మరో ఝలక్ ఇచ్చారు. మంత్రుల పేషీల్లో మీడియా అనుసంధాన అధికారి(ఎంఎల్ఓ)లను నియమించారు. 20 మంది టీడీపీ మద్దతుదారులను ఎంఎల్ఓలుగా నియమించేందుకు అధినేత పచ్చజెండా ఊపారు. ఇక మంత్రుల తరపున వీరే సమాచారం అందిస్తారు.

అధినేత నిర్ణయంపై కక్కలేక మింగలేక మంత్రులు సతమతమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు పీఆర్వోలను నియమించుకున్నారు. తాము నియమించుకున్న పీఆర్వోలను కొనసాగిస్తారో, లేదో తెలియక తలపట్టుకుంటున్నారు. ఎంఎల్ఓ వ్యవహారం తమకు తలనొప్పిగా తయారవుతుందని అమాత్యులు వాపోతున్నారు. వచ్చే వారం నుంచి తమ పనితీరును రోజువారీగా 'ట్యాబ్'ల ద్వారా సీఎం అంచనా వేయనున్నారన్న గుబులు మరోపక్క మంత్రులను పీకుతోంది.

ఎంఎల్ఓలను 'చినబాబు' లోకేష్, ఆయన స్నేహితుడు, సీఎంఓ కార్యాలయం ఓఎస్డీ అభిష్ట ఎంపిక చేశారు(ట). మంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల నియామకంలోనూ చక్రం తిప్పిన చినబాబు ఇప్పుడు కూడా కీలకపాత్ర పోషించారు. ఎంఎల్ఓలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. వీరికి నెలకు రూ.20 వేల నుంచి రూ. 28 వేల వరకు వేతనం, ఇతర అలవెన్సులు చెల్లించనున్నారని సమాచారం. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయనుంది.

అయితే ప్రభుత్వంలో పనిచేసిన అనుభవంలేని వారిని ఎంఎల్ఓలుగా ఎలా నియమిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కార్యదర్శుల నియామకంలో తమకెదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మంత్రులు కిమ్మనడం లేదు. తామెన్ని చెప్పినా చివరకు చినబాబు మాటే నెగ్గుతుందని తెలుసు కాబట్టి అమాత్యులు నోరు మెదపడం లేదు.

Advertisement
Advertisement