భలే చాన్స్! | Sakshi
Sakshi News home page

భలే చాన్స్!

Published Thu, Dec 18 2014 4:17 AM

Chance actually!

కర్నూలు : జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసును విచారణ పేరిట తుస్సుమనిపించిన ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులుకు కీలక స్థానం కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్‌ను కేసు నుంచి తప్పించినందుకు కృతజ్ఞతగా శ్రీనివాసులును ఎక్సైజ్ శాఖ నిఘా విభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో నియమించాలని డిప్యూటీ సీఎం సిఫారసు లేఖ ఇవ్వడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.
 
 డోన్ మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని రాఘవేంద్ర గార్డెన్స్‌లో నవంబర్ 2వ తేదీన భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏ5గా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ గౌడ్‌ను విచారణ పేరుతో కేసులో నుంచి తప్పించారు.
 
 అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో మూడేళ్లుగా పనిచేస్తున్న రాజశేఖర్‌గౌడ్‌ను అదే కాంపౌండ్‌లో ఉన్న డీటీఎఫ్ విభాగానికి అక్కడున్న రాముడును ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి నియమించాలని అదే లేఖలో డిప్యూటీ సీఎం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా సుర్జీత్‌సింగ్ ఏడాది కాలంగా పని చేస్తున్నారు. ఆయన తిరుపతికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న హేమంత్ నాగరాజు పని ఒత్తిడి తట్టుకోలేక బదిలీపై వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ ఎనిమిది నెలలుగా సెలవులో ఉన్నారు. ఈయన గతేడాది జులైలోనే పదవీ విరమణ పొందాల్సి ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల వయో పరిమితి రెండేళ్లు పెంచడంతో ఆయన కొనసాగుతున్నారు. వీరందరూ కూడా కీలక స్థానాల కోసం తెలుగు తమ్ముళ్లను ఆశ్రయించడంతో డిప్యూటీ సీఎం తన లెటర్ హెడ్‌పై ప్రభుత్వానికి సిఫారసు లేఖ ఇచ్చారు.
 
 సిఫారసు లేఖపై యువనేత ఆరా...
 జిల్లా ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ప్రేమ్ ప్రసాద్, హేమంత్ నాగరాజు, సుర్జీత్‌సింగ్, రాజశేఖర్ గౌడ్, శ్రీనివాసులు, రాముడు, శ్రీలతతో పాటు మరికొంతమంది అధికారులకు డిప్యూటీ సీఎం ఇచ్చిన సిఫారసు లేఖపై ముఖ్యమంత్రి తనయుడు, యువనేత నారా లోకేష్ తన వ్యక్తిగత సహాయకులతో ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల పనితీరు, ప్రవర్తన, గతంలో ఎక్కడ పని చేశారు.
 
  ఏ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారు, అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా తదితర అంశాలపై టీడీపీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు లోకేష్ వ్యక్తిగత సహాయకులు ఫోన్‌చేసి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అధికారుల పనితీరుపై కొంతమంది తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల గురించి పూర్తి సమాచారాన్ని తెలుగు తమ్ముళ్లు చేరవేసినట్లు తెలిసింది.
 
 ఎనిమిది నెలలుగా డీసీ పోస్టు ఖాళీ
 జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా పని చేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఎనిమిది నెలలుగా ఈ పోస్టు ఖాళీ ఉంది. ప్రేమ్‌ప్రసాద్ సెలవుపై వెళ్లడంతో అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ నాగరాజు డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు సిద్ధపడటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అధికారి కోసం వేట ప్రారంభించింది. అయితే ఎవరూ కూడా ఇక్కడ పని చేయడానికి ముందుకు రావడం లేదని ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతోంది.
 
  క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవడం, మరికొంతమంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాలతో ఇక్కడ డీసీగా విధులు నిర్వహించడం అధికారులకు కష్టసాధ్యంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో మూడు అంతర్ రాష్ట్ర  చెక్‌పోస్టులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అక్కడ సీఐలు, సిబ్బంది నియామకం జరగలేదు. అలాగే ఆరు సీనియర్ అసిస్టెంట్లు, రెండు సూపరింటెండెంట్ పోస్టులు, 12 జూనియర్ అసిస్టెంట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 15 మంది సీఐలు, 12 మంది ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
 
 వీటి కారణంగా జిల్లా ఎక్సైజ్‌శాఖలో పరిపాలన పూర్తిగా కుంటు పడింది. జిల్లాలో 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కర్నూలు మినహా అన్ని స్టేషన్లలోను మామూళ్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. అధికారుల పనితీరుపై ఇప్పటికే 12 మందిపై చార్జి మెమోలు జారీ అయ్యాయి. వాటిపై శాఖాపరమైన విచారణ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖను నియంత్రించాల్సిన డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్రస్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది. బదిలీల ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి పేషీలో ఉంది. రెండు రోజుల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి బదిలీల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 

Advertisement
Advertisement