సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హత్య | Sakshi
Sakshi News home page

సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హత్య

Published Thu, Mar 26 2015 3:37 AM

Central Bank manager murder

తుని రూరల్ :విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం ఎస్.తిమ్మాపురం (అడ్డురోడ్డు) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి మేనేజరు పసలపూడి ఆంజనేయులు (49) హత్యకు గురయ్యారు. తుని మండలం తేటగుంట శివారు రాజులకొత్తూరు గ్రామం వెనుక చంటిరాజుగారి తోట వద్ద బుధవారం ఉదయం స్థానికులు ఒక మృతదేహాన్ని గుర్తించారు. వీఆర్వో రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలియడంతో  తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, రూరల్ ఎస్సై ఎం.అశోక్, ఏఎస్సై భూషణం సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు చేతులు వెనక్కి కట్టి హత్య చేశారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్, బ్యాంకు గుర్తింపు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డులు ఆధారంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా గుర్తించారు.
 
 గుర్తింపు కార్డుల్లో పేర్కొన్న వివరాలను బట్టి తాడేపల్లిగూడెంకు చెందిన వ్యక్తిగా భావించినప్పటికీ తునిలోని బ్యాంకు అధికారుల ద్వారా ఆంజనేయులు ఎస్.తిమ్మాపురం బ్రాంచి మేనేజరుగా పని చేస్తున్నట్టు తెలుసుకున్నారు. బంధువులకు సమాచారం అందించి, పోస్ట్‌మార్టం నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని, తునిలో నివాసం ఉంటూ రోజూ ఎస్.తిమ్మాపురం శాఖకు వెళ్లివస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు బస్సు ఎక్కేందుకు అడ్డురోడ్డు బస్టాండ్‌లో ఉన్నట్టు సహ ఉద్యోగులు తెలిపినట్టు సీఐ తెలిపారు. మృతుడి స్వగ్రామం తాళ్లరేవు మండలం పటవల గ్రామమని సీఐ తెలిపారు. కాకినాడ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement
Advertisement