‘రాజధాని’లో 5 శాతం పేదలకు | Sakshi
Sakshi News home page

‘రాజధాని’లో 5 శాతం పేదలకు

Published Fri, Sep 30 2016 2:17 AM

‘రాజధాని’లో 5 శాతం పేదలకు

సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతం మొత్తం విస్తీర్ణంలో 5 శాతాన్ని నిరుపేదల నివాసాల కోసం కేటాయిస్తామని గురువారం హైకోర్టుకు సీఆర్‌డీఏ కమిషనర్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్ హామీ ఇచ్చారు. సీఆర్‌డీఏ పరిధిలో నిర్మాణాలన్నీ పూర్తయి, ల్యాండ్ పూలింగ్ కింద భూ యజమానులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చిన తరువాత చట్ట ప్రకారం 5 శాతాన్ని నిరుపేదల నివాసాల కోసం ఇస్తామని ఆయన తెలిపారు. ఈ హామీని న్యాయస్థానం నమోదు చేసుకుంది.

తదుపరి విచారణను వచ్చే నెల 25కు వాయిదా వేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని ప్రాంతం మొత్తం విస్తీర్ణంలో 5 శాతాన్ని నిరుపేదల నివాసాల కోసం కేటాయించాలని, అయితే ఆ దిశగా సీఆర్‌డీఏ అధికారులు ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని, ఆ విస్తీర్ణాన్ని గుర్తించి దానికి కంచె వేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తుళ్లూరు మండలం, రాయపూడి గ్రామానికి చెందిన పెద్దమాను కోటమ్మ, మరో 373 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. జాతీయస్థాయి మార్గదర్శకాల ప్రకారం మొత్తం విస్తీర్ణంలో 10 శాతాన్ని నిరుపేదల నివాసాల కోసం కేటాయించాల్సి ఉందని పిటిషనర్లు తెలిపారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం 5 శాతం కేటాయించాలన్నారు. అయితే ప్రభుత్వం తుది మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్లలో కేవలం 3 శాతాన్ని మాత్రమే చూపిందని, ఇందులో ఎంత విస్తీర్ణాన్ని నిరుపేదల నివాసాల కోసం ఇస్తారో ఎక్కడా స్పష్టం చేయలేదని వివరించారు.

Advertisement
Advertisement