అబద్ధాల్లో బాబు దిట్ట | Sakshi
Sakshi News home page

అబద్ధాల్లో బాబు దిట్ట

Published Tue, May 26 2015 1:39 AM

అబద్ధాల్లో బాబు దిట్ట - Sakshi

పట్నంబజారు(గుంటూరు) :  అబద్ధాలు చెప్పటంలో ప్రపంచవ్యాప్తంగా పోటీలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రథమస్థానం దక్కి, గిన్నిస్ రికార్డు నెలకొలుపుతారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన అబద్ధాలను, మోసాలను ఎండగట్టేందుకు మంగళగిరి వేదికగా జూన్ 3,4 తేదీల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న సమర దీక్షను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టి ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టడానికే సమర దీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
 
 గుంటూరు నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో సోమవారం ఆ పార్టీ జిల్లా విస్త్రృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించగా, తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సమర దీక్ష పోస్టర్లు ఆవిష్కరించారు. ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు మాట్లాడిన అనంతరం వారి సమస్యలను నేతలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగ, చట్టవ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు మరోసారి నాంది పలికిన ఘనత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందన్నారు.
 
 ఈ క్రమంలో కార్యకర్తలకు ఎలాంటి కష్టం కలిగించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోసం, ద్రోహం, వెన్నుపోటు అనే పదాలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబని విమర్శించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ జననేత జగన్ చేపడుతున్న సమరదీక్షతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గుండెల్లో గు బులు పట్టుకుందన్నారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ బాబు వస్తే జాబు ఖాయమని చె ప్పారని, ఆయన అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ఎద్దేవా చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే  మొహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒకరు సమర దీక్షకు తరలి రావాల్సిన అవసరం ఉందన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు.
 
  బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ శాసనసభలో వైఎస్ జగన్ సంధించే ప్రశ్నాస్త్రాలకు సమాధానాలు చెప్పలేక టీడీపీ నేతలు తెల్లముఖాలు పెడుతున్నారన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం సంవత్సర కాలంలో పూర్తి వైఫల్యాలను మూటగట్టుకుందన్నారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ రైతుల కడుపులు కొట్టి అక్రమంగా రాజధాని నిర్మాణం కోసం భూములు లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసిన టీడీపీ వైఎస్సార్ సీపీ లక్ష్యంగా పనిచేస్తోందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కలసికట్టుగా తిరుగుబాటు చేయాలన్నారు. రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను మంటగలిపేలా టీడీపీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు.
 
 గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ సంవత్సర పాలనలో ఏం చేశారని విజయోత్సవ సభలు పెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అనంతరం  ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని తీర్మానం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ నేతలు ఆళ్ల పేరిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర క్రిస్టీనా, సురేష్‌బాబు, చల్లామధుసూదన్‌రెడ్డి, కావటి మనోహరనాయుడు, ఎండీ నసీర్‌అహ్మద్, జయలక్ష్మి, సయ్యద్‌మాబు, కొత్తా చిన్నపరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, పానుగంటి చైతన్య, మండేపూడి పురుషోత్తం, బండారు సాయిబాబు, మొగిలి మధు, కోవూరి సునీల్, సలాంబాబు, కిలారి రోశయ్య,  డైమండ్‌బాబు, ఎన్.శారదాలక్ష్మి, శానంపూడి రఘురామి రెడ్డి, శిఖాబెనర్జీ, జేపి,  తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, ఉత్తంరెడ్డి, ప్రభాకరరావు, చింకా శ్రీనివాసరావు  పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement