మళ్లీ రిజిస్ట్రేషన్ బాదుడు | Sakshi
Sakshi News home page

మళ్లీ రిజిస్ట్రేషన్ బాదుడు

Published Wed, Jul 23 2014 2:20 AM

Again Registration Income increase

తాడేపల్లిగూడెం : ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో నిమగ్నమైన రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువను పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయూన్ని పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఏటా ఆగస్ట్ 1న భూముల విలువను పెంచుకోవచ్చనే నిబంధనను ఆసరా చేసుకుని భూముల విలువ పెంపు నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించనుంది. దీనికి సంబంధించి మంగళవారం ఏలూరు, భీమవరం రిజిస్ట్రార్ జిల్లాల అధికారులతో చర్చలు జరిపి సమాచారం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న భూముల మార్కెట్ విలువపై 70 శాతం విలువను పెంచి ప్రభుత్వ ధరగా నిర్ణయించాలనే ఆలోచనకు అధికారులు వచ్చినట్టు సమాచారం. ఉదాహరణకు గజం స్థలం మార్కెట్ ధర ప్రకారం రూ.14 వేలు ఉంటే, ప్రభుత్వ ధర రూ.10 వేల వరకు ఉంటుంది. తాజా నిర్ణయం ప్రకారం ప్రస్తుతం రూ.10 వేల విలువ ఉన్న భూమి ధరను రూ.17 వేలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
 ఇలా చేయడం వల్ల భూముల రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే ఫీజు మొత్తం భారీగా పెరుగుతుంది. తద్వారా భారీ ఆదాయూన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూముల విలువను మదింపు చేయడానికి అనామలిస్ కమిటీ ప్రాంతాల వారీగా సమాచారం సేకరిస్తుంది. అనంతరం కనీస ధర, గరిష్ట ధర నిర్ణయిస్తుంది. దీని ప్రకారం తాడేపల్లిగూడెంలో ధరల మదింపు కమిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా, జిల్లా పరిషత్ సీఈవో, డీఆర్‌వో, మునిసిపల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. భూముల విలువకు పెంచే అంశానికి సంబంధించి ప్రాంతాల వారీగా ఇప్పటికే స్థానిక అధికారుల నుంచి సమాచారం సేకరించారు. రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ స్వయంగా భూములను పరిశీలించి ఆయా ప్రాంతాలలో ధరలను నిర్ణయిస్తారని సమాచారం.

 

Advertisement
Advertisement