No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, May 4 2024 12:05 AM

No Headline

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్‌ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్‌ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్‌షోలు, బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.

ఆదివారం రాహుల్‌ గాంధీ..

నాగర్‌కర్నూల్‌ నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లురవి గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఎరవ్రల్లి చౌరస్తాలో సాయంత్రం జరిగే బహిరంగసభలో పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. రాహుల్‌ గాంధీ ఆరు నెలల్లో ఉమ్మడి జిల్లాకు రావడం ఇది ఐదోసారి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కోస్గిలో రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభతో పాటు మహబూబ్‌నగర్‌, గద్వాల, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్నారు.

కేటీఆర్‌.., హరీశ్‌రావు..

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ఆయా పార్లమెంట్‌ స్థానాల్లో నిర్వహించిన రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లకు హాజరై పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వారంలో ప్రచార గడువు ముగిసేలోపు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌), మరో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కొత్తకోట, దేవరకద్ర, మక్తల్‌, భూత్పూర్‌, నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌కు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement